Friday, May 3, 2024

సిరాజ్ మళ్లీ నంబర్‌వన్

- Advertisement -
- Advertisement -

దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ స్టార్, టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఆరు వికెట్లతో ఇరగదీసిన సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతను ఏకంగా 8 ర్యాంక్‌లను మెరుగుపరుచుకోవడం విశేషం. సిరాజ్ 694 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఆసియాకప్‌లో సిరాజ్ అసాధారణ బౌలింగ్‌తో అలరించాడు. ఫైనల్లో అయితే 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు. దీంతో అతని ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకుని పెను ప్రకంపనలు సృష్టించాడు.

ఇక ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోస్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. చాలా రోజులుగా హాజిల్‌వుడ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. అయితే అతన్ని హైదరాబాదీ సిరాజ్ వెనక్కి నెట్టాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లు ముజీబుర్ రహ్మన్ నాలుగో, రషీద్ ఖాన్ ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిఛెల్ స్టార్క్ మూడు ర్యాంక్‌లు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు ర్యాంక్‌లు కోల్పోయి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా కప్‌లో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచినా ర్యాంకింగ్స్‌లో మాత్రం సత్తా చాటలేక పోయాడు.

రెండో ర్యాంక్‌లోనే గిల్..
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో 814 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 857 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. బాబర్ చాలా కాలంగా టాప్‌లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వండర్ డుసెన్ (సౌతాఫ్రికా) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన ఇమామ్ ఉల్ హక్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. హారి టెక్టర్ (ఐర్లాండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.

డేవిడ్ వార్నర్ రెండు ర్యాంక్‌లు కోల్పోయి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) ఏడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్ పైకి ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా మూడో, సౌతాఫ్రికా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాయి. ఇంగ్లండ్ ఐదో ర్యాంక్‌ను దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News