Sunday, April 28, 2024

రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?

- Advertisement -
- Advertisement -

More deregulation

 

కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ
బస్సుల రవాణాపై కీలక నిర్ణయం
లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ
రేపు ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడగించిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షల సడలింపులపై శుక్రవారం (15వ తేదీ)నాడు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై తీసుకున్న పలు నిర్ణయాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నెల 19వ తేదీన దేశంలో సరికొత్త రూపంతో 4.0 లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ కొత్త లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? దాని పరిణామా లు? రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మేరకు సహకరిస్తాయి? తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్ధిక ప్యాకేజీ, ఎంఎస్‌ఎంఇలకు ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం చేకూరనుంది? కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో వివిధ రంగాలకు చేయూతనిచ్చే అంశాలపై కూడా సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించనున్నారు. కేంద్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండడం వల్ల తలెత్తున్న సమస్యలు… దీని వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులపై కూడా ఈ సమీక్షలో లోతుగా చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా కేంద్రం ఒకవైపు లాక్‌డౌన్‌ను అమలు చేస్తూనే వివధ రంగాలకు అనేక సండలింపులను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో కూడా వివిధ రంగాలకు సడలింపులు ఇవ్వడం? వాటికి సంబంధించిన నిబంధనలపై చర్చించి ఉన్నతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఇక దానితో కలిసి జీవించే అంశాలపై కూడా లోతుగా సమాలోచనలు చేయనున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు యాభై రోజులుగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్నీ గణనీయంగా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ ఈ నెల 5వ తేదీన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వైన్స్ షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.

అలాగే ఆర్‌టిఎ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వంటి శాఖలు కూడా పనిచేస్తాయని సిఎం కెసిఆర్ చెప్పారు. క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకుని, యథావిధిగా విధులను నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాల్లో ఆర్‌టిసి బస్సులను నడిపే విషయంలో కూడా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెండు మాసాలుగా పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ఆర్‌టిసిని ఆర్ధిక నష్టాల నుంచి గట్టెక్కించడానికి వీలైనంత త్వరగా బస్సులను నడపాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ బసులను నడపడం వల్ల కరోనా వైరస్‌ను ఏ మేరకు నియంత్రించేందుకు అవకాశముంటుంది? ఒకవేళ అనుమతులను ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తదితర అంశాలపై ఇప్పటికే సిఎం కెసిఆర్ రవాణా శాఖ అధికారులతో కూలంకషంగా చర్చించినట్లుగా సమాచారం.

దీంతో శుక్రవారం జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్‌టిసి బస్సుల నడపడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆర్‌టిసిలో పెద్దఎత్తున వినిపిస్తోంది. అలాగే రెడ్‌జోన్లు మినహా మిగిలిన గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు రంగాలకు మరిన్ని అంక్షలు కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీటితో పాటు సినిమా రంగానికి సంబంధించిన షూటింగ్‌లను కొనసాగించే అంశంపై కూడా చర్చించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇక జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ నివారణకు మరిన్ని పకడ్బంది చర్యలు తీసుకోనున్నారు. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలతో పాటు ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించే విధంగా తగు ఆదేశాలను సిఎం కెసిఆర్ జారీ చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News