Sunday, April 28, 2024

వైన్స ఓపెన్

- Advertisement -
- Advertisement -

Liquor Shop

 

45 రోజుల తర్వాత తెరుచుకోవడంతో మురిసిపోయిన మద్యం ప్రియులు
ఉదయం 6 గంటల నుంచే బారులు
మాస్క్‌లు పెట్టుకుని భౌతిక దూరం
పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పటిష్ట ఏర్పాట్లు
తొలిరోజే రూ. 100 కోట్ల విక్రయాలు?
నిబంధనలు పాటించని 28 మద్యం దుకాణాలపై కేసులు, లైసెన్సులు రద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్: అదేదో సినిమా పాటలా ఎన్నాళ్లో వేచిన ఉదయం మా దిరి.. మద్యం ప్రియులు చాలా రోజుల తరువాత మం దు బాటిళ్లు కొని వాటిని తాకి మురిసిపోయారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 45 రోజులు మూతపడిన మద్యం దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో బుధవారం తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఉత్సాహంతో ఉరకలేసారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంట ల నుంచే మందు బాబులు షాపుల ముందు బా రులు తీరారు. ఏదో జాతరను తలపించేలా, సినిమా టికెట్లకు మాదిరి మద్యం షాపుల ముందు ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ కట్టడం కనిపించింది.

వైన్‌షాప్‌లు సాయంత్రం 6 గంటల వరకు మూసేసే వరకు కూడా క్యూ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే గంటలోనే షాపు బంద్ చేస్తామని, అవసరమైతే సదరు దుకాణం లైసెన్సు రద్దు చేస్తామని సిఎం హెచ్చరించడంతో అటు నిర్వాహకులు, ఇటు మద్యం ప్రియులు నిబంధనలను పకడ్బందీగా పాటించారు. పోలీసులు కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైన్‌షాప్‌ల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఇన్నాళ్లు మద్యం దొరక్క విలవిలలాడిపోయిన మద్యం ప్రియులు, ఇప్పుడు పండగ చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు పాత స్టాక్‌కు కూడా చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగిలిన అన్ని బ్రాండ్లపై 16 శాతం ధరలు పెంచి విక్రయాలు జరిపారు.

భౌతిక దూరం.. మాస్క్‌లు
తెలంగాణలో కంటే రెండు రోజుల ముందే ఇతర రాష్ట్రాలలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. మన చుట్టూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రా లు మద్యం దుకాణాలు తెరిచాయి. ఈ రాష్ట్రాల్లో మద్యం కోసం ఎటువంటి భౌతిక దూరం పాటించకుండానే షాపు ల మీదకు వినియోగదారులు ఎగబడ్డారు. చాలా చోట్ల మాస్కులు కూడా ధరించలేదు. శానిటైజేషన్ పాటించలేదు. దీంతో రాష్ట్రంలోనూ అటువంటి పరిస్థితే వస్తుందని ఒకింత ఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమైంది. అయితే సిఎం ఖచ్చితంగా మాస్క్ ధరించాలని అలా అయితేనే లిక్కర్ కొనుగోలుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. భౌతిక దూరానికి కూడా వైన్‌షాప్ యాజమానులు కిలో మీటరు మేర సర్కిల్స్ వేయించారు.

వాటిలోనే మందుబాబులు నిలబడేలా రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకున్నా రు. చాలామంది వెంట శానిటైజర్‌లు కూడా తెచ్చుకున్నా రు. అక్కడక్కడ కొంత గందరగోళం చోటుచేసుకున్నప్పటికీ చాలాచోట్ల ప్రభుత్వ నిబంధనలను పటిష్టంగా అమ లు చేశారు. వైన్‌షాప్ యాజమానులు కూడా దుకాణం ఒపెన్ చేసిన తరువాత అగ్నిమాపక సిబ్బంది సాయంతో మొత్తం శానిటైజేషన్ చేయించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మద్యం విక్రయాలు జరిపారు. మద్యం అమ్మేవాళ్లు కూడా మాస్క్‌లు, గ్లౌజులు ధరించి శానిటైజర్ అందుబాటులో పెట్టుకుని విక్రయాలు జరిపారు.

క్యూలో మహిళలు.. వృద్ధులు
వైన్‌షాప్‌ల వద్ద పురుషులతో పాటు కొన్నిచోట్ల మహిళలు కూడా ప్రత్యేక క్యూ కట్టారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో, ఐటి ఉద్యోగులు అధికంగా ఉండే హైదరాబాద్‌లోని మదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొంతమంది మహిళలు కూడా వచ్చి క్యూ కట్టారు. పురుషుల లైన్ పెద్దగా ఉండటంతో కొందరు మహిళలు వారి భర్తల కోసం వైన్‌షాప్‌లకు వచ్చి కొనుగోళ్లు చేయడం కనిపించింది. వృద్ధులు కూడా లిక్కర్ కోసం మద్యం దుకాణాలకు వచ్చారు.

తొలిరోజే రూ.100 కోట్లు !
రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు తెరలేచిన తొలిరోజే బంప ర్ బిజినెస్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం మొదటి రోజునే రూ.100 కోట్ల మేర మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్ వర్గాల ప్రాథమిక అంచనాకు వచ్చాయి. ఒక్కొక్కరు రూ.50 వేలు, రూ.40 వేల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. మార్చి 21న వైన్ షాపులు బంద్ అయ్యే నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో మొత్తం రూ.110 కోట్ల మద్యం వుందని అంచనా వేశారు. బుధవారం నాడు సుమారు రూ. 44 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. సుమారు లక్ష కేసుల బీరు డిపోల నుంచి వైన్‌షాపుల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి.

ఫోటో ఫోజులు.. వీడియోలు
మద్యంప్రియులు వైన్‌షాపుల ముందు లిక్కర్ బాటిళ్లను పట్టుకుని ఫోటోలు దిగారు. కొందరు టిక్‌టాక్ వీడియోలు చేశారు. మరికొందరు ఏకంగా పూలదండలు పట్టుకుని మద్యం దుకాణాలకు రావడం కనిపించింది. ప్రధానంగా కూలీ పనిచేసుకునే వారు, అడ్డా కూలీలు వారి శారీరక, పని ఒత్తిడిలో భాగంగా రోజు కొంతైనా మద్యం సేవిస్తారు. దీంతో వాళ్లు లిక్కర్‌కు బానిసలుగా మారుతుంటారు. మద్యం దుకాణాల ముందు వారే ఎక్కువ సంఖ్యలో కనిపించారు.

గ్రామాల్లో దావత్‌లు
లాక్‌డౌన్‌తో గ్రామాల్లో వారం, పదిరోజులు బెల్టు షాపుల నుంచి వినియోగదారులు లిక్కర్ కొనుగోలు చేశారు. ఆ తరువాత అక్కడ కూడా స్టాక్ అయిపోవడంలో తాటికల్లు ఎగబడ్డారు. అయితే అది అందరికీ సరిపోను దొరకక నిరాశ చెందుతూ వస్తున్నారు. మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో లాక్‌డౌన్‌లో ఎక్కడెక్కడి నుంచో ఊరుకు చేరిన వారందరూ బుధవారం దావత్‌లు చేసుకున్నారు. ఇంట్లో మాంసం వండించుకుని చెట్ల కిందకు పోయి పార్టీలు చేసుకోవడం కనిపించింది.

నిద్రలేదు : నాగరాజు, మద్యం ప్రియుడు
కెసిఆర్ సార్ వైన్‌షాప్‌లు తెరుస్తమని చెప్పినాక రాత్రంతా నిద్రలేదు. ఎప్పుడు తెల్లరుతుందని వేచి చూసినా. పొద్దుగాల 7 గంటలకే దుకాణానికి వచ్చినా. అప్పటికే ఐదారుగురు నిల్చున్నారు. ఎప్పుడు చేతిలోకి బాటిల్ వస్తుందా అని ఎదురుసూస్తున్న… 45 రోజుల తరువాత నోట్లో చుక్కపడుతున్నందుకు ఆనందంగా ఉంది.

మాస్క్ ఉంటేనే మద్యం
ఎన్‌టిఆర్ స్టేడియం సమీపంలోని వైన్‌షాప్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశించిన దాని ప్రకారం నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తున్నాం. మద్యం ప్రియులు ఎలా ఎగబాడుతారో అని కొంచెం భయం ఉండే. అయితే ఎపి మాదిరి కాకుండా ఇక్కడ భౌతిక దూరం పాటిస్తున్నారు. మేము కూడా సర్కిల్స్ వేయించాం. మాస్క్ ఉంటేనే లిక్కర్ విక్రయిస్తున్నాము. శానిటైజర్‌ను అందుబాటులో పెట్టుకున్నాం. పోలీసులు కూడా సహకరిస్తున్నారు.

సరిపడా మద్యం నిల్వలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదని.. తగినన్ని నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అందుబాటులో లేకపోతే మళ్లీ గుడుంబా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయని, దీంతో రాష్ట్రంలోనూ ప్రారంభించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నాకే మద్యం దుకాణాలు తెరావాలని సిఎం నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందన్నారు. ఇప్పటివరకు అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వారిపై 2,409 కేసులు నమోదు చేసి 2,089 మందిని అరెస్టు చేశామని, దాదాపు 11,130 లీటర్ల గుడుంబాను సీజ్ చేశామన్నారు.మరోవైపు సారాకు కలర్ కలిపి విస్కీలా విక్రయిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రంలో 75 శాతం వరకు మద్యం ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో సగటున 16శాతం పెంచామన్నారు. హైదరాబాద్ నగరంలో దుకాణాల వద్ద పరిస్థితులను పరిశీలించి నిబంధనలు పాటించని 28 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు.

Minister Srinivas Goud Over Liquor Shops Open
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News