Friday, May 10, 2024

వివక్షకు పరాకాష్ఠ

- Advertisement -
- Advertisement -

KTR Letter to Mansukh Mandaviya over bulk drug park

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోడీ సర్కార్ మొండి చేయి
రాష్ట్రం పట్ల వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కేంద్రం
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలం
భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించింది.
అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం దారుమం
ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనం
వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కోరుతూ కేంద్ర కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రికి కెటిఆర్ లేఖాస్త్రం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నింటిలోనూ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిస్తోందని విరుచుకపడ్డారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కకపోవడమే ఇందుకు నిదర్శమని మండిపడ్డారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు. అయినప్పటికీ దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయినహైదరాబాద్‌ను కావాలనే ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోడీ సర్కార్ వివక్షాపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్ర సర్కార్ మరోసారి బయటపెట్టుకుందని కెటిఆర్ విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మన్న్సుక్ మాండవియాకు శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోడీ సర్కార్‌కు అభివృద్ధికి పెద్దపీఠ వేయకుండా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. ఫెడరల్ స్పూర్తికి కేంద్రం పూర్తిగా తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. మొదటి నుంచి తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకింత వివక్ష అని ఆ లేఖలో కెటిఆర్ ప్రశ్నించారు. 70 శాతంపైగా ముడిసరుకుల కోసం మన దేశ ఫార్మా రంగం చైనాపై ఆధారపడుతోందన్న ఆయన మారుతున్న ప్రపంచ రాజకీయాల దృష్ట్యా బల్క్ డ్రగ్ తయారీలో దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2015 లో 2000 ఏకరాల్లో వివిధ రాయితీలు, ప్రోత్సహకాలతో బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అయితే అపరిమిత అలస్యం తరువాత కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పార్కు ఏర్పాటు అవసరం పట్ల కళ్లు తెరిచిన కేంద్రం 2020లో అధికారిక ప్రకటన చేసిందన్నారు. తదనంతరం సైతం పార్కు కోసం ప్రతిపాదనలు స్వీకరించి వాటిపైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు సంవత్సరాలు అలస్యం చేసిందన్నారు.

పలుమార్లు ప్రతిపాదనలు పంపాం
గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని కేంద్రమంత్రికి రాసిన లేఖలో కెటిఆర్ వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను కూడా సమర్పించామన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి పలుమార్లు చాలా స్పష్టంగా తెలియచేశామన్నారు. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను కూడా అందచేశామన్నారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

కేంద్రం టైంపాస్ చేసింది
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో 2021 వరకు టైంపాస్ చేసిందని కెటిఆర్ ఆరోపించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని సిద్దంగా ఉన్న తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను ఆశ్చర్యానికి గురించేసిందన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్ పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసంగా మూడు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. చైనాతో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ ఫార్మా రంగాన్ని నిజంగా అత్మనిర్భరత వైపు త్వరగా తీసుకుపోవాలన్న కేంద్ర ఉద్దశ్యం పట్ల చిత్తశుద్ది ఉంటే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టే ప్రాంతాలకు పార్కుల కేటాయింపు చేసేది కాదన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటులో అన్ని రకాల అనుకూలతలు, అనుమతులు ఉన్న ఫార్మాసిటీని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన నిబద్ధత లేమిని నరేంద్ర మోడీ సర్కార్ బయటపెట్టుకుందని కెటిఆర్ మండిపడ్డారు.

మోడీ నిర్వాహకంతో దేశానికే తీరని నష్టం
రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దీంతో దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి తూట్లు పొడవడమేనని అన్నారు. మోడీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా భారీగా నష్టపోతుందన్నారు.

ఎంపిక పట్ల అనేక అనుమానాలు
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీర్ఘకాలిక విజన్‌తో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కామన్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ, పూర్తిస్థాయి హీటింగ్, కూలింగ్ వ్యవస్థల ఏర్పాటు, కామన్ డ్రగ్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ లాబరేటరీ వంటి అనేక వినూత్న విభాగాల సమాహారంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం ఇదివరకే గుర్తించిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. దీంతోపాటు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కింద హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ప్రాధాన్యతను దక్కించుకుందన్నారు. ఫార్మాసిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రశంసించిన కేంద్రమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్‌ను విస్మరించడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఈ ఎంపిక పట్ల అనేక
అనుమానాలు ఉన్నాయని కేంద్రమంత్రికి రాసిన లేఖలో కెటిఆర్ వ్యాఖ్యానించారు.

దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు
దేశీయ ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిజంగానే కట్టుబడి ఉంటే తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో రాష్ట్రాన్ని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని కెటిఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసి తమ ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలవాలని కేంద్రాన్ని కోరారు.

KTR Letter to Mansukh Mandaviya over bulk drug park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News