Sunday, April 28, 2024

దేశం గర్వపడేలా చేశారు: ధోనీకి ప్రధాని సుదీర్ఘ లేఖ

- Advertisement -
- Advertisement -

దేశం గర్వపడేలా చేశారు
ధోనీకి ప్రధాని మోడీ ప్రశంస పూర్వక లేఖ

PM Modi Writes letter to MS Dhoni after Retired

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ లేఖ రాశారు. ప్రధాని తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..ట్విటర్‌లో ఓ లేఖను పోస్ట్ చేశారు. ధోనీ రిటైర్మెంట్ గురించి యావత్ దేశం చర్చించుకుందని, దీన్ని బట్టి దేశానికి మీరెంత విలువైన ఆస్తి అనే విషయం స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఈ నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన సేవలు ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటాయని ప్రధాని మోడీ తన లేఖలో తెలిపారు. భారత క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోనీ ఒకరని, ఆయన సేవలు చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలి పోతాయని ప్రశంసించారు. ఆగస్టు 15న మీ శైలిలో ఆటకు వీడ్కోలు ప్రకటించారు. మీ ట్రేడ్ మార్క్ నిస్సంకోచమైన శైలితో మీరు మొత్తం దేశానికి ఉద్వేగభరితమైన చర్చా కేంద్రంగా మారడానికి సరిపోయే ఓ చిన్న వీడియోను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ఆ వీడియో దేశమంతా మీ గురించి మాట్లాడుకునేలా చేసింది. 130 కోట్ల మంది భారతీయులు నిరాశ చెందారు కానీ మీరు భారత క్రికెట్‌కు చేసిన సేవలకు కృతజ్ఞతలు. గత 15 ఏళ్ల కాలంలో మీరు భారత క్రికెట్‌కు అందించిన సేవలు ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో మిగిలిపోవడం తథ్యం. క్రికెట్ కెరీర్ గురించి చర్చించడానికి మీ గణంకాలు చాలు. మీరు అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకరు. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో మీ పాత్ర అమోఘం. గొప్ప బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా, అత్యుత్తమ వికెట్ కీపర్‌గా మీ చరిత్రలో చిరకాలం నిలిచి పోతుందనడంలో సందేహం లేదని ప్రధాని పేర్కొన్నారు.

ఇక కష్ట సమయాల్లో మీరున్నారనే భరోసా, మ్యాచ్‌ను గెలిపిస్తారనే ధీమాను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. 2011 ప్రపంచకప్ సాధించిన ఘనత భారత చరిత్రలోనే ఒక తీపి జ్ఞాపకంగా ఎప్పటికీ అలాగే నిలిచి పోతుందన్నారు. ధోనీ అనే పేరు కేవలం గణంకాలకో లేక కొన్ని మ్యాచ్‌ల విజయాల వరకే పరిమతం కాదు. అది ఎప్పటికీ ప్రజల మదిలో ఓ మధుర క్షణాలుగా అలాగే ఉండిపోతుందని పేర్కొన్నారు. ఇక మిమ్నల్ని ఒక క్రీడాకారుడిగా చూడడం కూడా సరైంది కాదు. మిమ్మల్ని అంచనా వేయాలంటే మాటలు సరిపోవు. రాంచీ అనే చిన్న నగరం నుంచి వచ్చి దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అంతేగాక దేశాన్ని గర్వపడేలా చేశారు. మీరు కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందనే విషయం తెలిస్తే..మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అవసరం లేదు. ఇదే స్ఫూర్తి మీరు ఎంతో మంది యువతలో రిగిలించారు. నేటి యువతరం కష్టాలని చూసి జడిసిపోదు. తోటి వారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. అందుకు మీరు సాధించిన 2007 ట్వంటీ20 ప్రపంచకప్ ఓ చక్కటి ఉదాహరణ.

ఇక కష్ట సమయాల్లో మీరు జట్టును నడిపించిన తీరే వారికి ప్రేరణ అని ప్రధాని పేర్కొన్నారు. మీ కేశాలంకరణతో ఎలా కనిపించినా.. గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం ఎంతో మందికి ఒక పాఠంలా నిలుస్తుంది. మీరు భద్రతా దళాల్లో చేసిన సేవలు అద్భుతం. మన సైనికులతో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ల మంచి కోసం మీరు పడే తపన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇకపై మీరు భార్య సాక్షి, కూతురు జీవాతో ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ల త్యాగాలు, మద్దతు లేక పోతే ఏదీ సాధ్యమయ్యేది కాదు. ఒక మ్యాచ్‌లో విజయం సాధించాక జీవాతో ధోనీ ఆడుకోవడం చూశా. అది ఎప్పటికీ నాకు గుర్తుండి పోతుంది. అటు ప్రొఫెషనల్, ఇటు వ్యక్తిగత జీవితం రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంలోనూ యువత ధోనీని చూసి నేర్చుకోవచ్చు అని ప్రధాని నరేంద్ర మోడీ తన లేఖలో యువతరానికి సూచించారు. అంతేగాక ధోనీ భవిష్యత్తు బాగుండలని మోడీ ఆకాంక్షించారు.
ప్రధానికి మహి కృతజ్ఞతలు
ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖకు ధోనీ స్పందించాడు. ప్రధాని రాసిన లెటర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒక కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు ప్రశంసలను కోరుకుంటాడు. వారి కృషి, త్యాగం అందరిచేత గుర్తించబడి, ప్రశంసించబుతోంది. ప్రధాని మీ ప్రశంసలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని ధోనీ ట్వీట్ చేశాడు.

PM Modi Writes letter to MS Dhoni after Retired

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News