Home ఎడిటోరియల్ సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన

సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన

When will everyone be vaccinated?

మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత జీవనంలో తమ కొత్త అడ్మినిస్ట్రేటర్ గుజరాత్‌కు చెందిన ప్రఫుల్ ఖోడా పటేల్ నిరంకుశ శాసనాలు సృష్టించిన అశాంతికి, కల్లోలానికి వ్యతిరేకంగా వారు చేపట్టిన ఆందోళన పరాకాష్ఠకు చేరినట్టు ఈ ప్రదర్శనలు చాటుతున్నాయి. ప్రఫుల్ పటేల్ గుజరాత్‌లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో సభ్యుడు, ప్రధానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇష్టుడు. ప్రజల ఓటుతో అధికార అందలమెక్కే ప్రజాస్వామ్య పాలకులు వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకునేటప్పుడు వారి అనుమతి పొందడం కనీస బాధ్యత.

ఈ స్పృహ కోల్పోయి ఏకపక్షంగా వ్యవహరించినప్పుడే జనం తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు కూడా పాలకుడుగా వ్యవహరిస్తున్న ప్రఫుల్ ఖోడా పటేల్ గత డిసెంబర్‌లో లక్షద్వీప్ పాలనా పగ్గాలు చేపట్టాడు. వెంటనే అక్కడి పరిస్థితులను సమూలంగా మార్చివేసే శాసనాలను ప్రకటించాడు. ఆ తర్వాత మొదటి సారిగా ఆ దీవుల్లో ఆయన అడుగు పెట్టిన సందర్భంగా మొత్తం ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలను సోమవారం నాడు నిర్వహించారు. ప్రఫుల్ పటేల్ నిర్ణయాలు లక్షద్వీప్‌లోని పర్యావరణ విధ్వంసానికి, ప్రజల జీవన విషాదానికి దారి తీస్తాయని లోకమంతా కోడై కూస్తోంది. ప్రఫుల్ పటేల్ దుశ్శాసనాలను వ్యతిరేకిస్తూ అక్కడి బిజెపి శ్రేణుల నేతలు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు. కేరళకు సమీపంలో అరేబియా సముద్రంలో గల లక్షద్వీప్‌లో మొత్తం 36 దీవులున్నాయి. 32 కి.మీ.ల అతి తక్కువ భూ వైశాల్యం గల ఈ దీవులు పరిపాలనా పరంగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం.

పది పాలనా విభాగాలుగా విభజించిన ఈ దీవులను దేశంలోని 600 పైచిలుకు జిల్లాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. కవరట్టి దీవిని పాలనా కేంద్రం చేశారు. కేవలం 65 వేల జనాభాలో 95 శాతం ముస్లింలే. మలయాళం మాట్లాడే ఈ ప్రజలు ఎక్కువగా కేరళతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ప్రఫుల్ పటేల్ నిరంకుశ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఇటీవల ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. ఈ దీవులు కేరళ హైకోర్టు న్యాయ పరిధిలో ఉంటాయి. లక్షద్వీప్‌ను అండమాన్ మాదిరిగా ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం చేసి గుజరాతీ వ్యాపారుల ఆధీనంలో ఉంచాలన్న లక్షంతోనే ప్రఫుల్ పటేల్ పావులు కదుపుతున్నాడని, పనిలో పనిగా హిందుత్వ అజెండా అమలుకు కూడా సంకల్పించాడని, తమ ఆహార సంస్కృతిని తీవ్రంగా దెబ్బతీసే జంతు వధ నిషేధ చట్టాన్ని అందుకే ఉద్దేశించాడని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. పరిశీలకులు కూడా అదే మాట చెబుతున్నారు. లక్షద్వీప్ అభివృద్ధి పేరిట ఉద్దేశించిన చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ 93 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు ఈ నెల 6 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత దేశ భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యంలో లక్షద్వీప్ అసమాన స్థానాన్ని అలంకరించిందని, అభివృద్ధి పేరుతో దానిని చెదరగొట్టే ప్రయత్నాలను ఆపించాలని వారు అందులో కోరారు. అక్కడి ప్రజలకు వైద్య, విద్య భద్రతను న్యాయమైన పాలనను హామీ ఇచ్చే విధంగా వారిని సంప్రదించి సరైన అభివృద్ధి నమూనాను ఖరారు చేయించాలని వారు సూచించారు.

జంతు రక్షణ చట్టం ద్వారా అక్కడి ప్రజల ప్రియ ఆహారమైన గో మాంసాన్ని నిషేధించదలచడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిషేధం పేరుతో సాధారణ నేరాలకు సైతం ఎవరినైనా ఏడాది పాటు జైల్లో ఉంచే అధికారాలను సంక్రమింప చేసుకోడం ఎంత హేయమైన చర్యలో చెప్పనక్కర లేదు. టూరిస్టుల కోసం ఒకే ఒక ద్వీపంలో మాత్రమే అమల్లో ఉన్న మద్యపానాన్ని ప్రజల అభీష్టానికి విరుద్ధంగా మిగతా మరి కొన్ని దీవుల్లోనూ అనుమతించడం ఎవరి మేలు కోసమో చెప్పనక్కర లేదు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేయడం, అతి చిన్న దీవుల్లో కూడా నాలుగు లేన్ల హైవేలు నిర్మించబోడం అందుకోసం ప్రజల అనుమతి లేకుండానే వారి ఆవాసాలను, మత్స కార్మికులు చేపలు నిల్వ ఉంచుకోడానికి నిర్మించుకున్న కట్టడాలను కూల్చడం వంటి చర్యలు ఆ ప్రశాంత దీవులను ఎంత బీభత్సానికి గురి చేస్తాయో, సంప్రదాయ సామాజిక వాతావరణాన్ని మరెంతగా దెబ్బ తీస్తాయో సుస్పష్టమే. అయితే ఇవన్నీ కేవలం ప్రఫుల్ పటేల్ బుర్రలో పుట్టినవే అని అనుకోడం అమాయకత్వమే. కేంద్ర పాలకులు కశ్మీర్‌లో చేస్తున్నట్టే తమ కార్పొరేట్, హిందుత్వ లక్షాల అమలుకు ఈ దీవులను ఎంచుకున్నట్టు అనిపించడాన్ని తప్పుపట్టలేము. అయితే ప్రజల నిరసనను దృష్టిలో పెట్టుకొని అయినా ప్రధాని మోడీ ప్రభుత్వం పటేల్ నిరంకుశ నిర్ణయాల అమలుకు బలమైన పగ్గాలు వేయవలసి ఉంది.