Thursday, May 2, 2024

భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్

- Advertisement -
- Advertisement -

Mukesh Ambani

 

ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్‌నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020 వెల్లడి

న్యూయార్క్ : భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రూ.3,37,078 కోట్ల (44.3 బిలియన్ డాలర్లు) నికర విలువతో ఫోర్బ్ జాబితాలో ఆయన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ 99,000 కోట్ల మేర ఆయన సంపద తరిగిపోయినా దేశంలో నెంబర్ వన్ స్ధానాన్ని కోల్పోలేదు. అలాగే ఆయన ప్రపంచ జాబితాలో 17వ స్థానం దక్కించుకున్నారు. ముకేశ్ అంబానీకి చెందిన దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 88 బిలియన్ డాలర్ల ఆదాయంతో నడుస్తోంది. రిలయన్స్ జియో 34 కోట్లకుపైగా కస్టమర్లతో దేశంలో అగ్ర టెలికాం సంస్థగా నిలిచిందని ఫోర్బ్ నివేదిక వివరించింది.

ఫోర్బ్ 2020 భారత బిలియనీర్ల జాబితా ప్రకారం, డీమార్ట్ అధిపతి రాధాకృష్ణన్ దామాని ధనవంతుడిగా రెండో స్థానంలో నిలిచారు. కరోనా సంక్షోభంతో స్టాక్‌మార్కెట్ కుదేలవుతున్నా రిటైల్ దిగ్గజం డీ మార్ట్ అధిపతి రాధాకృష్ణన్ దామాని సంపద రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఆయన భారత్‌లో అత్యంత సంపన్నుల్లో రెండవ స్ధానంలో నిలిచారు. దామాని సంపద 25 శాతం పెరగడంతో ఈ జాబితాలో తొలిసారిగా ఆయన రెండో ర్యాంక్‌కు ఎగబాకారు. ప్రపంచ జాబితాలో 65వ ర్యాంక్‌ను పొందారు. కోవిడ్-19 ప్రభావంతో పలు కంపెనీలు నష్టాలతో సతమతమవుతుంటే దామానీ సంపద మాత్రం పెరగడం గమనార్హం. మందగమనం ఉండగా, మరోవైపు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్ వెల్లడించింది.

గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది. బిలియనీర్ల మొత్తం సంపద ఏకంగా 23 శాతం పడిపోయింది. ఇక హెచ్‌సిఎల్ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్ రూ 89,250 కోట్ల సంపదతో భారత బిలియనీర్ల జాబితాలో మూడో స్ధానం సొంతం చేసుకున్నారు. ప్రపంచ జాబితాలో 114వ స్థానంలో ఉన్నారు. ఈ ఫోర్బ్ జాబితాలో నాలుగో అత్యంత భారత సంపన్నుడిగా రూ 78,000 కోట్ల సంపదతో ఉదయ్ కొటక్ నిలవగా, ఐదో స్థానంలో గౌతం అదాని రూ.66,700 కోట్ల సంపదను కల్గివున్నారు. ఇక టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ వ్యవస్ధాపకుడు సునీల్ మిట్టల్ ఆరో స్ధానంలో నిలిచారు. ఇక సైరస్ పూనావాలా, కుమార్ బిర్లా, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్‌జీ, -దిలీప్ సంఘ్వీలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

తొలిసారి జాబితాలోకి బైజు రవీంద్రన్
ఫోర్బ్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిసారిగా బైజు రవీంద్రన్ స్థానం దక్కించుకున్నారు. బైజుస్ వ్యవస్థాపకుడు అయిన ఆయన నికర విలువ 1.8 బిలియన్ డాలర్లు అంటే రూ.13,690 కోట్లు. భారత్ నుంచి రవీంద్రన్ తొలి యువ బిలియనీర్‌గా ఫోర్బ్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.

ప్రపంచంలో అమెరికాదే పైచేయి
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆసియా పసిఫిక్ నుంచే అత్యధికంగా 778 మంది ఉన్నారు. అయితే దేశాల్లో ఇప్పటికీ అమెరికాదే పైచేయిగా ఉంది. అమెరికా నుంచి దాదాపు 614 మంది సంపన్నులు స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో యూరప్ నుంచి 511 మంది ర్యాంక్ పొందారు. దేశాల వారీగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. 2019లో చైనా నుంచి 324 మంది కుబేరులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 389కి చేరింది. ఆ తర్వాత జర్మనీ నుంచి 107, ఇండియా నుంచి 102, రష్యా నుంచి 99 మంది బిలియనీర్లు జాబితాలో స్థానం పొందారు.

Mukesh Ambani retains spot as richest Indian
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News