Sunday, May 5, 2024

తగ్గిన కాలుష్యం..

- Advertisement -
- Advertisement -

Pollution

 

హైదరాబాద్ : హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది, మాస్కులు లేనిదే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని కరోనా రాకముందు ప్రజల పరిస్థితి ఇదీ. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. వాహనాల సంఖ్య తగ్గిపోయింది. వారంరోజులుగా ప్రభుత్వం సూళ్లతో పాటు పలు సంస్థలకు సెలవులను ప్రకటించిన నేపథ్యంలో కాలుష్యం చాలావరకు తగ్గిపోయిందని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఐటి నిపుణులు సైతం తమ ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తుండడంతో కాలుష్యం తగ్గిందని పిసిబి అధికారులు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధ్యయనం ప్రకారం 50 శాతానికి పైగా కాలుష్యం కేవలం వాహనాల నుంచే వస్తుందని తమ గణాంకాల్లో పేర్కొంది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో వాహనాల రద్దీ రోడ్లపై తగ్గడంతో నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్దకాలుష్య తీవ్రత చాలా తగ్గిపోయిందని పిసిబి సంస్థ పేర్కొంటుంది. నగరంలోని మూడు కాలుష్య నమోదు కేంద్రాల్లో నమోదైన గణాంకాలను బట్టి గ్రేటర్‌లో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గినట్లుగా తమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సనత్‌నగర్, బహదూర్‌పుర, పాశమైలారం ప్రాంతాల్లో వాయు కాలుష్య గణాంకాలను పిసిబి నమోదు చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల సంఖ్య తగ్గడంతో అక్కడ కూడా కాలుష్యం తగ్గుముఖం పట్టిందని పిసిబి పేర్కొంది.

ఏక్యూఐ సూచీలో 74 స్కోర్
ఈ మూడు కేంద్రాల్లోని కాలుష్యం ఆధారంగా ఏక్యూఐ సూచీలో 74 స్కోర్ నమోదు కాగా మిగతా నగరాల్లో వందకు మించి నమోదయ్యిందని, హైదరాబాద్‌లో 75 దాటకపోవడం విశేషమని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. నగరవాసుల్లో చాలా మంది బయటికొచ్చే సాహసం చేయకపోవడం, ఇక విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు సైతం రోడెక్కకపోవడంతో కాలుష్య తీవ్రతలు తగ్గినట్లుగా పిసిబి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పిసిబి పరిశీలించిన మూడు స్టేషన్లలో నమోదైన కాలుష్య తీవ్రతల్లో గణనీయంగా మార్పులు కనిపించాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయువుల నాణ్యత సాధారణ స్థాయిలో ఉండటం, మిగతా నగరాల్లో తీవ్రత అత్యధికంగా ఉందని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు.

ఎప్పటికప్పుడు కాలుష్య తీవ్రతపై సరైన అంచనాతో…
ప్రస్తుతం మన దగ్గర పిఎం 10 పెరుగుదలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రత్యేక అధ్యయనం చేయాలని గతంలో నిర్ణయించారు. పీల్చే గాలి స్వచ్ఛమైనదా, ఏయే ప్రాంతంలో కాలుష్య తీవ్రత ఎలా ఉంది, ఉద్గారాలు నిర్ధేశిత పరిమితుల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయా లేదా అన్న విషయాలపై పిసిబి తన అధ్యయనంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కాలుష్య సమాచారాన్ని పిసిబి పక్కాగా తెలుసుకుంటోంది. ప్రస్తుతం నగరంలో 4 చోట్ల అత్యాధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తెరలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వీటికి కాలుష్య నమోదు కేంద్రాలను అనుసంధానించడంతో ఎప్పటికప్పుడు కాలుష్య తీవ్రతను పిసిబి లెక్కించగలుగుతుంది.

కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కకుండా నియంత్రణ
చాలా ప్రాంతాల్లో మోతాదుకు మించే ఎయిర్ పొల్యూషన్ నమోదవుతోందని కాలుష్య నియంత్రణ మండలి గతంలో పేర్కొంటి. గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకి రావటం వల్ల వాయు కాలుష్యం మరింత పెరుగుతోందని పిసిబి అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కరోనా ఎఫెక్ట్ అనంతరం వాహన కాలుష్యాన్ని అరికట్టాలని, కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియత్రించాలని పిసిబి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

ఏప్రిల్ 1 నుంచి కాలుష్య నియంత్రణపై పిసిబి అధికారుల కసరత్తు
ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను రద్దు చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న బిఎస్ 2, 3 వాహనాల వలన 7.5 రెట్ల మేర ఎక్కువ పొగను వెదజల్లుతున్నాయని వాటి స్థానంలో బిఎస్ 4 వాహనాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయాలని గతంలో కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని షోరూమ్‌ల యజమానులు బిఎస్ 4 వాహనాలను 2019 సెప్టెంబర్‌లోనే అమ్మివేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి బిఎస్ 6 ఇంధనం సైతం అందుబాటులోకి రానుండడంతో నగరంలో కాలుష్య తీవ్రత ఎంత తగ్గుతుందన్న దానిపై పిసిబి అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

PCB officials said Pollution had reduced
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News