Sunday, May 5, 2024

మైనర్ల డ్రైవింగ్…బలవుతున్న బాధితులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, దీని వల్ల అమాయకులు బలవుతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో డ్రైవింగ్ చేస్తున్న వారు మైనర్లు ఉన్నారు. మైనర్లు అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తల్లి, కూతురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సన్‌సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన తల్లీ, కూతురు మైనర్ నిందితుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల బలైపోయారు. పివిఎన్‌ఆర్ ఎక్రెస్‌ప్రెస్ వేపై ఆదివారం మైనర్ బాలుడు వేగంగా కారును నడపడంతో నలుగురు గాయపడ్డారు. వేగంగా కారు నడిపి ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో రెండు కార్ల టైర్లు ఊడిపోవడమే కాకుండా గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలురును అదపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ చేసి మహిళను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది.

బాలుడు(17) గల్లీలో కారు నడుపుతు వెళ్తుండగా ఇంటి బయట నిల్చున్న మహిళను అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు నడిపిన బాలుడు, కారు యజమానిపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా మైనర్లు నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకులు బలవుతున్నారని పోలీసులు తల్లిదండ్రులకు ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడంలేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు నిర్వహించిన ప్రత్యే తనిఖీల్లో వాహనాలు నడుపుతూ 950మంది మైనర్లు పట్టుబడ్డారు. వారిని పట్టుకున్న పోలీసులు రూ.33,500 జరిమానా విధించారు. ఎంవి యాక్ట్ ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాని పోలీస్ అధికారులు చాలా సార్లు హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపినా కూడా చాలామంది వినడంలేదు. దీంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టిన సమయంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఇలా పట్టుబడిన వారిని వాహనాలను తీసుకుంటున్న పోలీసులు తల్లిదండ్రులను తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నారు. ఇలా వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

మూడేళ్ల జైలు శిక్ష…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే భారీగా జరిమానా విధించడంతోపాటు వాహనం యజమాని లేదా తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ఈ నిబంధన గత ఏడాది నుంచి అమలులోకి వచ్చింది. గతంలో మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1,500 జరిమానా,తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేవారు. పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిచారు. కానీ రోజు రోజుకు మైనర్లు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. దీంతో మైనర్లు డ్రైవింగ్ చేస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

చిన్నచిన్న అవసరాలకు…
చాలామంది తల్లిదండ్రులు స్థానికంగా ఉంటున్న చిన్న చిన్న అవసరాలకు వాహనాలను ఇచ్చి పంపుతున్నారు. గల్లీలో ఎవరూ చూడరని భావించి బైక్‌లు ఇస్తున్నారు. బాలురకు బైక్‌లను ఇవ్వడంతో వారు అతివేగంగా వెళ్తున్నారు. దీంతో చాలామంది రోడ్డు ప్రమాదాలు చేసి పలువురిని గాయపర్చడం చేస్తున్నారు. కొన్ని కేసుల్లో మైనర్లు గాయపడిన సంద్భాలు కూడా ఉన్నాయి. స్థానిక అవసరాలకు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని పోలీసులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు కాలనీల్లో కూడా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో చాలామంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News