Wednesday, May 1, 2024

మహారాష్ట్ర స్పీకర్ తీర్పు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో పాలక, ప్రతిపక్ష శివసేన వర్గాల మధ్య పార్టీ ఫిరాయింపుల ఉదంతం ఇంత కాలానికి ఒడ్డుకి చేరుకొన్నది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిపై బుధవారం ప్రకటించిన తీర్పు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా ఉంటుందని, యథాతథ స్థితిని కాపాడుతుందనేది ఊహించని పరిణామం కాదు. ఒక ప్రభుత్వాన్ని కూలదోసి మరో దానికి ప్రాణం పోయడానికి ఎంఎల్‌ఎలు తాము ఎన్నికైన పార్టీని వదిలిపెట్టి కొత్త పార్టీలో చేరి ఫిరాయింపుకి పాల్పడినప్పుడు రాజ్యాంగం 10వ షెడ్యూలు కింద అటువంటి వారి శాసన సభ్యత్వాల రద్దును కోరుతూ దరఖాస్తులు పెట్టుకోడానికి అవకాశమున్నది. ఫిరాయింపులను నిరోధించి ప్రజల తీర్పును కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం వచ్చిన ఈ చట్టం కింద ఇటువంటి దరఖాస్తులు దేశంలోని అనేక రాష్ట్రాల్లో దాఖలయ్యాయి. నిర్ణయాధికారం చేతిలో ఉన్న స్పీకర్‌లు నిష్పాక్షికతను కోల్పోయి పాలక పక్ష వ్యవస్థలో భాగం అయిపోడంతో వారు వీటిని అటకెక్కించడం మామూలు అయిపోయింది.

మహారాష్ట్ర విషయంలో సుప్రీం కోర్టు పని కట్టుకొని వెంటపడడం, గడువు నిర్ణయించడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో అపరిష్కృతంగా ఉన్న సభ్యత్వ రద్దు దరఖాస్తులపై నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి వీలు లేదని గత ఏడాది సెప్టెంబర్‌లో హెచ్చరించిన సుప్రీం కోర్టు అందుకు గడువు కూడా విధించింది. ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే స్పష్టత లేదు. సుప్రీం కోర్టు మొదటిసారిగా మహారాష్ట్ర శివసేన వర్గాల పిటిషన్లపై శ్రద్ధ చూపి స్పీకర్ నిర్ణయం తీసుకొనేలా చేయడం మంచి పరిణామం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన పార్టీ అని స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీర్పు చెప్పారు. ఆయనే పార్టీ నాయకుడని కూడా నిర్ధారించారు. ఇది ఉద్ధవ్ థాకరేకి అసాధారణమైన దెబ్బ. ఆది నుంచి శివసేన పార్టీకి అన్నీ అయి దానిపై సర్వాధికారాలు అనుభవిస్తూ వచ్చిన థాకరేలు ఇప్పుడు దాని మీద ఆధిపత్యాన్ని కోల్పోతున్నారు.

అందుకే స్పీకర్ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తానని ఉద్ధవ్ ప్రకటించారు. పార్టీలో ప్రత్యర్థి వర్గాలు తలెత్తినప్పుడు ఉద్ధవ్ థాకరే వర్గం తరపు సునీల్ ప్రభు విప్ హోదాను కోల్పోయాడని, ముఖ్యమంత్రి వర్గంవాడైన భరత్ గోగా వాలేనే సాధికారిక విప్ అని కూడా స్పీకర్ స్పష్టం చేశారు. ఆ విధంగా పార్టీని చీల్చి అధికారాన్ని హరించిన ముఖ్యమంత్రి షిండేకి సర్వామోదాన్ని ప్రసాదించారు. తీర్పులో స్పీకర్ ఉపయోగించిన పదజాలమే సుప్రీం కోర్టులో ఉద్ధవ్ కేసుకు బలం చేకూరుస్తుందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యానం గమనించదగినది. మహారాష్ట్రలో ఎదురులేని శక్తిగా ఉండిన థాకరేల శివసేన గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై పేచీ వచ్చి భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకోడం, కాంగ్రెస్, ఎన్‌సిపిల మద్దతుతో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. బిజెపి చేపట్టిన ప్రతీకార రాజకీయాల్లో భాగంగా 2022 జూన్‌లో శివసేనలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు సంభవించింది.

మెజారిటీ శివసేన శాసన సభ్యులను కూడగట్టి ఆ పార్టీలో ఆయన చీలిక తెచ్చారు. పర్యవసానంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. మహావికాస్ అఘాది కూటమి అధికారాన్ని కోల్పోయింది. బిజెపి మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటయింది. షిండే, థాకరే వర్గాలు రెండూ ఒకరి మీద ఒకరు శాసన సభ్యత్వాల రద్దు పిటిషన్‌లు వేసుకొన్నారు. 50 మంది సభ్యులుండిన శివసేన చీలిన తర్వాత 40 మంది షిండే వర్గంలో చేరిపోయారు. ఎన్నికల సంఘం శివసేన పార్టీ గుర్తును షిండే వర్గానికి కట్టబెట్టగా పార్టీపై పూర్తి హక్కును స్పీకర్ నర్వేకర్ ఆ వర్గానికే ఇచ్చారు. రెండు వర్గాల్లోని ఏ ఒక్క ఎంఎల్‌ఎ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయకపోడం విశేషం. అధికారం అండతో తమదే పైచేయి చేసుకోగలిగినప్పటికీ ప్రజా న్యాయస్థానంలో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదనే స్పృహ ముఖ్యమంత్రి షిండే వర్గంలో లోపించలేదనిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ ఉద్ధవ్ థాకరేకు జనంలో సానుభూతిని పెంచే అవకాశాలున్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఈ ఏడాది రెండో సగంలో జరగవలసి ఉన్నాయి. శివసేన వర్గాల సభ్యత్వ రద్దు పిటిషన్లపై ఈ నెల 10 తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని గడువు విధించిన సుప్రీం కోర్టు ఫిరాయింపుల నిరోధ చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఇది స్పీకర్లందరికీ శిరోధార్యం కావాలి. మహారాష్ట్రలోనే ఎన్‌సిపిలో చీలిక తెచ్చి ఉపముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ వర్గానికి చెందిన శాసన సభ్యుల సభ్యత్వ రద్దు పిటిషన్లపైనా త్వరగా నిర్ణయం తీసుకోవలసిందిగా స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తెచ్చి స్పీకర్లకు నిర్ణీత గడువు పెట్టడమో, నిర్ణయాధికారాన్ని వారి నుంచి తొలగించడమో అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News