Friday, May 10, 2024

మార్టిన్ లూథర్ కింగ్ ‘సమతా స్వప్నం’

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863లో విముక్తి చట్టం చేశారు. సంఘటిత ఉత్తర అమెరికాలో బానిసత్వం ముగిసింది. రెండేళ్లకు అంతర్యుద్ధం అంతమైంది. దక్షిణ రాష్ట్రాల కోట్ల వ్యవసాయ కార్మికులు స్వేచ్ఛా సంధ్య కోసం ఎదురు చూశారు. ఒక దశలో ఆ వేకువ వచ్చిందనిపించింది. ద.అమెరికాలో హింసాయుత అడ్డంకులు ఉన్నా సైన్యం నల్లవారి స్వేచ్ఛ, ఓటు హక్కులను కాపాడింది. 1877లో ద.అమెరికా రక్షణను రాజకీయ విమోచకులకువదిలి సైన్యం వెనుదిరిగింది. వెంటనే జాతివాద సమాంతర సైన్యం ‘కు క్లక్స్ క్లాన్’ చిత్రవధ (లించింగ్) బృందాలను ఏర్పరచింది. నల్లవారి ఓటు నమోదును అడ్డగించారు. విభజన చట్టాలు తెల్లవారి ప్రత్యేక రైళ్లు, హోటళ్లు, మంచినీళ్ళ వసతి, విశ్రాంతి గదులను అనుమతించాయి.

ఈ వర్ణ వివక్ష- అమెరికాలో 15 జనవరి, 1929న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జన్మించారు. మార్టిన్ పౌరహక్కుల క్రియాశీల కార్యకర్త. అన్యాయాల నెదిరిస్తూ కోటి కి.మీ. పయనించి 2,500 ప్రసంగాలు చేశారు. మార్టిన్ తండ్రి గౌరవం గల క్రైస్తవ బోధకుడు. మార్టిన్ 1955లో క్రైస్తవ ధర్మశాస్త్రంలో పరిశోధన పట్టా పుచ్చుకున్నారు. చర్చి మతాధిపతిగా పని చేశారు. ‘దేవునికి, మానవత్వానికి సేవ చేయండన్న’ అంతర్గత వాంఛ ఉన్న వ్యక్తి. లయబద్ధ ధ్వనుల బోధక కంఠంతో, వాక్చాతుర్య నేర్పుతో 1963కు పౌర హక్కుల ఉద్యమ నాయకుడయ్యారు. వేర్పాటుతత్వం, శాసన వివక్షత అంతం కావాలని నినదించారు. ఆ ఏడాది వేసవిలో వాషింగ్టన్‌లో లింకన్ స్మృతిచిహ్నం నీడలో 2.5 లక్షల మంది ముందు అద్భుతంగా ప్రసంగించారు.

వందేళ్ల క్రితం ఒక గొప్ప అమెరికన్ (లింకన్) విముక్తి ప్రకటనపై సంతకం చేశారు. అన్యాయ చీకట్ల నీగ్రోబానిసలకు ఈ చిరస్మరణీయ ఆశాదీపం దారి దివిటీగా మారింది. చీకటి రాత్రిని చీల్చిన వెలుగుల పగలుగా వెలిగింది. అయితే వందేళ్ళు దాటినా నీగ్రో ఇంకా స్వేచ్ఛా జీవి కాలేదు. వేర్పాటు సంకెళ్ళు, వివక్షతా గొలుసులతో బాధాకర వైకల్యం భరిస్తున్నాడు. ఈ సిగ్గుమాలిన స్థితిని చాటడానికి మనం ఈ రోజు ఇక్కడ చేరాం. లిఖిత ప్రసంగం ముగించి మార్టిన్ కూర్చోబోతుండగా, మీ స్వప్నం గురించి చెప్పండి, మార్టిన్. ప్రేక్షకుల నుండి గాయని మహలియ జాక్సన్ అడిగారు. ఇది విన్న మార్టిన్ నోట సజీవ ప్రసంగం ఆశువుగా పెల్లుబికింది. మిత్రులారా, మనం నిరాశల లోయలో పడరాదు. కష్టాలను భవిస్తున్నా ఇంకా నాకొక కల ఉంది. అది అమెరికా కలతో ప్రగాఢంగా పెనవేసుకున్న స్వప్నం. ఈ దేశం ప్రగతిబాట పయనించి జాతి సంపూర్ణ అర్థంలో జీవిస్తుంది. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారన్న స్వీయ సాక్ష్యంతో ఈ సత్యాలను ఇముడ్చుకుంటాం.

బానిసల, బానిస యజమానుల సంతానం జార్జియా అరుణ పర్వతాలపై ఒకనాడు సౌభ్రాతృత్వంతో కలిసి కూర్చోగలరన్న స్వప్నమది. మిసిసిపిలో అన్యాయం, అణచివేతల కొలిమి స్వేచ్ఛా న్యాయాల ఒయాసిస్‌గా మారే కల అది. వంటి రంగును బట్టి కాక గుణాన్ని బట్టి మదింపు వేసే దేశంలో ఒకనాడు నా నలుగురు పిల్లలు నివసించగల స్వప్నమది. విషపూరిత జాతివాద అలబామాలో ‘అడ్డు, రద్దు’ వంటి గవర్నర్ పదాలు పోయి నల్ల, తెల్లజాతుల పిల్లలు సోదరుల్లా ఒకనాడు చేతులు కలిపే స్వర్ణ స్వప్నమది. లోయలు కొండలు, ఎత్తు పల్లాలు చదునై దైవ ప్రకాశాన్ని మనుషులంతా కలిసి చూసే రోజు వస్తుందన్న కల అది. ఇది మన ఆశ. ఈ నమ్మకంతో వెళతాను. ఈ విశ్వాసంతో నిరాశల కొండలను కూల్చుదాం.

కఠిన అసమ్మతిని సోదర స్వభావ స్వర సమ్మేళనంగా మార్చుదాం. కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, స్వాతంత్య్రానికి పోరాడుదాం, జైళ్లకెళదాం, ఒకనాడు స్వేచ్ఛా జీవులమవుదాం. ఆ రోజు దేవుని బిడ్డలందరం కొత్త అర్థాల గీతాలు పాడు దాం. అమెరికా గొప్ప దేశం కావాలంటే నలుమూలలా (నల్లవారి) స్వేచ్ఛా స్వాతంత్రాలు వెల్లివిరియాలి. అదే జరిగిననాడు నల్లవారు, తెల్లవారు, యూదులు, జెంటిల్స్, ప్రొటెస్టాంట్స్, కాథలిక్స్, దేవుని పిల్లలంతా ప్రాచీన నీగ్రో ఆధ్యాత్మిక గీతం పాడుతారు. చివరికి స్వేచ్ఛా జీవులమయ్యాం! చివరికి స్వేచ్ఛా జీవులమయ్యాం! సర్వశక్తుడు దేవునికి కృతజ్ఞతలు, మేము చివరికి స్వేచ్ఛా జీవులమయ్యాం! అంటూ ముగించారు.

అమెరికా పౌర హక్కుల పోరాటంలో మార్టిన్ ప్రసంగం కీలకం. ఆయన మండే మాటలు మేధో వాదనను, మత వాక్చతుర్యాన్ని, దేశభక్తి ప్రోత్సాహ ప్రబోధాన్ని సమ్మిళిత పరిచాయి. ‘ఓ నా దేశమా, స్వేచ్ఛ మార్మోగనీ’ అన్న పదజాలం ప్రార్థనా గీతంగా మారింది. నల్లజాతి సమానత్వ సమర్థకులకు కొత్త హృదయాన్నిచ్చింది. వాషింగ్టన్‌లోని రాజకీయులందరినీ హెచ్చరించింది. చివరికి 1964లో అమెరికా ప్రభుత్వం పౌరహక్కుల చట్టాన్ని ఆమోదించింది. అధికారికంగా వేర్పాటువాదాన్ని అంతం చేసింది. ఏడాది తర్వాత ఓటింగ్ హక్కు చట్టం ఆఫ్రికన్ ఆమెరికన్లను ఓటు హక్కు వివక్షల నుండి విముక్తి చేసింది. అయితే పోరాటం ఆగలేదు. వివక్ష ఇంకా తీవ్రంగానే ఉండింది. భ్రమల్లో మునిగిన నల్లజాతిక్రియాశీల కార్యకర్తలు మార్టిన్ సమరశీల అహింసా పోరాట అవగాహనలను తిరస్కరించారు. మహాత్మా గాంధీ నుండి మార్టిన్ అహింసా విధానం నేర్చుకున్నారు.1968కి మార్టిన్ ప్రభావం తగ్గింది. ఆయన ఆశావాది. తన అనుచరులతో, నాకు తేడా లేదు. నేను వాగ్దాన భూమి పర్వత శిఖరాలకు చేరాను. మీతో అక్కడికి చేరుకోలేకపోవచ్చు. పౌరులుగా మనం వాగ్దాన భూమి చేరుకుంటామని ఈ రాత్రికే మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అనేవారు. ఆ మరుసటి రోజే 04 ఏప్రిల్ 1968న, 39 ఏళ్ల మార్టిన్ లూథర్ కింగ్ ను మెంఫిస్ నగర హోటల్ వసారాలో ఒక శ్వేతజాతి వేర్పాటువాది కాల్చి చంపారు.

అమెరికా పాశ్చాత్య దేశాల్లో చర్మం నలుపు అణచివేత, వెలివేత, అస్పృశ్యత, అసమానతలకు నెలవు. తెలుపు ఆధిక్యత, అధికారం, అహంకారం, నకిలీ ఘనత, దోపిడీ, పరాన్నభుక్తతల కొలువు. మార్టిన్ అహింసా పద్ధతుల్లో ఆఫ్రికన్- అమెరికన్ల హక్కులకు పోరాడారు. మరో ప్రక్క మత- రాజకీయ సంస్థ ‘ఇస్లాం దేశం’ నీడలో ఉగ్రవాద ఉద్యమం పెరిగింది. దాని నాయకుడు ఆఫ్రికన్ అమెరికన్ ముస్లిం మతగురువు మాల్కోం ఎక్స్. నెబ్రాస్కాలో 19 మే 1925న మాల్కోం లిటిల్‌గా జన్మించారు మాల్కోం. తనను నల్ల జాతీయునిగా అర్పించుకున్నారు. ఎక్స్ ఆయన పూర్వీకుల తెలియని ఆఫ్రికన్ ఇంటి పేరుకు గుర్తు. నల్లవారి సమానత సాధికారతలను మాల్కోం సమర్థించారు. మార్టిన్ ప్రశాంత ప్రచారాలను నిందించారు మాల్కోం. అయితే 1964కు మార్టిన్ ఇస్లాం దేశాన్ని తిరస్కరించారు.

ఆ సంస్థతో శత్రుత్వం పెరిగింది. ఉగ్రవాద క్రియాశీలతకు బదులు రాజకీయ పోరాటాన్ని ప్రోత్సహించారు. మనం వెంటనే చర్య తీసుకోకపోతే ఎన్నికలు, తుపాకీలలో ఒకదాన్ని ఎంచుకునే స్థితికి నెట్టబడతాం. ఇప్పటికే ఆలస్యమైంది. తెల్లజాతి వాళ్ళు ప్రత్యామ్నాయం గుర్తిస్తే మార్టిన్‌ను అనుసరిస్తారు. తన ప్రఖ్యాత ప్రసంగంలో దాచుకోకుండా తన అభిప్రాయం చెప్పారు. 21 ఫిబ్రవరి 1965న న్యూయార్క్ లో ఇస్లాం దేశం సభ్యులే మాల్కోంను చంపారు.

ప్రగతి శీలురను తిరోగమన వాదులు బతకనివ్వరు.‘1965 ఓటింగ్ హక్కు చట్టం’ ఆఫ్రికన్ అమెరికన్ల ఓటు హక్కు తేడాలను తొలగించింది. తర్వాతి పోరాటాల్లో ఎన్నికలు ప్రాధాన్యతా ఆయుధంగా మారాయి. అరాచక వ్యక్తిత్వం అపాయకరం. మతోన్మాద ఉగ్రవాదం వినాశకరం. మానవ వాదమే మహత్తర మాన్యవాదం. ఇవి మాల్కోం జీవిత గుణపాఠాలు. మతాలన్నీ అసమ సమాజ స్థావరాలే. పుట్టిన మతంలో అసమానతలు భరించలేక కొందరు పరమతం స్వీకరించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు గణ నాయకులు, తమ తాత్విక నాయకుల అధికార కాలంలో ఒసి నుండి బిసిగా మారారు.

హిందుత్వం దళితులను అస్పృశ్యులుగా పీడించింది, దోచుకుంది. ఇస్లాం, క్రైస్తవాల్లోనూ ఇదే తంతు. పూజారులూ సమస్య పరిష్కారానికి దేవున్ని కాక పోరాట పంథా ఎంచుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలతో సహా గుళ్ళ పూజారి వర్గం సిఐటియు శాఖలు పెట్టుకుంది. మార్టిన్, ఆయన తండ్రి క్రైస్తవ పూజారులు. అయినా వివక్ష తప్పలేదు. మత తాత్వికతను గాక మానవ తాత్వికతను ప్రోత్సహించాలి. సమ సమాజంలోనే అంబేడ్కర్ ఆశించిన, మాల్కోం ఎక్స్ పోరాడిన, మార్టిన్ లూథర్ కింగ్ స్వప్నించిన సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. ఈ విప్లవ త్రయం మతాతీతంగా మార్క్సిజం అనువర్తన పంథా పాటించియుంటే సమాజం మారియుండేదేమో!

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News