Friday, April 26, 2024

పౌర విధులు!

- Advertisement -
- Advertisement -

Plea In Supreme Court To Enforce Fundamental Duties

పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులను నిర్వచిస్తూ సమగ్ర చట్టాలు తీసుకు వచ్చేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకున్నది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. వాక్ స్వాతంత్య్రం ముసుగులో ఆందోళనకారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని , ప్రభుత్వాల చేత బలవంతంగా తమ డిమాండ్లను అంగీకరింపచేసుకోడానికి అడ్డదారులు తొక్కుతున్నారని పిటిషనర్ దుర్గాదత్ పేర్కొన్నారు. మూక బలంతో రోడ్లను, రైలు మార్గాలను మూసివేసి పౌరులకు చెప్పనలవికాని అసౌకర్యం కలిగిస్తున్నారని అభిప్రాయపడిన పిటిషనర్ ఈ నేపథ్యంలో పౌరులకు హక్కులతో పాటు, విధులు కూడా వుండి తీరాలని వాదిస్తున్నారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక విధులుండేవని , చైనా ఇంత బలమైన స్థితికి, అగ్రరాజ్య స్థాయికి చేరుకోడానికి కూడా పౌర విధులు దోహదపడ్డాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దూరం నుంచి గమనించేవారికి ఈ వాదన సమంజసంగా, సమున్నతమైనదిగా అనిపిస్తుంది.

వివిధ సమస్యల మీద వీధుల్లోకి వచ్చే వారు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని, అరాచకం సృష్టిస్తున్నారని భావించేవారు పెద్ద సంఖ్యలోనే వుంటారు. కాని లోతులకు వెళ్లి చూస్తే తన ప్రజలందరికీ సమగ్రమైన జీవన హక్కును, సమానమైన అవకాశాలను కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు ప్రాథమిక విధులను ఎలా వారిపై రుద్దగలుగుతాయి, వాటికా హక్కు ఏ విధంగా సంక్రమిస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సరైన సమాధానం వుండదు. 2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై నిరసన ప్రదర్శనలు చేసిన వారి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది కూడా పౌరులకు వారి విధి బాధ్యతలను గుర్తు చేయడానికి ఉద్దేశించిన చర్యే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కట్టబెట్టాలని తీసుకు వచ్చిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. మన దేశ రాజ్యాంగం హామీ ఇస్తున్న సమానత్వ హక్కుకు విరుద్ధంగా ఒక మతం వారి పట్ల వివక్ష చూపించిన ఈ చట్టంపై ప్రజాస్వామ్యప్రియులు నిరసన తెలియజేశారు.

అందులో భాగంగా దేశ వ్యాప్తంగానూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ఉద్రిక్త ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో షహిన్‌బాగ్ మహిళల ఉద్యమం చరిత్ర సృష్టించింది. పలు విశ్వ విద్యాలయాల్లో విద్యార్థి నిరసనకారులపై పోలీసు దమనకాండ తెలిసిందే. అందులో ఆస్తి నష్టం కూడా జరిగింది. యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిరసనకారుల ఆస్తులు జప్తు చేయాలని నిర్ణయించింది. ఇది హద్దు మీరిన నిర్ణయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో వెనుకడుగు వేసింది. ఇప్పుడు పౌరులకు హక్కులతో పాటు, ప్రాథమిక విధులు కూడా వుండాలని కోరుతూ సుప్రీంకోర్టుకెక్కిన వారి ఉద్దేశం కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీరునే తలపిస్తున్నది. ఈ విధుల్లో ప్రజలు తమ వీధులను తామే ఊడ్చుకోవాలని, పారిశుద్ధాన్ని కాపాడుకోవాలని వగైరావి కూడా చేరవచ్చు. ప్రభుత్వానికి వీసమెత్తు అసౌకర్యం కల్పించే ప్రజాప్రతిఘటననైనా బలప్రయోగంతో అణచివేయడానికి అదనపు ఆయుధాలుగా పౌర విధులు దానికి ఉపయోగపడే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తున్నది.

ప్రధాని నరేంద్ర మోడీ 2019లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ దేశంలో ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యమిచ్చే ధోరణి బదులుగా ప్రాథమిక విధులను పౌరులు తలదాల్చే పరిస్థితి రావాలని అన్నారు. అంటే ప్రభుత్వాలు ప్రజలను ఎన్ని ఇబ్బందులపాలు చేస్తున్నప్పటికీ పౌరులు పల్లెత్తు మాటనకుండా తలవంచుకొని దేశసేవ చేస్తూ పోవాలన్నమాట. ఇందులో నిరంకుశ ధోరణి స్పష్టంగా కనిపించడం లేదా? ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ కూడా ప్రజలకు హక్కుల పట్ల కంటే విధుల పట్ల స్పృహ వుండాలని కోరుకున్నారు. రాజ్యాంగాన్ని సవరించి ప్రాథమిక విధులను చేర్చారు.

నిత్యం ఎమర్జెన్సీని తీవ్రమైన పదజాలంతో విమర్శించే ప్రధాని మోడీ తాను కూడా ఇందిరా గాంధీ మాదిరిగానే ప్రాథమిక విధుల పట్ల మక్కువ చూపించడం గమనించవలసిన విషయం. రూపాలు వేరైనా నిరంకుశత్వ లక్షణం ఒకే విధంగా వుంటుందనడానికి ఇదొక నిదర్శనం.జీవన హక్కును హామీ ఇస్తున్న రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 పరిధిని సుప్రీంకోర్టు విస్తరింపజేసింది. దానిని అనుల్లంఘనీయమైన, అనితర ప్రాధాన్యమైన ప్రాథమిక హక్కుగా తీర్చిదిద్దింది. పౌరుల పట్ల ప్రభుత్వాలకుండవలసిన బాధ్యతలను గురుతరం చేసింది. ప్రాథమిక విధులుండాలని కోరుకుంటున్నవారు దీనిని తల్లకిందులు చేసి ప్రజలను అణచివేయడం ద్వారా సాగించే నిరంకుశ పాలనను ఆశిస్తున్నారని భావించక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News