Sunday, April 28, 2024

రైతులపై పేలిన బాష్పవాయు గోళాలు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు అడుగులు వేస్తున్న రైతులపై హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల వద్ద శుక్రవారం హర్యానా పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. సంయుక్త కిసాన్ మోర్చ(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చ ఇచ్చిన పిలుపు మేరకు ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టిన వేలాది మంది రైతులు పంజాబ్ నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో ఢిల్లీకి బయల్దేరగా వారి యాత్ర శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోకి రైతుల యాత్ర ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ శివార్లతోపాటు హర్యానా శివార్లలో ప్రభుత్వం అడ్డంకులను ఏర్పరిచింది. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) హామీకి చట్టబద్ధత కల్పించడంతోపాటు ఇతర డిమాండ్ల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు నిరసన బాట పట్టారు. కాగా..రైతు ప్రతినిధి బృందాలతో కేంద్ర మంత్రులు గురువారం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో తిరిగి ఫిబ్రవరి 18న(ఆదివారం) సమావేశం కావాలని వారు నిర్ణయించుకున్నారు.

ఫిబ్రవరి 8, 12, 15వ తేదీలలో మూడుసార్లు జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. గత మంగళవారం పంజాబ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన వేలాది మంది రైతులను పంజాబ్-హర్యానా శివార్లలోని శంభూ, కనౌరీ పాయింట్ల వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఈ రెండు పాయింట్ల వద్దనే నిరసనకారులు బసచేసి ముందుకు కదిలేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా, శంభూ సరిహద్దు వద్ద గత మూడు రోజులుగా నిలబడి పోయి ఆందోళన సాగిస్తున్న జ్ఞాన్ సింగ్ అనే 63 సంవత్సరాల పంజాబ్ రైతు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. ఇలా ఉండగా..రైతుల డిమాండ్లలో ఎంసిపికి చట్టబద్ధతతోపాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణ మాఫీ, విద్యుత్ చార్జీల పెంపు ఉండరాదు, రైతులపై గతంలో పెట్టిన పోలీసు కేసుల ఉపసంహఱణ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు పరిహారం, 2013 నాటి భూ సేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం వంటివి ఉన్నాయి.

గురువారం జరిగిన చర్చలలో కేంద్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా చర్చలలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ ముండా విలేకరులతో మాట్లాడుతూ మరోసారి చర్చలల్లో కూర్చుని ఒక పరిష్కారం కనుగొంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News