Sunday, April 28, 2024

రష్యాలో పుతిన్ ప్రత్యర్థి నావల్నీ మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాలో ప్రతిపక్ష నేత, పుతిన్ తీవ్రవిమర్శకులు , లాయర్ అలెక్సీ నావల్నీ జైలులోనే మృతి చెందారు. 19 సంవత్సరాల జైలుశిక్ష పడటంతో నావల్నీ కార్పాలోని ఆర్కిటిక్‌జైలు సముదాయంలో బందీగా జీవితం గడుపుతున్నారు. 47 సంవత్సరాల నావల్నీ శుక్రవారం మార్నింగ్‌వాక్‌కు వెళ్లి వచ్చిన తరువాత అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు, ఆయనను కాపాడేందుకు డాక్టర్లు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని జైలు అధికారులు ఓ ప్రకటన వెలువరించారు. చాలా రోజులుగా నావల్నీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతూ వచ్చింది. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలోనే ఆయన మృతి చెందినట్లు రష్యా అధికారిక జైళ్ల శాఖ తెలిపింది. ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు, వెంటనే అంబులెన్స్ పిలిపించి డాక్టర్ల బృందంతో వివిధ రకాల పరీక్షలు, తక్షణ ప్రాణరక్షణ చర్యలు చేపట్టినట్లు , అయితే చికిత్సకు ఆయన స్పందించలేదని వివరించారు.

ఆయన మృతికి దారితీసిన అనారోగ్య సమస్యలను నిర్థారించాల్సి ఉంది. కాగా నావల్నీ మరణోదంతంపై రష్యా దర్యాప్తు సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, విచారణ ఆరంభించింది. ఆయన మృతి గురించి అధికారులు తమకు ఇప్పటివరకూ తెలియచేయలేదని ఆయన ప్రెస్‌సెక్రెటరీ కిరా యార్మిష్ తెలిపారు. మీడియా వార్తలతోనే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. అలెక్సీ లాయర్ ఇప్పుడు ప్రిజన్ కాలనీకి వెళ్లుతున్నారని కిరా చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణతపై ఇప్పటివరకూ తమకు ఉన్న అనుమానాలు నిజమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షులు పుతిన్‌కు వెనువెంటనే నావల్నీ మరణవార్తను అధికారులు చేరవేశారని నిర్ధారణ అయిందని రష్యా వార్తాసంస్థలు తెలిపాయి. నావల్నీ పూర్తి పేరు అలెక్సీ అనటోలివిచ్ నావల్నీ. న్యాయవాదిగా, అవినీతి వ్యతిరేక, హక్కుల ఉద్యమకర్తగా ఆయనకు పేరుంది. ఈ ఏడాదే రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న దశలో నావల్నీ మృతి కీలక పరిణామం అయింది.

పుతిన్ అవినీతిపై ఉద్యమం ..వేలాదిగా అభిమానులు
జీవితం అంతా ప్రతిఘటనే .. ఆయన పేరిటనే సినిమా
రాజకీయ నేతలను, ప్రత్యేకించి విమర్శకులను సహించని నేతగా పేరొందిన పుతిన్‌కు వ్యతిరేకంగా రష్యాలో నావల్నీ బలీయమైన ఉద్యమాన్ని ఓ దశలో తీసుకురాగలిగారు. స్వచ్చమైన అవినీతిరహిత పాలన ఉద్ధేశాలతో రష్యా ఆఫ్‌ది ఫ్యూచర్ (రాఫ్) పార్టీ పెట్టారు. పుతిన్ అవినీతి, నిరంకుశవాదానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయన తన స్పందనలు, ప్రసంగాలతో బలీయమైన ప్రతిపక్ష శక్తిగా ఎదిగారు. ఆయన పిలుపు ఇవ్వకుండానే కేవలం ఆయన యూట్యూబ్ పోస్టింగ్‌లతోనే చలించి లక్షలాది రష్యన్లు పుతిన్‌కు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చారు. దేశంలో ఉన్న కరకు చట్టాలు, ప్రత్యేకించి అధికార వ్యతిరేక సభలు, నిరసనలపై ఆంక్షలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా జనం నావల్నీ ఆలోచనలకు మద్దతుగా తరలివచ్చారు. సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై అంతుపట్టని రీతిలో విషప్రయోగం జరిగింది. దీనితో ఆయన జర్మనీకి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. జర్మనీ నుంచి రష్యాకు రాగానే 2021లో ఆయనను రష్యా అధికారులు జైలుకు పంపించారు.

జైలులో ఓసారి విషప్రయోగం కూడా జరిగింది. క్రమేపీ కోలుకున్నారు. పలు కేసులు పెట్టడం విచారణల తరువాత జైలులో ఉన్నప్పుడే ఆయనకు 19 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఇదంతా ఏకపక్షంగా జరిగిన విచారణ, రాజకీయ తీవ్రస్థాయి వేధింపు చర్య అని పశ్చిమ దేశాలు, స్వతంత్ర హక్కుల సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. ఆయనకు సుదీర్ఘ జైలుశిక్షను ఖండించాయి. గత ఏడాదే ఆయనను మారుమూల ప్రాంతంలోని ప్రిజన్‌కు తరలించారు. ఉత్తర సైబీరియాలోని యమాలో నెనెట్స్ ప్రాంతంలో ఈ జైలు ఉంది. వాలంటైన్స్ డే నాడు నావల్నీ తన భార్య యూలియా నవయినయకు టెలీగ్రామ్ ఛానల్ ద్వారా పంపించిన సందేశమే ఆయన చివరి స్పందన అయింది. జీవితాంతం రుణపడి ఉంటానని ఆమెకు ఆయన ఇందులో తెలియచేసుకున్నారు. నావెల్నీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని కెనడా దర్శకుడు డేనియల్ రో హెర్ నావల్నీ పేరుతోనే ఓ డాక్యుమెంటరీ సినిమా తీశారు. గత ఏడాది ఈ డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫిచర్‌ఫిల్మ్ ఆస్కార్ అవార్డు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News