Sunday, April 28, 2024

రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ విడుదల చేయాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్ వారి సమస్యలకు పరిష్కారం చూపాలని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం సిఎం కెసిఆర్‌కు లేఖలో పేర్కొంటూ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులతోపాటు పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవాలని కోరారు. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదని, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్ ను ఇవ్వకపోవడం బాధకరమన్నారు.

గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదని వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయని, ఆసుపత్రులకు, మెడిసిన్, పౌష్టికాహారం కోసం డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయి ఇది తెలిసి కూడా వారికి పెన్షన్ సకాలంలో చెల్లించకపోవడం సరికాదన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైందని, నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది మంది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ నెలాఖరుతో మొదటి పీఆర్సీ గడువు ముగియబోతోందని, వచ్చే నెల నుండి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి,  కానీ ఇప్పటి వరకు కమిషన్ నియమించకపోవడంతో ఉద్యోగులను, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రమన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్ విడుదల చేయాలని వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News