Monday, April 29, 2024

నార్తిండియాలో థియేటర్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -
Theatres open in North India
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోని సినిమా హాళ్లు

దేశంలో అన్ లాక్ 5.0 నిబంధనలో భాగంగా గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్లలో సందడి మొదలైంది. అయితే అది పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలల పాటు మూసి ఉన్న థియేటర్లు కేంద్రం మార్గదర్శకాలతో తిరిగి తెరుచుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇంకా సినిమా థియేటర్లు తెరుచుకోలేదు.

బాలీవుడ్ సినిమాల రీ రిలీజ్‌లు…

అయితే నార్తిండియాలో పలు చోట్ల సినిమా హాళ్లు తెరుచుకున్నప్పటికీ కొత్త రిలీజ్‌లు మాత్రం లేవు. పాత బాలీవుడ్ సినిమాలనే థియేటర్లలో తిరిగి ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చియ బెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు గురువారం నుంచి ఓ మోస్త్తారుగా తెరుచుకున్నాయి. ఇక బాలీవుడ్ హిట్ సినిమాలు తన్హాజీ, కేదార్‌నాథ్, శుభ్ మంగళ్ జ్యాదా సావ్‌ధాన్, మలంగ్, తప్పడ్ సినిమాలు థియేటర్లలో మళ్లీ విడుదలయ్యాయి.

దక్షిణాదిన…

ఇక దక్షిణాన బెంగుళూరులో మాత్రమే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యా యి. ప్రధానంగా బెంగళూరులోని మల్టీప్లెక్స్‌లు ఓపెన్ అయ్యాయి. తమిళనాడులో కూడా త్వరలో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరిచేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే వాటికి పాత సినిమాలే స్వాగతం పలుకుతున్నాయి. బెంగుళూర్‌లో కన్నడ ప్రేక్షకులను అల వైకుంఠపురంలో, భీష్మ సినిమాలు ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఇక తమిళ ఆడియన్స్ వద్దకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వెళ్తున్నాడు. తమిళనాట థియేటర్లు అన్ లాక్ అయిన వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తమిళ వర్షన్ ‘ఇవనుక్కు సరియానా’ ఆల్లి ను విడుదల చేసేందుకు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత సిద్ధంగా ఉన్నాడు. దాదాపుగా 150 నుండి 200 స్క్రీన్‌లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మల్టీప్లెక్స్ కంపెనీల సందడి..

దేశంలోనే టాప్ మల్టీప్లెక్స్ కంపెనీల్లో ఒకటైన పీవీఆర్ సంస్థ గురువారం నుంచి తమ స్క్రీన్స్‌లో కొన్నింటిని పలు ప్రాంతాల్లో ఓపెన్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 846 స్క్రీన్స్ ఉన్నాయి. అదేవిధంగా సినీ పొలీస్, ఐనాక్స్, సినీ ఫ్లెక్స్ తదితర మల్లీప్లెక్స్ సంస్థలు పలు చోట్ల తమ స్క్రీన్స్‌ను కొన్నింటిని తెరిచింది. అయితే ఉత్తరాదిన ఎక్కువగా మల్లీప్లెక్స్ థియేటర్లలో బాలీవుడ్ సినిమాలే రీ రిలీజయ్యాయి.

తెరుచుకోని థియేటర్లు…

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. దీనికితోడు భారీ వర్షాలు సినిమా హాళ్లు తెరిచేందుకు అడ్డంకిగా మారాయి. అటు ఏపీలో ఎగ్జిబిటర్లంతా మూకుమ్మడిగా థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల ఎగ్జిబిటర్లు, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని తేల్చేశారు. దీనికితోడు తమ థియేటర్ల కరెంట్ బిల్లుల మాఫీపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్లు తెరవాలా వద్దా అనే అంశం ఆధారపడి ఉంటుందని ప్రకటించాయి. మరోవైపు ఖర్చు తగ్గించేందుకు క్యూబ్, యూఎఫ్‌ఓ లాంటి సంస్థలు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) తగ్గించాయి. కొన్నాళ్ల పాటు 50 శాతం ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించాయి. దీనికితోడు ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసమే ఎదురు చూసిన పలు పెద్ద సినిమాలు కూడా వెంటనే థియేటర్లలోకి వచ్చేందుకు మొగ్గుచూపించడం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే దసరా నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం ఉంది.

ఓటీటీల వైపు మొగ్గు…

లాక్ డౌన్ సడలింపులతో సినీ ఇండస్ట్రీ నెమ్మదిగా మాములు స్థితికి వస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ల సందడి తిరిగి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతినిచ్చినా ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఒక్క సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాల థియేట్రికల్ రిలీజ్‌కి వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందులోనూ థియేట్రికల్ రిలీజ్ అంటే నిర్మాతలు చెప్పిన రేట్‌కి సినిమా తీసుకునే బయ్యర్లు రావాలి.

ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్‌కి వస్తారా అనే సందేహంతో బయ్యర్లు నిర్మాత అడిగినంత ఇస్తారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ థియేటర్లకంటే ఓటీటీలకే మొగ్గుచూపుతున్నారని తెలిసింది. ఇదివరకే పూర్తయిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న సినిమాల మేకర్స్ ఓటీటీ డీల్స్ కోసం బేరసారాలు జరుపుతున్నారట. అందుకే కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు ఇంకా ప్రకటించలేదని తెలిసింది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలన్నీ కుదిరితే థియేట్రికల్ లేదా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారట. ఎక్కువ శాతం మంది ఫిల్మ్‌మేకర్స్ మాత్రం థియేటర్లు తెరిచినా కొన్ని రోజుల వరకు ఓటీటీలకే ఓటు వేస్తారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News