Friday, April 26, 2024

సామాజిక న్యాయ నేతాజీ

- Advertisement -
- Advertisement -

Mulayam Singh Yadav passed away  మల్లయోధుడుగా, నేతాజీగా, మౌలానాగా ప్రసిద్ధికెక్కి దేశ రాజకీయాలను సామాజిక న్యాయ మలుపు తిప్పిన ములాయం సింగ్ యాదవ్ ఇక లేరన్న వార్త అందరినీ శోకతప్తులను చేసింది. ఆయన కేవలం ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసినవారు మాత్రమే కాదు, బిజెపి మతతత్వ రాజకీయాలతో తీవ్రంగా పోరాడిన మహా సైనికుడు, సైన్యాధ్యక్షుడు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను అగ్రవర్ణ ఆధిపత్యం నుంచి, బిజెపి వ్యతిరేక పోరాటాన్ని కాంగ్రెస్ చేతుల్లోంచి విడుదల చేయించి వాటిని కొత్త దిశలో నడిపించిన గొప్ప నాయకుడు ములాయం సింగ్. తాలింఖానాల్లో తొడగొట్టి తడఖా చూపే మల్లయోధుడుగా స్థిరపడిపోవాలనుకున్న ఆయన ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత కళాశాల అధ్యాపకుడుగా పని చేసి 1967లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. లోహియా ఆలోచనలకు ప్రభావితుడైన ఉత్తమ సోషలిస్టుగా ప్రసిద్ధికెక్కారు. జయప్రకాశ్ నారాయణ్ అనుచరుడయ్యారు.

1967లో సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్ మీద జస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి యుపి అసెంబ్లీకి మొదటిసారిగా ఎన్నికయ్యారు. 1975లో ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమెర్జెన్సీ కాలమంతా 19 నెలల పాటు అనుభవించిన జైలు శిక్ష ములాయంను మాజీ ప్రధాని చరణ్ సింగ్ వంటి వారికి బాగా దగ్గర చేసింది. జైలు నుంచి వచ్చిన తర్వాత చరణ్ సింగ్ పార్టీ లోక్‌దళ్‌లో చేరారు. ఎమెర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లో జస్వంత్ నగర్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు యుపిలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 1980లో జనతా పార్టీలో వచ్చిన చీలిక దానిని చరమాంకానికి నెట్టి వేసింది. ఆ ఏడాది జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం ఓడిపోయారు. ద్వంద్వ సభ్యత్వ వివాదంపై జనతా పార్టీ నుంచి వీడిపోయిన జనసంఘ్ అదే సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త అవతారమెత్తింది. దీని సవాలును ఎదుర్కోడంలో కాంగ్రెస్ కాళ్లు తడబడడం మొదలుపెట్టాయి.

ఒకవైపు ముస్లింలతో స్నేహం చేస్తూ, మరోవైపు హిందుత్వ పోకడలు పోతూ వచ్చిన కాంగ్రెస్ మండల్ రాజకీయాల దెబ్బకు పూర్తిగా తెరమరుగయింది. విపి సింగ్ ప్రధానిగా ప్రయోగించిన మండల్ సిఫార్సుల అమలు అస్త్రంతో బిజెపి కమండల్ రాజకీయాలను ఆశ్రయించింది. అటు బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇటు యుపిలో ములాయం మండల్ రాజకీయాల సారథ్యాన్ని చేపట్టారు. దానితో వెనుకబడిన తరగతులు సంఘటితమై వారిలో సామాజిక న్యాయ చైతన్యం పురివిప్పింది. 1989లో మొదటిసారిగా యుపి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ములాయం 1991లో దిగిపోడంతో అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రిత్వంలో 1992లో బాబ్రీ మసీదు కూలిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. అదే ఏడాది ములాయం సమాజ్ వాదీ పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి నేతాజీగా ప్రసిద్ధికెక్కారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష రాజకీయ మంటల్లో మాడిన ముస్లింలు బాబ్రీ మసీదు కూల్చివేత ఉదంతంతో కాంగ్రెస్‌కు దూరమైపోయి ములాయం వెంట సంఘటితమయ్యారు. దానితో ఆయనకు మౌలాన అన్నపేరు వచ్చింది. వెనుకబడిన తరగతులను, దళితులను కలిపే యోచన చేసిన ములాయం 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఎతావా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ స్థాపకుడు కాన్షీరామ్‌కు మద్దతు ఇచ్చారు.

1993 అసెంబ్లీ ఎన్నికల్లో దళిత్ ఒబిసి ఐక్యతతో ఎస్‌పి, బిఎస్‌పి కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని చెరి సగం పదవీ కాలం పంచుకుందామని ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. కాని 1995లో మాయావతిపై ఎస్‌పి కార్యకర్తలు దాడి చేయడంతో ఆ రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయింది. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి, అఖిలేశ్ యాదవ్‌ల సంకల్పంతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ అది నిలబడలేదు. ఆ ఎన్నికల్లో యుపిలోని 80 లోక్‌సభ స్థానాల్లో బిజెపి 64 గెలుచుకోగా, ఎస్‌పి, బిఎస్‌పి మహాఘట్ బంధన్ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2003లో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ములాయం 2007 వరకు కొనసాగి ఆ తర్వాత కుమారుడు అఖిలేశ్‌ను రంగంలో దింపారు. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసి అనేక యుద్ధాల్లో ఆరితేరిన కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ చివరి రోజుల్లో ప్రధాని మోడీతో మంచిగా మెలిగాడన్న అభిప్రాయానికి తావిచ్చినప్పటికీ భారత రాజకీయాల్లో అణగారిన వర్గాల తరపున అలుపెరుగని పోరాటం చేసిన మహా నాయకుడుగా చరిత్రలో మిగిలిపోతారు. ఆయనకు ఘన నివాళి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News