Tuesday, April 30, 2024

మహాత్మాఫూలే దార్శనికత దేశానికి ఆదర్శం : లింబాద్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచన, తాత్వికత సమకాలీన సమాజానికి మార్గనిర్దేశనం చేస్తాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత రెండు రోజులుగా మహాత్మా జ్యోతిబాఫూలేపై జరుగుతున్న జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పూర్వం సమాజంలో అంటరానితనం, అవిద్య వంటి ఎన్నో అసాంఘిక దురాచారాలను ఎదుర్కొని మహిళా విద్య, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫూలే అని అన్నారు. ఫూలేని అధ్యయనం చేయకుండా భారతదేశ చరిత్ర అర్థం కాదని, ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ అందించిన భావజాలం ఈ దేశ గతిని మార్చిందన్నారు. సమాజాన్ని మార్చాలనుకునే ప్రతీవ్యక్తి ఫూలే, అంబేద్కర్ తాత్వికతను అధ్యయనం చేయాలన్నారు.

అనంతరం ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ ప్రసంగిస్తూ బడుగు, బలహీన వర్గాల వారి కోసం ఫూలే చేసిన కృషి ప్రశంసనీయమని, ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని పేర్కొన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ నుంచి ఆవిర్భవించిన కులవ్యవస్థ భారత దేశంలో అత్యంత ధృడంగా వేళ్లూనుకుని ఉందన్నారు. అయితే కులవ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ఫూలే భావజాలం దారిచూపిస్తుందన్నారు. ఈసందర్భంగా సెంటర్ డైరెక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ప్రొపెసర్ శ్రీనివాస్,తిరుమలైన హాజరై పలు విషయాలు విద్యార్థులకు వివరించారు. ఈకార్యక్రమంలో ప్రొపెసర్లు పాట్రిక్, లావణ్య , నగేష్, చంద్రు, కృష్ణకుమార్, సాయిలు, నర్శిములు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News