Friday, May 3, 2024

గ్యారంటీలేని పార్టీ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్మరు : తెలంగాణ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తే.. సచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చేది అన్నట్టుగానే ఉందంటూ రెడ్కో ఛైర్మన్ వై . సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాళ్లు గెలిచేది లేదు.. మనం చూసేది లేదు, కానీ ప్రజల దృష్టిని మరల్చాలన్న ఏకైక లక్ష్యంతో ఇచ్చినట్టుగా స్పష్టమైందన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు.. ఆ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరనేది గ్యారంటీ లేదు, ఎవరినైనా సిఎం అభ్యర్థిగా ప్రకటించినా అతను ఐదేళ్ల పాటు ఉంటాడన్న గ్యారంటీ లేదు, అసలు ఢిల్లీ నాయకులొచ్చి ఇక్కడ సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా నాయకులు ఒప్పుకుంటారన్న గ్యారంటీ కూడా లేదు, ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేది ఎవరనేది కూడా గ్యారంటీ లేదు. ఎలాంటి గ్యారంటీ లేకుండా.. గాలికి ఇచ్చే గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.అసలు మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు?  మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. బూటకపు గ్యారంటీలతో మరోసారి తెలంగాణ ప్రజల గొంతు కోయాలని చూస్తే చూస్తూ ఊరుకోవడానికి అమాయకులం కాదని, కొద్దిరోజుల క్రితం కర్నాటకలో ఇలాంటి హామీలే ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.అధికారంలోకి వచ్చి నెల తిరగకముందే కరెంటు చార్జీలు పెంచి ప్రజల ఉసురుపోసుకుని,  మరోవైపు కరెంటు కోతలతో అన్ని వర్గాలను దెబ్బతీశారన్నారు.

అలవిగాని హామీలిచ్చి డబ్బుల్లేక.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన సంగతి దేశమంతా చూసిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అంటున్నారు కానీ మీరు గ్యారంటీల పేరుతో చెప్పిన పథకాలన్నీ కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వ మానసపుత్రికలే అన్నారు.

50 ఏళ్లు దేశాన్ని పాలించి కనీసం మీరు ఆలోచన కూడా చేయని పథకాలను మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సక్సెస్ ఫుల్ గా అమలు చేసి చూపించారు.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మీ పార్టీ నాయకులు చేసిన స్కాం తెలంగాణ ప్రజలందరికి తెలుసు. ఇండ్లు కట్టకుండానే పైసలు మింగిన దగాకోరులు మీరు, కానీ కేసీఆర్ నాయకత్వంలో మా బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పారదర్శంగా నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్నదన్నారు.మీ పాలనలో విద్యను కార్పొరేటు గుప్పిట్లోకి తోసేస్తే.. మా ప్రభుత్వం… ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి పేదింటి బిడ్డలకు కార్పొరేటుస్థాయి విద్యను ఉచితంగా అందిస్తోందని గుర్తు చేశారు. రైతులకు తమ భూమిపై హక్కు లేకుండా చేస్తే.. ధరణితో రైతుకు భరోసానిచ్చింది మా ప్రభుత్వమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అవివేకాన్ని చూసి ఏమనాలో అర్థం కావడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి అన్నట్టు రాహుల్ గాంధీ నిజంగానే ముద్దపప్పులాగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News