Monday, April 29, 2024

జిహెచ్‌ఎంసి పరిధిలో వారంలో ఇండ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఆ పని వేగవంతంగా జరుగుతుందని అన్నారు. 70 వేల ఇళ్లు పంపిణీని.. ఐదారు దశలో పూర్తి చేయనున్నారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులకు కెటిఆర్ ఆదేశించారు. ఇళ్ల పంపిణీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సూచించారు.జిహెచ్‌ఎంసి పరిధిలో ఇళ్ల నిర్మాణం, పంపిణీ సంబంధిత అంశాలపై బుధవారం మంత్రి కెటిఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఉపసభాపతి పద్మారావుగౌడ్, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇళ్ల పంపిణీపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పూర్తి అయిందని, ఇందులో సుమారు 4,500లకు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను ఐదు లేదా ఆరు దశల్లో వేగంగా అందిస్తామని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై మంత్రులు పలు సూచనలు, సలహాలు చేశారు. నగర ప్రజలు ఇళ్ల పంపిణీ విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.

లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి అర్హులను గుర్తిస్తోందని వివరించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులందరికి కేటాయించనున్న ఇళ్ల వద్దే అప్పగించేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సమావేశంలో చర్చించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News