Saturday, April 27, 2024

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

 బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు
 టార్గెటుపై విశ్వాసాలు
 మన్సుఖ్ ముందు కరోనా సవాలు
 రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కేంద్ర కేబినెట్ భారీ పునర్వస్థీకరణ జరిగింది. విస్మయకర రీతిలో సీనియర్లకు ఉద్వాసన జరిగింది. సహాయ మంత్రులు కొందరికి పదోన్నతి కల్పించారు. యుపి, గుజరాత్ రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. గురువారం బాధ్యతలు చేపట్టిన వారిలో కొత్త ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయ, రైల్వే, ఐటి మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇంధన మంత్రి ఆర్‌కె సింగ్,సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఉన్నారు. ఇప్పుడు దేశంలో కరోనా నివారణ చర్యలు, థర్డ్‌వేవ్‌పై నిశిత జాగ్రత సమీక్షలు, రోజువారి నివేదికలు అత్యవసరం. ఈ దిశలో పూర్తిస్థాయిలో వెనువెంటనే ఆరోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతల్లోకి మాండవీయా గురువారం దిగారు. మాస్క్ ధరించి ఆయన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖల కార్యాలయాల్లో అడుగుపెట్టగానే అక్కడున్న సిబ్బంది ఆయనకు అభివాదాలు చేసింది.

ఆయన మరో కీలకమైన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు. తనపై ప్రధాని అపారమైన బాధ్యతలుపెట్టారని, ఇందుకు అనుగుణంగా వ్యవహరించి, ప్రధాని తనపై పెట్టుకున్న అంచనాలను నెరవేరుస్తానని మాండవీయ తెలిపారు. గతవారంలోనే ఆయన మూడు కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల కార్యాలయాలను సందర్శించారు. పుణేలోని సీరం ఇనిస్టూట్, జైడస్, అహ్మదాబాద్‌లోని భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తయారీ కేంద్రంలో పనితీరును పరిశీలించారు. ఆరోగ్య సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ కూడా ఈరోజే బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఆరోగ్య చికిత్సా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేయడం తమ ముందున్న కీలకమైన అంశం అని తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో వైద్య చికిత్స ఏర్పాట్లు మరింతగా అందుబాటులోకి తీసుకువస్తామని, అంతా సంతోషిస్తారని తాను భావిస్తున్నట్లు ప్రకటించారు.
అటు ఐటి ఇటు రైల్వేల వైష్ణవ్
ఇప్పటి మంత్రివర్గ విస్తరణలో రెండు కీలక బాధ్యతలు తీసుకున్న అశ్విని వైష్ణవ్ రైలుభవన్‌లోని తమ కార్యాలయంలో ఆసీనులు అయ్యారు. రైల్వేల ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొద్ది సేపు సమీక్ష జరిపారు. తనకు గురుతరమైన బాధ్యతను అప్పగించిన ప్రధాని మోడీకి తాను మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. వైష్ణవ్ సహాయ మంత్రులు దర్శన విక్రమ్ జర్డోస్, దాన్వే రావ్‌సాహెబ్ దాదారావు కూడా బాధ్యతలు స్వీకరించేందుకు కార్యాలయాలకు వచ్చారు. భారతీయ రైల్వేలు ప్రధాని మోడీ విజన్‌లో ప్రధాన భాగం. ప్రజల జీవనస్థితిగతులల్లో పరిణామాత్మక మార్పుల దిశలో రైల్వే సాధనం కావాలని ప్రధాని ఆశిస్తున్నారని కొత్త రైల్వే మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాన్యుడు రైతులు, పేదలకు రైల్వే మరింతగా అందుబాటులోకి వచ్చి, దీని ద్వారామరింత ప్రయోజనం పొందాలని ఈ దిశలో తాను ముందకు సాగుతానని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ఐటి మంత్రిగా బాధ్యతలను కూడా ఆయన ఇదేరోజు స్వీకరించారు. సీనియర్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్థానంలో ఆయన దీనిని చేపట్టారు.
విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షీ
ఢిల్లీ పార్లమెంట్ సభ్యురాలు అయిన మీనాక్షీ లేఖి గురువారం విదేశాంగ శాఖ, సాంస్కృతిక సహాయ మంత్రిత్వశాఖ బాధ్యతలను గురువారం చేపట్టారు. మహిళకు ప్రధాని మోడీ కీలక బాధ్యతలు అప్పగించారని, సాధికారికత కేవలం నినాదం కాదు, ఇది ఆచరణీయం అని ప్రధాని తమ చేతలతో తేల్చిచెప్పారని తెలిపారు. మత్స, పశుసంవర్థక, పాడిపరిశ్రమల మంత్రి పురుషోత్తమ్ రూపాలా, ఉక్కు మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్, ఇంతకు ముందు పెట్రోలియం మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇప్పటివరకూ పౌర విమానయాన మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పురీ ఇప్పుడు పెట్రోలియం, సహజవాయువుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

New Ministers takes charge after Cabinet Reshuffle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News