Friday, May 3, 2024

‘టార్గెట్’ 2024

- Advertisement -
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం

అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చాం లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్‌తో
కలిసి పనిచేస్తాం మా పార్టీని గెలిపిస్తే దేశానికి తెలంగాణ మోడల్ అభివృద్ధిని చూపిస్తాం
పదవుల కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదు దేశ పరిస్థితులు చక్కదిద్దేందుకే
ఈ ప్రయత్నం రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడోయాత్ర చేయాలి తెలంగాణలో ఆయన పాదయాత్ర
చేసే సమయానికి పార్టీని వీడనున్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపిలు 2024 నాటికి కాంగ్రెస్ ఖేల్‌ఖతం
దేశంలో 10వేల మంది ఫోన్లను ట్యాప్ కేంద్రం కిషన్‌రెడ్డి ఫోన్‌నూ వదలని మోడీ
కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిన కోమటిరెడ్డి మునుగోడులో రూ.500 కోట్లు ఖర్చు పెడతానని
అమిత్ షాకు హామీ మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నరేంద్రమోడీ ప్రధాన మంత్రి కాదని.. కేవలం ప్రచార మంత్రి అని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌ను చూపి అధికారంలోకి వచ్చి ఏం సాధించారని ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇలాంటి అసమర్థ ప్ర ధానిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. 2022 వరకు దేశంలో ఇళ్లులేని అందరికి ఇళ్లు ఇస్తా అని, 435 కోట్లతో ప్రధాని ఇల్లు కట్టుకుంటున్నాడని ఆరోపించారు. మోడీ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. ఎ న్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని నెరవేర్చలేదన్నారు.వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే దేశానికి తెలంగాణ మోడల్ చూపిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

శుక్రవారం ప్రగతి భవన్‌లో కెటిఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎద్దేవా చేశారు. దేశంలో మోస్ట్ ఇన్‌కాంపీటింట్…. ఇన్ ఎఫిషియంట్….. ప్రచార మంత్రిగా నరేంద్రమోడీ ఎదిగారని దుయ్యబట్టారు. ఆయన అసమర్థ పాలన కారణంగా దేశంలో అసలు వికాస్ అన్నది ఎక్కడ కనిపించడంలేదన్నారు. అచ్చే దిన్ ఆయేంగే అంటూ కేవలం ఒక్క మనిషిని మాత్రమే దునియాలో మోడీ ధనవంతున్ని చేశారని విమర్శించారు. మోడీ ఒక దివాళాకోరు, పనికిరాని ప్రధాని అని ఘాటుగా విమర్శించారు. కనీసం మోడీ మీడియా సమావేశాన్ని పెట్టే ధైర్యం కూడా లేదన్నారు. ఆయన జన్‌కీ బాత్ వినడు…. మన్ కీ బాత్ మాత్రమే చెబుతాడన్నారు. ఆయనకు బిల్డప్ తప్ప మరోపనేం లేదని విమర్శించారు. ఈ దేశంలో అత్యధిక ద్రోవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలో అత్యధిక గ్యాస్ రేటు అడ్డు, అదుపు లేకుండా పోతోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజిరియా కంటే ఇండియా పూర్ కంట్రీగా అవుతోందని రిపోర్టులు తెలుపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. అన్ని రంగాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. అందుకే భారత్ రాష్ట్ర సమితి రూపంలో దేశంలో నెలకొనన సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంటు అందిస్తామన్నారు. దళితులను వ్యాపారవేత్తుల చేస్తామన్నారు.

కెసిఆర్‌కు స్పష్టత ఉంది

దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతపై కెసిఆర్ మంచి స్పష్టత ఉందని కెటిఆర్ అన్నారు. బిజెపి పేరుకు జాతీయ పార్టీ అయినా.. దాన్ని కేవలం గుజరాతీలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంతా ఫేక్ అని విమర్శించారు. తమకు అవకాశం వస్తే తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల ఉచితంగా కరెంటును దేశవ్యాప్తంగా విస్తరించవచ్చన్నారు. అది కేవలం సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు…. పండుగ అని అతి స్వల్ప కాలంలో నిరూపించిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ రైతు పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చన్నారు. రైతు వేదికలు, రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు.

ఈ పథకాలతో మన రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్ర రైతుల కంటే అధికంగా దాన్యం పండిస్తున్నారన్నారు. రైతు బంధు పథకంను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు కాపీ కొడుతూ అమలు పరస్తున్నారన్నారు. పోరాటి సాధించుకున్న తెలంగాణను అతి స్వల్ప కాలంలోనే కెసిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేసి…. ధనిక రాష్ట్రంగా మార్చారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వడం పెద్ద విషయమన్నారు. 75 సంవత్సరాలలో ఎవరూ చేయని పనులను కెసిఆర్ కేవలం ఎనిమిది ఏళ్ల కాలంలో చేసి చూపించారన్నారు. అలాగే తెలంగాణలో ఐదుదశాబ్దల పాటు అపరిష్కృతంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించదన్నారు.

పార్లమెంట్ ఎన్నికలో తమ టార్గెట్
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే తమ టార్గెట్ అని కెటిఆర్ అన్నారు. ఇందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్(భారత రాష్ట్ర సమితి)గా మార్చామన్నారు. ఇందుకు పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌కు అప్పుడే తెలంగాణ రాష్ట్రం చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించిందని..అలాగే తాము కూడా పుంజుకుంటామన్నారు 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలే తమ టార్గెట్ అని ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్ సభ ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు.

అధికారం కోసమో…పదవుల కోసమో కాదు
అధికారం కోసమో లేక పదవుల కోసమో సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని కెటిఆర్ తేల్చి చెప్పారు. దేశంలో ఉన్న పరిస్థితులను మార్చేందుకు నేషనల్ పాలిటిక్స్‌లోకి వెలుతున్నారని స్పష్టం చేశారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెలుతున్న నేపథ్యంలో మోడీ అండ్ కో నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా తమకు తెలుసన్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తాము చెప్పడం లేదని….క్రమేపి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ వెల్లడించారు. 8నెలల నుంచి కెసిఆర్ దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, ఆర్థిక వేత్తలతో మాట్లాడి జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగు నీరు, దళిత బంధు తదితర కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కు మద్దతు పెరుగుతోందని కెటిఆర్ స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోందన్నారు. ఈ మాట భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పిందన్నారు. అలాగే నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో చెప్పిందని కెటిఆర్ గుర్తు చేశారు.

రాహుల్ కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తే మంచిది
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై కెటిఆర్ సెటైర్లు వేశారు. ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా…..కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముక్కలవుతుందన్నారు. దీని కారణంగా ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. ఆ పార్టీ కేవలం అస్తిత్వం కోసమే పోరాటం చేస్తోందన్నారు. అందువల్ల కాంగ్రెస్ ఈ దేశానికి గుదిబండగా మారిందన్నారు. ఆ పార్టీ 2024 తర్వాత కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలోనే అట్టర్ ప్లాప్ పార్టీగా కాంగ్రెస్ మారిందన్నారు. రాహుల్ పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీకి చెందిన గోవా ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్ని రోజులైనా రాహుల్ పాదయాత్ర యాత్ర చేసుకోవచ్చునని అన్నారు. ఆ పాదయాత్ర వల్ల్ల తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాహుల్‌కు తెలుస్తాయన్నారు. రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేసే సమయంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిలు కాంగ్రెస్‌ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.

దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ఉపయోగించుకుంటున్నారు

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ, ఐటి సంస్థలను మోడీ ప్రభుత్వం వేట కుక్కల్లా ఉపయోగించుకుంటోందని కెటిఆర్ ఆరోపించారు.తమపైనా ఇడి దాడులు చేయించి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తిని పూర్తిగా దెబ్బతీస్తోందని కెటిఆర్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తే…. ఎలాంటి సంబంధం లేని కేంద్రం లిబరేషన్ డే వేడుకలను నిర్వహించిందని మండిపడ్డారు. మరి ఆగష్టు 15 ఎందుకు లిబరేషన్ డే కాదని ప్రశ్నించారు. బ్రిటీష్ వాళ్లు చేసిన అరాచకాలను ఎర్రకోట మీది నుంచి మోడీ ఎందుకు ప్రశ్నించరన్నారు. రాజకీయ భావదారిద్రం కోసం ఆడే చిల్లర నాటకమని మండిపడ్డారు.దేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. హిందూ, ముస్లింల పొలరైజజేషన్ అని చిల్లర మాటలు మాట్లాడుతున్న మోహన్ భగవత్‌ను నమ్మవద్దన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌కు మద్దతు
మహారాష్ట్ర, కర్నాటకలో తమకు సానుకూల అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కెటిఆర్ వెల్లడించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్దతు వ్యక్తమవుతోందన్నారు. ముఖ్యంగా తెలంగాణ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు. కర్నాటకలో జెడిఎస్ పార్టీతో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కెసిఆర్‌ను అవహేళన చేసిన వాళ్లంతా చీకట్లో కలిసిపోయారన్నారు. ఇప్పుడు కూడా బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కెసిఆర్‌పై అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టారన్నారు. వీటికి వెనకంజు వేసే నైజం కెసిఆర్‌ది కాదన్నారు. ఆయనకు ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక ఎంతో కసరత్తు దాగి ఉంటుందన్నారు.

డబ్బుల కోసమే రాజ్‌గోపాల్ బిజెపిలో చేరారు

కేవలం కాంట్రాక్టులు….డబ్బుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో మంత్రి కెటిఆర్ విమర్శించారు. దీనిపై తనకు పక్క సమాచారం ఉందన్నారు. ఆయన బిజెపిలో చేరినందుకు రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ కేంద్రం ఇచ్చిందన్నారు.
పైసల కోసమే రాజగోపాల్ తన పదవిని పణంగా పెట్టి బిజెపిలో చేరారని విమర్శించారు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వచ్చిన సందర్భంగా ఆయనను కలిసిన ఒక పెద్దమనిషి తనను కూడా కలిశారన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో రూ. 500 కోట్లు ఖర్చు పెడతానని అమిత్‌షా చెప్పినట్లుగా పేర్కొన్నారు. అందుకే ఓటుకు రూ. 30వేలు ఇచ్చి అయిన గెలుస్తా అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడన్నారు. కాంట్రాక్టర్ బలుపుకు మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

మునుగోడులో కారుదే విజయం

మునుగోడులో కారుదే విజయమని కెటిఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్‌ఎస్ భారీ మెజర్టీతో గెలుస్తోంద ధీమా వ్యక్తం చేశారు. పైసల కోసమే రాజగోపాల్ పదవిని పణంగా పెట్టి బిజెపిలోకి వెళ్లాడన్నారు. అందుకే ఓటర్లను ఆకర్శించడానికి బిజెపి పార్టీ అభ్యర్ధిగా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి ఎంత ఖర్చు చేసినా గెలిచేది మాత్రం మూమ్మాటికి కారేనని అన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. అనేక సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉంటున్నట్లు చెబుతున్నాయన్నారు. ఇక రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, బిజెపిల మధ్య గట్టి పోటి ఉంటుందన్నారు.

ఫోన్ ట్యాపింగ్

దేశంలో 10వేల మంది మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కెటిఆర్ తెలిపారు. చివరకు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా అందులో ఉందని చెప్పారు. అయినప్పటికీ ఆయన సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇడి, సిబిఐ, ఐటి సంస్థల దాడులు కేవలం బిజెపియేతర నాయకులుపైనే ఉంటాయా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇక దేశంలో ఉన్న బిజెపి నేతలంతా సత్యాహరిచంద్రులేనా? నిలదీశారు. ప్రత్యర్ధి పార్టీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లపై అప్పట్లో కేసులు తోడిన మోడీ ప్రభుత్వం….వారిద్దరు బిజెపిలో చేరగానే ఉన్న కేసులు ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News