Sunday, April 28, 2024

మోడీ సిబిఐని ఏమన్నారో తెలుసా!

- Advertisement -
- Advertisement -

‘యువత ముందు నిలుచొని చెబుతున్నాను, ఢిల్లీలో ని ప్రభుత్వం సిబిఐని చూపి మమ్మల్ని భయపెట్టలేదు’, ‘సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది’, ‘సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని’, ‘మీరు ఏమైనా చేసుకోండి, కానీ సిబిఐ భయంతో అభివృద్ధి బాటను వీడేది లేదు’, ‘పరిణామాలు ఎలా మారతాయో నాకు తెలుసు, కానీ మేము సిద్ధపడి ఉన్నాం’ పాఠకులకు ఈ మాటలు ఎవరివో అర్ధమయే ఉంటాయి. ఇంకెవరివి! మోడీ ఏలుబడిలో వేధింపులకు గురవుతున్న ప్రతిపక్షనేతలు చేసిన ప్రకటనలు అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సిఎం పదవిలో ఉన్నపుడు చేసిన ఆరోపణలు. మోడీ అంటే అవినీతి అని అర్ధం అంటూ గతంలో తాను చేసిన ట్వీట్‌ను తొలగించటం లేదని బిజెపి నేత కుషుబూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే సిబిఐ గురించి మోడీ చెప్పిన ఈ అంశాలు నరేంద్ర మోడీ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అంతేకాదు మోడీ చెప్పిన సుభాషితాలు ఇంకా ఇలా ఉన్నాయి. ‘సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’, ‘గుజరాత్‌ను కించపరిచేందుకు అబద్ధాలు చెప్పవద్దు’, ‘సిబిఐని రాజకీయమయం కావించేందుకు సమయాన్ని ఖర్చు చేసే బదులు ఉత్తరాఖండ్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు వెచ్చించండి’ అని కూడా చెప్పారు. 2013 జూన్ 24న గాంధీనగర్‌లో స్వామి వివేకానంద ఉపాధి వారంలో భాగంగా జరిగిన సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. పైన పేర్కొన్న ఆరోపణలన్నీ అక్కడ చేసినవే. ఈరోజుల్లో పత్రికల్లో సగంవార్తలు సిబిఐ సంబంధమైన వాటితో నింపుతున్నారు. అమాయకులను ఇబ్బందిపెడుతున్నారు. వారి రాజకీయ యజమానులను సంతృప్తి పరచేందుకే ఇలా చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. మీరు పోటీ పడాలనుకుంటే పడదాం. ఎవరు ఎన్ని ఉద్యోగాలను ఇవ్వగలమో చూసుకుందాం అని కూడా మోడీ సవాల్ చేశారు. అప్పటికే నరేంద్ర మోడీని తమ నేతగా లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు బిజెపి నిర్ణయించిన పూర్వరంగంలో చేసిన ప్రసంగమది. అలాంటి మోడీ గుజరాత్ సిఎంగా ఉండగా ఒక నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో ఇరికించేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం లో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా సిబిఐ తనపై వత్తిడి తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన మీద వత్తిడి తెచ్చినప్పటికీ దాని గురించి బిజెపి ఎన్నడూ రచ్చ చేయలేదని కూడా షా చెప్పారు. కాంగ్రెస్ పాలకుల మీద ఎంత ఉదారత! మరి ఇప్పుడెందుకు చెప్పినట్లు? అన్న ప్రశ్న జనంలో తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శల మీద అమిత్ షా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా ఈ ఆరోపణ చేశారు అన్నది స్పష్టం.

అవినీతిపరులందరూ ఒక దగ్గర చేరుతున్నారంటూ ప్రతిపక్షాల మీద నరేంద్ర మోడీ దాడి చేసిన తరువాత అమిత్ షా ఈ మాటలను చెప్పి చర్చను పక్కదారి పట్టించేందుకు చూశారు. పరువునష్టం కేసులో శిక్ష పడిన రాహుల్ గాంధీ హైకోర్టులో అప్పీలుకు పోకుండా ప్రధాని మోడీని నిందిస్తూ రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. అప్పీలు చేసుకోవాలా లేదా అనేది రాహుల్ గాంధీకి చెందిన అంశం. ఏమి చేయాలో కూడా బిజెపి నేతలు చెబుతారా?లేక వారు అనుకున్నవిధంగా జరగటం లేదని ఉక్రోషమా? శిక్ష విధించిన కోర్టు అప్పీలుకు ఇచ్చిన గడువు గురించి తెలిసినప్పటికీ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు లోక్‌సభ సచివాలయం ఎందుకు తొందరపడిందో అమిత్ షా చెప్పి ఉంటే బాగుండేది. రాజస్తాన్‌లోని మార్బుల్ వ్యాపారులు తమను వేధిస్తున్న గుజరాత్‌కు చెందిన సొహ్రబుద్దీన్ షేక్‌ను అదుపు చేయాలని కోరగా నాడు రాష్ర్ట హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ఆదేశాల మేరకు పోలీసులు 2005లో సొహ్రబుద్దీన్‌తో పాటు అతని భార్య కౌసర్ కాల్చిచంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

దానిపై అమిత్ షా రాజీనామా చేశారు, అదే కేసులో సిబిఐ అరెస్టు చేసింది. సొహ్రబుద్దీన్ లష్కరే తోయిబాకు చెందిన వాడని, నరేంద్ర మోడీని హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు గుజరాత్ పోలీసులు ఆరోపించారు. అమిత్ షా ఆదేశాల మేరకు అతన్ని చంపినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, దాని గురించి సిఎం నరేంద్ర మోడీకి తెలుసా లేదా అని నిర్ధారణ చేసుకొనేందుకు మోడీనికూడా ప్రశ్నించవచ్చని సిబిఐ భావించినట్లు వార్తలు వచ్చాయి. నకిలీ ఎన్‌కౌంటర్ కేసుల భయంతోనే నరేంద్ర మోడీ సిబిఐ మీద దాడులు చేస్తున్నట్లు 2013లోనే కాంగ్రెస్ విమర్శించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పని చేస్తోందని కూడా గుర్తు చేసింది.

సిబిఐపై నరేంద్ర మోడీ పదే పదే దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు. భావనగర్‌లో 2010 జూలై 31న మాట్లాడుతూ ‘గుజరాత్ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్‌లోని కోర్టులను, లాయర్లను అమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి ? మన న్యాయ విశ్వవిద్యాలయాలను మూసుకోవాలా, లాయర్లు రోడ్డున పడాలా? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికిపోతోంది. గుజరాత్ దేశంలో భాగం కాదా, ఒక శత్రు రాష్ర్టంగా ఎందుకు పరిగణిస్తున్నారు. ఉగ్రవాదంమీద పోరు జరపకుండా నన్ను నిరోధిస్తున్నారు. ఓటు బాంకు రాజకీయాల్లో భాగంగా నిందితులను అరెస్టు చేయటం లేదు. నా సన్నిహితుడు అమిత్ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నరేంద్ర మోడీని భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి. అతన్ని భయపెట్టలేరు.ఇది జాతీయవాదులు, జాతి వ్యతిరేకుల మధ్య పోరు, గుజరాత్ యుద్ధభూమి. గుజరాత్ గెలుస్తుంది’ అని చెప్పారు.

అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒక దగ్గరకు చేరుతున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌తో సహా 14 పార్టీలకు చెందిన వారు సిబిఐ, ఇడిలను తమ నేతల మీద ప్రయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణకు స్వీకరించింది. దీంతో మోషా రంగంలోకి దిగారు. యుపిఎ 200414 పాలనా కాలంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి కేవలం రూ. ఐదు వేల కోట్ల విలువగల ఆస్తులు మాత్రమే పిఎంఎల్‌ఎ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారని తాము తొమ్మిది సంవత్సరాల్లో రూ. లక్షా పది వేల కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు.

యుపిఎ పాలనా కాలంలో ఇడి 112 దాడులు చేసి రూ. 5,346 కోట్లు స్వాధీనం చేసుకోగా, మోడీ అధికారానికి వచ్చాక ఎనిమిది సంవత్సరాల్లో 3010 దాడులు రూ. 99,356 కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకున్నట్లుగా 2022 జూలై 27న పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్ ఏలుబడిలో సగటున ఒక్కో కేసులో 47.7 కోట్ల వంతున స్వాధీనం చేసుకోగా, మోడీ పాలనలో అది రూ. 33 కోట్లుగా ఉంది. విదేశీమారకద్రవ్య అక్రమాల కేసులు ఇదే విధంగా 8,586 నుంచి 22,320కి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. దాడులు జరిపిన 3,010 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేసింది 888 కేసుల్లో కాగా శిక్షలు పడింది 23 కేసుల్లో, వాటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ. 869 కోట్లని కూడా ప్రభుత్వం తెలిపింది. అందువలన దాడుల సంఖ్య పెరిగినా ఆస్తులను లక్ష కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినా తేలిన కేసులు, స్వాధీన మొత్తాలను చూస్తే అది నామమాత్రమే అన్నది స్పష్టం.

మోడీ ఏలుబడిలో 2014 ఏప్రిల్ ఒకటి నుంచి 3,555 మనీలాండరింగ్ కేసులు నమోదు కాగా చార్జిషీట్లు దాఖలు చేసింది 2022 మార్చి వరకు 992 మాత్రమే. అవినీతి అక్రమాలపట్ల తామెంత నిబద్ధత తో ఉన్నదీ తమ ఏలుబడిలో కేసుల సంఖ్య పెరగటాన్ని సూచిస్తున్నదని ప్రభుత్వం చెప్పుకుంది. వాటిలో ఎక్కువ భాగం బెదిరింపులు, కేసుల్లో ఇరికించేందుకు చేసిన దాడులే అన్నది విమర్శ. అదానీకి 2014లో ఉన్న ఎనిమిది బిలియన్ డాలర్ల సంపద 2022 నాటికి 137 బి.డాలర్లకు పెరిగిందంటే అది సక్రమంగా జరిగింది కాదన్నది జగమెరిగిందే. గత తొమ్మిది సంవత్సరాల్లో మీకది నాకిది అన్నట్లుగా పంచుకుంటున్న ఉదంతాలుపెరిగాయి. పెద్దనోట్ల రద్దు, పారదర్శకతకు డిజిటల్ లావాదేవీలు, నల్లధనా న్ని అరికట్టినట్లు ఎన్నో కబుర్లు చెప్పారు. అంత పకడ్బందీగా చేస్తున్నపుడు అవినీతిపరులు తామర తంపరగా ఎలా పుట్టుకు వస్తున్నట్లు? విదేశీ మారక ద్రవ్య అక్రమాల (ఫెమా) కేసులను చూస్తే యుపిఎ పాలనలో 8,586 కేసులు దాఖలు కాగా, 2,780 కేసుల్లో షోకాజ్ నోటీసలు ఇచ్చారు. తీర్పులు వచ్చిన 1,312 కేసుల్లో రూ. 1,754 కోట్ల మేరకు జరిమానా విధించారు.

మోడీ ఎనిమిదేండ్ల పాలనలో 22,330 కేసుల్లో తీర్పులు వచ్చిన 5,160 కేసుల్లో విధించిన జరిమానా రూ. 6,376 కోట్లు. అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి దిగటం ఆశ్చర్యం కలిగించదు. గతంలో సిబిఐ మీద ఆరోపణలు చేసిన మోడీ సర్కార్ దాని డైరెక్టర్లుగా తమకు అనుకూలురైన అలోక్‌వర్మ, రాకేష్ అస్తానాలను నియమించటం వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం, ఆ ఇద్దరినీ తప్పించి మరొక స్వంత మనిషి నాగేశ్వరరావును కూర్చోపెట్టటం తెలిసిందే. ఇలాంటి నిర్వాకం ద్వారా సిబిఐమీద విశ్వాసం పెంచినట్లు బిజెపి నేతలు చెబుతుంటే వాషింగ్ పౌడర్ నిర్మా గుర్తుకు వస్తున్నది. గత తొమ్మిది సంవత్సరాలలో సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన దాడులు, మోపిన కేసులు ప్రతిపక్షాలకు చెందిన వారి మీదనే, కొంత మందిని కేసులు మోపి లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకోవటం, కొందరిని బెదిరించి పార్టీలోకి లాక్కోవటంవంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు తమ నిర్వాకాలను చూసుకోవాలి. తమ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకోవటం చూస్తుంటే గురివిందలు గుర్తుకు వస్తున్నాయి. ఎదుటి వారి నలుపును చూసి పరిహాసం చేసే గురివిందలు తమ కింది నలుపును చూసుకోవు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News