Friday, May 3, 2024

బీహార్‌లో ఒకేరోజు మోడీ, రాహుల్ సభలు

- Advertisement -
- Advertisement -
PM Modi and Rahul Gandhi to hold election rally
మరింత వేడెక్కనున్న ప్రచారం

పాట్నా/న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి శుక్రవారం (నేటి) నుంచి మరింత వేడెక్కనుంది. కరోనా దశలో ప్రపంచంలో జరుగుతున్న అతి విస్తృతస్థాయి ఎన్నికల ఘట్టంగా బీహార్ ఎన్నికల పర్వం నిలిచింది. శుక్రవారం నుంచి బిజెపిజెడియు కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, మరో వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు. దీనితో రాష్ట్రంలో ప్రచారసరళిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. బిజెపి బీహార్‌కు సంబంధించి గురువారమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలు తమతమ రాజకీయ కూటముల విజయం కోసం శుక్రవారం నుంచి ప్రచారాన్ని ఆరంభించనున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలపై ఎన్నికల సంఘం పలు ఆంక్షలు పెట్టింది. అయితే ఇప్పటివరకూ జరిగిన వివిధ పార్టీల ప్రచార సభలలో వీటిని పెద్దగా పట్టించుకోకపోవడం ఇసి కన్నెర్రకు దారితీసింది.

ప్రధాని మోడీ శుక్రవారం ఏకబిగిన మూడు సభలలో ప్రసంగిస్తారు. రొహతాస్ జిల్లాలోని డెహ్రీ ఆన్ సోనేలో, ప్రఖ్యాత గయ, ప్రాధాన్యతల భగల్పూరులలో తొలుత ప్రధాని ఎన్నికల ర్యాలీలు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ ఈ నెల 28న జరుగుతుంది. కేవలం వారం రోజుల వ్యవధి ఉండటంతో పార్టీ ప్రచార సరళి జోరందుకోనుంది. ఈ దశ పోలింగ్‌లో నిలిచిన ఎన్‌డిఎ అభ్యర్థుల విజయం కోసం ప్రధాని అభ్యర్థిస్తారు. ఈసారి ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ కీలక పరిణామాలు జరిగాయి. ఎల్‌జెపి నేత చిరాగ్ పాశ్వాన్ తాను బిజెపికి అనుకూలమనే ప్రకటిస్తూ జెడియు నేత నితీశ్‌కుమార్ వైఖరి బాగాలేదని పేర్కొంటూ విడిగా పోటీకి దిగారు. డెహ్రీ, భగల్పూర్ ఎన్నికల సభలలో ప్రధాని మోడీతో పాటు నితీశ్‌కుమార్ కూడా పాల్గొంటారు. ఈ విషయాన్ని గురువారం బిజెపి వర్గాలు తెలిపాయి. గయలో జెడియు నేత రాజీవ్ రంజన్ సింగ్ మోడీతో పాటు వేదికను పంచుకుంటారు. అక్కడ మాజీ సిఎం , హిందూస్థాన్ అవామ్ మోర్చా అధ్యక్షులు జితన్ రామ్ మాంజీ కూడా సభలో ప్రసంగిస్తారు. శుక్రవారం నాటి ఈ సభలు ఈ ఎన్నికల ప్రచార ఘట్టంలో అత్యంత కీలకమైనవిగా మారాయి.

హిసూవాలో రాహుల్ సభ

PM Modi and Rahul Gandhi to hold election rallyకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం హిసూవాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సింగ్ సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే అనిల్ సింగ్‌తో పోటీలో ఉన్నారు.ఇక్కడనే రాహుల్‌తో ఆర్జేడీ అధ్యక్షులు, రాష్ట్ర సిఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న యువనేత తేజస్వీ యాదవ్ కూడా తోడవుతారు. శుక్రవారం రాహుల్ నవాడాలోని హిసువాలో, భగల్పూరు జిల్లాలోని కహల్‌గావ్‌లో ప్రచారం చేపడుతారు. కహల్‌గావ్‌లో రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, జిల్లా స్థాయి నాయకులు పాలుపంచుకుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలనుతేలికగా తీసుకోకుండా బిజెపి ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి దిగింది. కేంద్ర మంత్రులు పలువురు ప్రచార బరిలోకి దూసుకువెళ్లుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారిమూడు దశలలో జరుగుతాయి. మొత్తం 243 మంది సభ్యుల అసెంబ్లీలో ఈ నెల 28న తొలిదశ, నవంబర్ 3న మలిదశ, నవంబర్ 7న తుదిదశ పోలింగ్ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన విడుదల అవుతాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News