Monday, April 29, 2024

కేంద్రం కళ్లు తెరవాలి

- Advertisement -
- Advertisement -

Modi prefers economic issues to national security

‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి
నిరుద్యోగ సమస్యకు ఈ ఆందోళనలే
నిదర్శనం అల్లర్లకు ఎన్‌డిఎ
సర్కారుదే బాధ్యత నియంతృత్వ
నిర్ణయాలతోనే ఈ ముప్పు దేశ
భద్రత కంటే ఆర్థిక అంశాలకే
మోడీ ప్రాధాన్యం కేంద్రంపై
నిప్పులు చెరిగిన మంత్రి కెటిఆర్
రాకేశ్ మృతి పట్ల ఆవేదన

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘అగ్నిపథ్’ పథకంపై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్ర సమితి వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారకరామారావు డిమాండ్ చేశారు. తక్షణమే ఈ పథకంపై పునః సమీక్ష చేయాలన్నారు. కేంద్రం తన తప్పుడు నిర్ణయాలతో వన్ ర్యాంక్, పెన్షన్ నుంచి ఆ ర్మీని ప్రస్తుతం నో ర్యాంక్.. -నో పెన్షన్ స్థాయికి కేంద్రం దిగజార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి, కేం ద్రమే పూర్తిబాధ్యత వహించాలన్నారు. జై జవా న్.. -జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో న్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతులను కేంద్రం గోసపెట్టిందన్నారు. ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు.

భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఇలాంటి చర్చలు లేకుండా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జిఎస్‌టి, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, లాక్‌డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని మోడీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందన్నారు. తాజాగా దేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా అనాలోచితంగా కేంద్రం అగ్నిపథ్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. పైగా తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్న యువకులపైననే ఆ నెపాన్ని నెట్టే దుర్మార్గపు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన
విమర్శించారు.

కేంద్రమే బాధ్యత వహించాలి

కేంద్రం తీసుకున్న వివాదాస్పద విదానానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఒక యువకుడి మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేవలం తమ అనాలోచిత నిర్ణయాలతో యువకుల ప్రాణాలను కేంద్రం బలిగొన్నదని ఆరోపించారు. కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తన సానుభూతిని ప్రకటించారు.

అగ్నిపథ్‌పై అనేక అనుమానాలు

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకంపై అనేక అనుమానాలు ఉన్నాయని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు, పరిపాలనా నిర్ణయాలవల్ల దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో నెలకొన్నదన్నారు. ఈ నేపథ్యంలో దేశానికి సేవ చేస్తూనే… ఆర్మీ ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న కోట్లాదిమంది యువత అశలను వంచించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభద్రతను సైతం కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పడం దేశభద్రతపై వారి డొల్లవిధానాలకు నిదర్శనమని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అగ్నిపథ్ పథకం ద్వారా దేశభద్రతతో పాటు యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా కేవలం నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీలో విధులు నిర్వహించిన యువతలో 75శాతం తిరిగి నిరుద్యోగులుగా మారతారన్నారు. సైనికదళంలో చేరి దేశానికి సేవచేయాలని కలలు కంటూ, సంవత్సరాలపాటు ఉద్యోగానికి సన్నద్దమయ్యే యువత, కనీసం అన్ని సంవత్సరాలు సైతం ఉద్యోగంలో ఉండేందుకు అవకాశం లేదన్నారు.

కేంద్రం చెబుతున్నవి శుద్ధ అబద్దాలు

అత్యంత కీలకమైన యుక్తవయసులో ఆర్మీలో చేరి నాలుగు సంవత్సరాలకే బయటకు పంపిస్తే, తర్వాత వారికి ఉపాధి అవకాశాలు దక్కే ఛాన్సే లేవని కెటిఆర్ అన్నారు. ఇప్పటికే సంవత్సరాలపాటు ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇలాంటి సందర్భంలో సైన్యంలో భర్తీ అయిన 75 శాతం మంది యువకులను ప్రతియేటా నిరుద్యోగులుగా మార్చే ఈ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్దమన్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ చెప్పిన ప్రైవేటురంగంలో ప్రతియేటా రెండుకోట్ల ఉద్యోగాలు ఎంత నిజమో దేశయువతకి తెలుసని కెటిఆర్ ఎద్దేవాచేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే గ్రామీణప్రాంత యువత ఆర్మీఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోందన్నారు. అలాంటి గ్రామీణయువత నాలుగేళ్ల తర్వాత పోటీ అధికంగా ఉండే ప్రైవేటురంగంలో ఉపాధిపొందే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. దేశ రక్షణకు సంక్షోభ సమయాల్లో కేవలం శిక్షణ కలిగిన నూతన సైనికులతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉండాల్సిన అవసరం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైందన్నారు.

దేశ భద్రతకంటే…ఆర్ధికపరమైన అంశాలకే కేంద్రం ప్రాధాన్యత

కేంద్రం వివాదస్పద విధానంతో దశాబ్దాలుగా ఆర్మీలో నిర్మాణమైయున్న సంస్థాగత సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలకు భంగంకలిగే ప్రమాదం ఉందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశానికి పొరుగుదేశాలతో అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. దేశ భద్రత కన్నా కేవలం ఆర్థికపరమైన అంశాలకే బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరమన్నారు.

పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకే…ఈ చౌకబారు ఎత్తుగడ

పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకు కేంద్రం చేపట్టిన చౌకబారు ఎత్తుగడనే ఈ వివాదస్పద విధానమని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే బిజెపి తీసుకున్న అనేకనిర్ణయాలు దేశప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం డిమానిటైజేషన్, నల్లవ్యవసాయ చట్టాలు వంటి వాటి విషయంలో నిరూపితమైందన్నారు. ఇప్పుడు బిజెపి చేపట్టిన అగ్నిపథ్ పథకం నిర్ణయంపై తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతున్న తీరు, దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు. నిరుద్యోగ యువతలో కేంద్రప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి….ప్రస్తుతం దేశం వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు అద్దం పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి దేశ యువకుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ విధానాన్ని వెంటనే సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా మోడీ మౌనం వీడాలి

దేశంలో ఏ సంక్షోభం వచ్చినా మౌనాన్ని ఆశ్రయించే ప్రధాని నరేంద్రమోడీ, ఈ కీలక విషయంలో ఎప్పటిలాగే దాటవేయవద్దని మంత్రి కెటిఆర్ హితవు పలికారు. అగ్నిపథ్‌పై కేంద్రం వెంటనే తమవైఖరిని స్పష్టంచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానంపైన అందోళన చేస్తున్న దేశ యువత అనుమానాలను, అవేదనను తాము అర్ధం చేసుకుంటామన్నారు. ఈ విధానంపైన కేంద్రం పున సమీక్ష చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అభ్యర్ధుల పక్షాన మోడీ ప్రభుత్వంపై తాము ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News