Friday, April 26, 2024

ముందుగానే మేలుకున్న రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Minister Talasani Srinivas review on bird flu

బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
1300 మందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు, వలస పక్షులపై నిఘా
చనిపోయో కోళ్ళ శాంపిల్స్‌ను విబిఆర్‌ఐకి పంపించాలి
సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు చోట్ల బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్త యింది. ముందు జాగ్రత్తగా 1300 మందితో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను యుద్ద ప్రాతిపదికన తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇప్పటకిప్పుడు మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం లేకపోయినప్పటికీ, వలస పక్షలతో ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన ఛాంబర్‌లో అత్యవసర భేటీ నిర్వహించారు.
ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, గుజరాత్‌తో పెద్ద మొత్తంలో కోళ్లు, నెమళ్లు, బాతులు, కాకులు మరణిస్తున్నాయి. వలస పక్షుల వల్లే ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ రాకుండా నివారణకు చేపట్టాల్సిన చర్యలపైవారితో మంత్రి తలసాని కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా వలస పక్షల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని.. కోళ్ల ఫారాల్లో చనిపోయో కోళ్ల శాంపిల్స్ వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్( విబిఆర్‌ఐ)కి పంపించాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫారాల్లో అక్కడక్కడా కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి.. పరీక్షలు చేయాలని సూచించారు.
బర్డ్ ఫ్లూ కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పౌల్ట్రీ రైతులకు సలహాలు సూచలు ఇవ్వాలని మంత్రి తలసాని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం తక్కువని..కానీ విదేశాల నుంచి వలస వలస పక్షులతో వ్యాప్తి చెందవచ్చని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. శీతాకాలం నేపథ్యంలో రాబయే రోజుల్లో పౌల్ట్రీ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ షకీల్ పేర్కొన్నారు. దేశంలోని అతి పెద్ద పౌల్ట్రీ పరిశ్రమల్లో తెలంగాణ కూడా ఒకటని.. ఈ నేపథ్యంలో బయో సెక్యూరిటీతో పాటు ఇతర అంశాల్లో జాగ్రత్తలు అవసరమని మంత్రి స్పష్టం చేశారు.

మన దగ్గర లేదు…భవిష్యత్తులో రాదు
ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో బర్డ్ ప్లూ లేదన్నారు. భవిష్యత్తులో మన రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. దీనిపై అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. బర్డ్ ఫ్లూపై నిరంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. గడిచిన ఐదారు సంవత్సరాలుగా పౌల్ట్రీ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. అందువల్లే మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, పక్షలు చనిపోయిన దాఖలాలు లేవన్నారు. పౌల్ట్రీ రంగంలో ఎక్కువగా ప్రైవేటు సంస్థలు అధికంగా ఉన్నాయన్నారు. వారు కూడా కోళ్లు ఎటువంటి వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి తలసాని తెలిపారు. సంబంధిత అధికారులు సైతం ప్రైవేటు వ్యక్తుల పౌల్ట్రీ ఫామ్‌లకు వెళ్లి ముందస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారని ఆయన వివరించారు. అందువల్ల కోళ్ల ఫారం యజమానులుగానీ, ప్రజలు గానీ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Minister Talasani Srinivas review on bird flu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News