Tuesday, May 7, 2024

పండిట్ జస్‌రాజ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 భీమ్‌సేన్ జోషి సమకాలీనుడు.. దిగ్గజాల గురువు
 తండ్రి పేరిట హైదరాబాద్‌లో కచేరీల నిర్వాహకులు
 రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

Music Legend Pandit Jasraj Passes away

న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ కన్నుమూశారు. ఈ సంగీత స్రష్ట వయస్సు 90 సంవత్సరాలు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన మరణించిన విషయాన్ని ఆమె కుమార్తె దుర్గా జస్రాజ్ సోమవారం వెల్లడించారు. సంగీతంలో ఆయన సృష్టించిన స్వరాలకు గుర్తింపుగా దేశ గౌరవ పురస్కారం పద్మవిభూషణ్ ఆయనకు దక్కింది. హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో ఉన్న పిలి మండోరిలోజస్రాజ్ 1930 జనవరి 28వ తేదీన జన్మించారు. దాదాపుగా 80 ఏళ్లపాటు సంగీత ప్రపంచానికి చిరపరిచితులుగా ఉన్నారు. దేశంలోని ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసులలో ఆయన ఒకరు. భారత రత్న పండిత్ భీమ్‌సేన్ జోషికి జస్రాజ్ సమకాలీనులు. న్యూజెర్సీలో తమ నివాసంలో గుండపోటుతో జస్రాజ్ కన్నుమూశారని కూతురు తెలిపారు. సంగీత గురువుగా పేరొందిన ఆయన శాస్త్రీయ సంగీతానికి పలు వన్నెలు చిన్నెలు అద్దారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయనను సన్మానించింది. ఎందరో ప్రముఖ సంగీత కళాకారులు పండిట్ జస్రాజ్ శిష్యులుగా ఉన్నారు. వీరిలో సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామనాథ్, బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్ వంటి వారు ఎందరో ఉన్నారు.

ఈ సంగీతకళా తపస్వి అమరులు అయిన విషయం తెలియగానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటని ప్రధాని మోడీ ట్వీటు వెలువరించారు. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను జతపర్చారు. పండిట్ జస్రాజ్ మృతి పట్ల హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ ఇతరులు విచారం వ్యక్తం చేశారు. జస్రాజ్ తన తండ్రి పండిట్ మోతీరామ్‌ను సంగీతంలో తన తొలి గురువుగా భావిస్తూ ఉంటారు. తండ్రి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా పండిట్ మోతీరామ్ సంగీత్ సమారోహ్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో జస్రాజ్ పేరిట కొందరు సంగీత ప్రియులు ఓ వీధికి పండింట్ జస్రాజ్ స్రీట్ అనే పేరు కూడా పెట్టారు. ఓం నమో భగవతే వాసుదేవాయా అనే కీర్తనను తరచూ కచేరీల్లోవిన్పించే పండిట్ జస్రాజ్ ఇప్పుడు ఆ దేవదేవుడి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా దీనిని ఆలాపిస్తారని కుటుంబ సభ్యులు భావేద్వేగపు ట్వీటు వెలువరించారు.మేవాతి ఘరానా రాగాలాపనలో పండిట్ జస్రాజ్ దిట్ట. పండిట్ జస్రాజ్ రాగాలాపనతో కూడిన పలు శాస్త్రీయ, పాక్షిక శాస్త్రీయ ఆల్బమ్‌లు అనేకం విడుదల అయ్యాయి. కొన్ని చిత్రాలలో ఈ రాగాలను నేపథ్యంగా వాడుకన్నారు. ఆయన సృజించిన కృతులను బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల సంగీత దర్శకులు కూడా వాడుకున్నారు.

‘లైఫ్ ఆఫ్ ఫై’ అనే సినిమాకు జస్రాజ్ కృతినే స్వీకరించారు. ఆయన కేవలం భారత్‌లోనే కాకుం డా కెనడా, అమెరికా ఇతర చోట్ల ఎందరికో సంగీతం నేర్పించారు. తాను ఆలాపిస్తూ తబలా వాయిద్యాన్ని కూడా సృష్టిస్తూ ఆహుతులను మరో లోకానికి తీసుకువెళ్లేలా చేసే ఎన్నో కచేరీలు నిర్వహించిన ఘనమైన చరిత పండిట్ జస్రాజ్ సాధించుకున్నారు. 1962లో జస్రాజ్ ప్రముఖ దర్శకులు వి శాంతారామ్ కూతురు మధుర శాంతారామ్‌ను పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు సారంగ్ దేవ్ పండిట్, కూతురు దుర్గా జస్రాజ్. ఇక భార్య మధుర సంగీత్ మార్తాండ్ పండిట్ జస్రాజ్ అనే సినిమాను 2009లో తీశారు. అంతేకాకుండా తండ్రి శాంతారామ్ కళా వారసత్వంగా ఓ మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో జస్రాజ్ , లతా మంగేష్కర్‌లు ఓ యుగళగీతం పాడారు. ఆయన సంగీతం గంభీరంగా మేవాతి ఘరానాలో సాగడమే కాకుండా కొసమెరుపులుగా హాస్యోక్తుల వంటి టుమ్రీలు లేదా తుమ్రీలు కూడా సాగుతూ సభికులను ఆనంద పరవశులను చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News