Friday, May 3, 2024

జి 7, క్వాడ్ సదస్సులకు హాజరు కానున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ వచ్చే నెల 19, 24 తేదీల మధ్య జరగనున్న జి7 , క్వాడ్ దేశాల సదస్సులకు హాజరు కాడానికి సంసిద్ధులయ్యారు. ఆస్ట్రేలియా లోని సిడ్నీలో మే 24న క్వాడ్ దేశాల సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లతోపాటు ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, ఇండోపసిఫిక్ లోని మొత్తం పరిస్థితిపై బిడెన్; ఆంథోనీలతో ప్రధాని మోడీ చర్చిస్తారని తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు జపాన్ లోని హీరోషిమాలో జి 7 దేశాల వార్షిక సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. మే 19నుంచి 21 వరకు జి7 సమావేశాలు జరుగుతాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా గత నెల భారత్‌లో పర్యటించినప్పుడు ప్రధాని మోడీని జపాన్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. జి7 సమావేశాల్లో ఇండో పసిఫిక్ రీజియన్‌కు సంబంధించి క్వాడ్ దేశాల నేతల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవలసిన అవసరంపై చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ పసిఫిక్ రీజియన్‌లో చైనా మిలిటరీ బలగాల విస్తరణ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇండోపసిఫిక్ రీజియన్ పరిస్థితిపై చర్చలు అవసరమౌతాయి. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ జి7, క్వాడ్ సదస్సులకు హాజరవుతారని బుధవారం వైట్‌హౌస్ ప్రకటించింది. జపాన్ నుంచి మోడీ పసిఫిక్ ద్వీప దేశానికి వెళ్లి, అక్కడ నుంచి క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్తారు. అయితే ఈ పర్యటనలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. క్వాడ్ సదస్సు ఆతిధ్యం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కార్యాలయం బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇండోపసిఫిక్ రీజియన్ విజయం గురించి క్వాడ్ భాగస్వామ్య దేశాలన్నీ చాలా కష్టపడ్డారని, ఈసమష్టి బలాన్ని పెంచుకోడానికి ఆస్ట్రేలియా ఎంతో తోడ్పతుందని, రీజియన్ అవసరాల కోసం సమర్థవంతంగా స్పందిస్తుందని అల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ దేశాల పురోభివృద్ధికి, సార్వభౌమత్వాన్ని గౌరవించడానికి, భద్రత, అభివృద్ధి పెంపొందించడానికి క్వాడ్ సదస్సు దోహదం చేస్తుందని ప్రకటించారు. జి7, క్వాడ్ దేశాల సదస్సులతోపాటు అనేక ద్వైపాక్షిక సమావేశాలను ప్రధాని మోడీ నిర్వహించే అవకాశం ఉంది. క్వాడ్ సదస్సుకు ఆస్ట్రేలియా ఆతిధ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. క్వాడ్ సదస్సులో నేతలంతా ముఖాముఖిగా సమావేశం కావడం మూడోసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News