Saturday, April 27, 2024

సంస్కృతిలా హరితహారం

- Advertisement -
- Advertisement -

 సిఎం కెసిఆర్‌ను మించిన గొప్ప హరిత ప్రేమికుడు లేడు

రాష్ట్రంలో అర్బన్‌పార్కుల అభివృద్ధి, మున్సిపాలిటీల్లో 10% గ్రీన్‌బడ్జెట్‌కే
రాష్ట్రంలో 24% నుంచి 29 శాతానికి పెరిగిన గ్రీన్‌కవర్
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు బాల్కసుమన్, కె.పి.వివేకానంద, నేతి సుభాష్‌రెడ్డి, సంజయ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎక్కడా లేరు అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ర్టాషంలో పెట్టని విధంగా మున్సిపాలిటీ బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను పెట్టారని చెప్పారు. పట్టణ హరిత ప్రణాళిక రూపొందించుకుని మొక్కలు నాటుతున్నారని తెలిపారు. హరితహారం ఒక సంసృతిగా మారిందన్నారు. ప్రతి పౌరుడి నరనరాన హరితహారం కార్యక్రమం ఉండిపోయిందని పేర్కొన్నారు. మొక్కలను బతికించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి గ్రీన్ కవర్ 24 శాతంగా ఉంగడా, ఇప్పుడు అది 29 శాతానికి పెరిగిందన్నారు. ఈ ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పచ్చదనం పెంపొందించడంలో రాజకీయాలు ఏమి ఉండవని,సిఎం కెసిఆర్ భవిష్యత్ తరాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 1893 అభివృద్ధి చెందిన అర్బన్ పార్కులు ఉన్నాయని చెప్పారు. ఈ పార్కులతో పాటు అదనంగా మరో 1799 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 797 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మొత్తంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 587, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 1109, హెచ్‌ఎండిఎ పరిధిలో 103 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మరికొన్నింటిని ల్యాండ్ స్కేప్, అర్బన్, పంచతత్వ పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించమన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్ జిల్లాలో 287 ఎకరాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం జిహెచ్‌ఎంసి పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ బ్రహ్మాండమైన పార్కులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొనారు. హైకోర్టు సిజె ఆక్సిజన్ పార్కును చూసి అభినందించారని గుర్తు చేశారు. పార్కులలో నీటి కొరత రాకుండా వాటర్ హార్వెస్టింగ్ విధానం, వాటర్ రీ యూజింగ్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. సైక్లింగ్ కోసం ఇప్పటికే పాలపిట్ట పేరుతో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని, మరిన్ని సైక్లింగ్ ట్రాక్‌లు, స్కేటింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

పాడి పరిశ్రమకు ప్రోత్సాహం : మంత్రి తలసాని
దేశంలో ఏ ర్టాషంలోని లేని విధంగా మన రాష్ట్రంలో పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాడి పరిశ్రమ పట్ల సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పాడి పరిశ్రమపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ర్టాషంలో 2 లక్షల 13 వేల మంది రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పాడి పశువుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో గ్రీన్ ఫీల్డ్ మెగా డైరీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. గదాలలో త్వరలో విజయ డైరీ వస్తుందని చెప్పారు. 4 సహకార డైరీలకు పాలు పోసే పాడి రైతులకు ఒక్కో లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రోత్సాహకాల కోసం రూ. 248 కోట్ల 3 వేలు విడుదల చేశామని పేర్కొన్నారు. విజయ డైరీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని మంత్రి తెలిపారు. ఎస్‌సి,ఎస్‌టిలకు 75 శాతం, బిసిలకు 50 శాతం సబ్సిడీతో పాడి గేదేలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రోత్సాహకాలు ఉండేవి కావని, ర్టాషం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఉదార స్వభావంతో ఒక్కో లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం అడగకుండానే ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పారు. కానీ కొవిడ్ పరిస్థితుల వల్ల కొంత ఆటంకం కలిగిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు.
కార్మికుల సంక్షేమమే మా ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు ఇతర కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 9 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం కోసం పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 9,15,287 మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. 9 సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 1,512 కోట్ల 85 లక్షల 10 వేల 821 రూపాయాలు భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులకు, వారి కుటుంబాలకు అందజేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల పరిహారాన్ని ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఈ పరిహారం రూ. 2 లక్షలు ఉండేదని గుర్తు చేశారు. అంగవైకల్యం కలిగితే గతంలో రూ. 2 లక్షలుగా పరిహారాన్ని 5 లక్షలకు, సహజ మరణం చెందితే రూ.30 వేలుగా ఉన్న పరిహారాన్ని నుంచి రూ.60 వేలకు పెంచామని, అంత్యక్రియల కోసం రూ. 5 వేల నుంచి రూ.30 వేల వరకు, వివాహ కానుక, ప్రసూతి సాయానికి రూ.5 వేల నుంచి రూ.30 వేలకు పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 2,203 కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ. 6 లక్షల చొప్పున 115 కోట్ల 75 లక్షల 43 వేల 382 రూపాయాలు చెల్లించామని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని, కార్మికుల కోసం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

మలేషియా, సింగపూర్‌కు ధీటుగా టూరిజంను అభివృద్ధి చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ధీటుగా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ది చేస్తామని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో పర్యాటకాభివృద్ధిపై ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. జలవనరులు ఉన్న ప్రాంతాలన్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందుతున్న సమయంలో కోవిడ్ దెబ్బతీసిందన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాకాల సరస్సు వద్ద నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వరంగల్‌లో కాళోజీ ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశామన్నామని చెప్పారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో మంచి టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నదులు, సరస్సులపై అద్భుతమైన దృశ్యాలను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి : జీరో అవర్‌లో జోగు రామన్న
అదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంఎల్‌ఎ జోగు రామన్న కోరారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ, తమ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఇస్తామని గతంలో సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆ కళాశాలలు కేటాయించాలని కోరారు. ఎంఎల్‌ఎ కౌసర్ మొయినుద్దీన్ మాట్లాడుతూ, పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. తూర్పు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి మున్సిపాలిటీలో డంప్ యార్డు కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని, ప్రభుత్వం త్వరగా గ్రామపంచాయతీ భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన అంశాలను మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు నోట్ చేసుకున్నామని, వాటిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు.
ఎంఎల్‌ఎలంతా మాస్కులు ధరించాలి : స్పీకర్
శాసనసభలో ఎంఎల్‌ఎలంతా ముక్కు, నోరు కవర్ అయ్యేలా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఎంఎల్‌ఎలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీలో సభ్యులందరూ భౌతిక దూరం పాటించాలని తెలిపారరు. కరోనా కారణంగా పశ్నోత్తరాల సమయం గంట మాత్రమే ఉంటుందని, సభ్యులు ప్రశ్నలను సూటిగా అడగాలని, సమాధానాలు కూడా సూటిగానే ఉండాలని చెప్పారు. జీరో అవర్ అరగంట పాటే ఉంటుందని, ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుందని తెలిపారు. సభ్యులందరూ సభ సజావుగా జరిగేలా కు సహకరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

KTR Speech at Assembly over Haritha Haram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News