Saturday, April 27, 2024

భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ రాష్త్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమాక్కకు రాహుల్‌గాంధీ ఘనంగా సన్మానం చేస్తారని తెలిపారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిళ్లగూడెం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి మాట్లాడారు. ఏఐసిసి నిర్దేశించిన మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.

భట్టి చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకీ పాదయాత్ర ద్వారా తీసుకువెళ్లడంలో భట్టి విక్రమార్క సఫలీకృతమయ్యారని వెల్లడించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదని వివరించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాథ్ జోడో యాత్ర, ఏఐసిసి దిశానిర్దేశం ప్రకారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేశారని తెలిపారు. ఈ యాత్రలు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపధ్యంలో ఖమ్మంలో జులై 2న నిర్వహించే తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు,పాదయాత్ర ముగింపు నిర్వహణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి కోఆర్డినేషన చేస్తారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతారని తెలిపారు. భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత కొత్త కలయిక తోటి కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ కనిపిస్తుందని వివరించారు. కాంగ్రెస్‌కు రాష్త్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, పిసిసి ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News