Sunday, April 28, 2024

జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి

- Advertisement -
- Advertisement -

DGP Mahender reddy

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు అందజేయాలని కోరారు. ప్రధాని మోడి పిలుపుపై సోషల్ మీడియాలో వ్యంగంగా పోస్టులు పెట్టన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్‌పిలకు, సిపిలకు ఆదేశాలిచ్చామన్నారు. ఆదివారం నాడు 24గంటల జనతా కర్ఫ్యూకుకి ప్రతి ఒక్కరూ తమ వంత సహకరించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని, జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్ ను జయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవలు అందించేందుకు సంసిద్ధులై ఉండాలని డిజిపి స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జనతా కర్ఫ్యూ జాగ్రత్తలు ః
రాష్ట్రంలో జనతా కర్ఫూ సమర్ధవంతంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం అన్ని జిల్లాల ఎస్‌పిలకు వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లా, మండల, గ్రామీణ ప్రాంతాలలో జనం గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు, వేడుకలకు అనుమతివ్వొద్దని డిజిపి నిర్ణయం తీసుకున్నారు.

విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా సారించాలని, కరోనా అనుమానితులున్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. కరోనాపై అసత్య ప్రచారాలు చేయకుండా తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, ఆంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని జిల్లా ఎస్‌పిలకు డిజిపి సూచించారు. ముఖ్యంగా మండల, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రార్థనా మందిరాల పూజలకు , సమావేశాలు, వివాహాలు అనుమతిలేకుండా నిర్వహించరాదని, అనుమతి లేకుండా నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

People should support the Janata curfew
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News