Sunday, April 28, 2024

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

- Advertisement -
- Advertisement -

 

 ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు

 మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం
 ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం

 అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని వద్దంటున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అత్యంత మానవీయ కోణంలో అద్భుతమైన బడ్జెట్‌ను ప్రతిపాదించామని తెలిపారు. ఆర్థిక మాంద్యంతో ఎన్నికల హామీలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్ ఆశపడిందని, వారి ఆశలు ఆడియాసలు చేస్తూ ప్రజలందరినీ సంతోషపెట్టే విధంగా బడ్జెట్ ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని ముందుకుతీసుకుపోతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌లో ఒక్కొక్కరు ఒక్కొలా మట్లాడుతున్నారని, ఒకరు కరెంట్ వద్దంటున్నారని, మరొకరు ప్రాజెక్టులు వద్దు అంటారని, అందుకే కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్ కరెంట్ బంద్ పార్టీ అయితే టిఆర్‌ఎస్ రైతుబంధు పార్టీ అన్నారు. అసెంబ్లీలోనే కాదు, ప్రతీ ఎన్నికల్లోనూ అదే పాట పడుతున్నారని అయితే ప్రజలు ఇస్తున్న తీర్పును గమనించడం లేదన్నారు. మాంద్యం ఉన్నా సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా తగ్గించవద్దని సిఎం ఆదేశించారని అందుకు అనుగుణంగా బడ్జెట్ పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1,23,075 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇంకా 27 వేల ఉద్యోగాల నియమాకాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు.కళ్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా వంటివి అలా అమలు చేసినవేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. సంక్షేమ రంగానికి కేటాయింపులు పెంచామని.. ఇప్పటికే 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. 57 ఏళ్లు నిండిన అందరికీ పింఛను మంజూరు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింది ఆర్థిక సాయం అందించామని ఇవేమీ విపక్ష సభ్యులకు కనిపించండం లేదని విమర్శించారు. పెరుగుతున్న లబ్ధిదారులకు అనుగుణంగా బడ్జెట్‌లో అదనపు నిధులు ప్రతిపాదించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ లెంపలేసుకోవాలి
మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల్లో ఎవరున్నా తొలగించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే మూసీనది కలుషితమైందని నిప్పులు చెరిగారు. నిజాం కాలంలో మూసీ నీటిని తాగేందుకు వినియోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి నాయకులు అసమర్ధత వలన ఆ నీరు ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు. దానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజలకు శుద్ధమైన మూసీ నదిని అందించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కొనసాగుతుందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కోకాపేట, అమీన్ పూర్, కొల్లూర్ వంటి విలువైన భూముల్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సొంత స్థలం ఉన్న లక్ష మందికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేయనుందని తెలిపారు. పేదల మీద భారం లేకుండా హౌజింగ్ కోసం రూ.11వేల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణాల పేరుతో ప్రజలకు అప్పులు మిగిల్చిందని విమర్శించారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రం కూడా స్ఫూర్తిగా తీసుకుందని హరీశ్ అన్నారు. పెట్టుబడి వ్యయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని చెప్పారు. నీతి ఆయోగ్ సుస్థిర నివేదికలో దేశంలోనే టాప్‌లో ఉన్నామన్నారు. ఐటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐటి ఎగుమతుల్లోనే కాకుండా మంత్రి కెటిఆర్ కృషి ఫలితం, టిహబ్, విహబ్‌తో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు.
అందరూ సమానమే.. పరిమితుల మేర రుణాలు
జిఎస్‌డిపి వృద్ధిరేటును బట్టే రుణాలు వస్తాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశాయి. దేశంలో 19 రాష్ట్రాలు 25 శాతం పరిమితిని మించి అప్పులు తెచ్చుకున్నాయని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు తెచ్చుకుందని స్పష్టం చేసిందని చెప్పారు. ఈ విషయంలో కింద నుంచి ఆరో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ప్రతీ బడ్జెట్‌లోనూ కాంగ్రెస్ అప్పులు మీదే మాట్లాడుతుందన్నారు. తీసుకువస్తున్న అప్పులు కూడా పెట్టుబడి వ్యయానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అన్ని పార్టీల ఎంఎల్‌ఎలకు సమానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తున్న గొప్ప సిఎం కెసిఆర్ అన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం చరిత్రలో ఎప్పుడైనా నిధులు కేటాయించారా అని మంత్రి హరీశ్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఖాజనా నుంచి ఆలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉండేదని, వారంలో మూడు రోజులు మాత్రమే పరిశ్రమలకు విద్యుత్ ఇచ్చేవాళ్లు అని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ఆ సమస్య లేదు. మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కార్మికులు ఒ.టిలు కూడా చేసుకుంటున్నారన్నారు.

Minister Harish Rao Speech in Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News