Sunday, May 5, 2024

ఆత్మవిశ్వాసంతో ముంబై

- Advertisement -
- Advertisement -
Mumbai VS Kolkata Knight Riders Match
నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరు

అబుదాబి: వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటికే ముంబై ఐదు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంతకు ముందు కోల్‌కతాతో జరిగిన తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో కూడా ముంబై జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో ముంబై పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఇక కోల్‌కతాను కూడా ఓడించి పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటాన్ డికాక్‌లలో నిలక లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. ఈసారైన మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఓపెనర్లపై ఉంది.

ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు మెరుగ్గా ఆడుతున్నారు. ఈసారి కూడా జట్టు వీరపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇద్దరు కూడా క్లిష్ట సమయాల్లో జట్టుకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు కీరన్ పొలార్డ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, బుమ్రా, బౌల్ట్, పాటిన్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

రసెల్ ఈసారైన..

మరోవైపు కోల్‌కతా ఇప్పటి వరకు నాలుగు విజయాలు సాధించింది. అయితే బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. కాగా, కిందటిసారి ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ఈ మ్యాచ్‌లో బదులు తీర్చుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. అయితే కీలక ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించక పోవడం కోల్‌కతాకు సమస్యగా తయారైంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తదితరులు తమ స్థాయికి ఆటను కనబరచడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా కార్తీక్, రసెల్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. అంతేగాక కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న పాట్ కమిన్స్ బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. కనీసం ఈసారైన కీలక ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరోసారి ముంబై చేతిలో ఓటమి తప్పక పోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News