Friday, May 3, 2024

ఖాజిపల్లి ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్..

- Advertisement -
- Advertisement -

Prabhas adopts Kazipally forest area

మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ హీరో ప్రభాస్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. తన సినిమాల వలే తన మనసు కూడా భారీ అని నిరూపించే నిర్ణయం తీసుకున్నారు. 1650 ఎకరాల అర్భన్ రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్భన్ ఫారెస్ట్ పార్కు, ఎకో టూరిజం కేంద్రం అందుబాటులోకి రానుంది. సోమవారం స్వయంగా ఖాజిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన ప్రభాస్, దత్తత తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అనంతరం అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి పార్కులో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్భన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ప్రభాస్ ఆరా తీశారు. జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటడంతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాచ్ టవర్‌పై నుంచి అటవీ అందాలను వీక్షించారు.

అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో, పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా ఈ రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పేరిట అభివద్ధి చేయనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రభాస్ వెల్లడించారు. ముందస్తుగా రూ. 2 కోట్ల చెక్కును ప్రభుత్వానికి అందించారు. మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, దుండిగల్ మధ్య ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతం అంతా ఔటర్ రింగు రోడ్డు పక్కనే విస్తరించి ఉంది. చుట్టు పక్కల అభివృద్ధ్ది చెందిన నివాస కాలనీలు, పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని అర్భన్ పార్కుగా అందుబాటులోకి తేవటంతో పాటు, మిగతా ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం వివిధ రకాల ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. మూడు కంపార్ట్‌మెంట్లలో విస్తరించి ఉన్న 1650 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మొత్తం ఖచ్చితమైన సరిహద్దుల ఏర్పాటుతో అటవీ శాఖ కాపాడనుంది. పరిసర ప్రాంతవాసులకు అందమైన పార్కు అందుబాటులోకి వచ్చేలా తక్షణం ఈ పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో పార్క్‌లో గేట్ సి థ్రూ వాల్, వాకింగ్ ట్రాక్, వ్యూ పాయింట్, గజేబో, ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. అదేవిధంగా అటవీ స్థలం ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా తగిన రక్షణ చర్యలను కూడా తీసుకోనున్నారు. దుండిగల్, గడ్డపోతారం, గుండ్ల పోచంపల్లి, గాగిల్లాపూర్, కిష్టాయపల్లి, ఖాజిపల్లితో పాటు ఔటర్ కు ఇరువైపులా వెలిసిన కాలనీలు, టౌన్ షిప్ లకు ఈ అర్బన్ పార్క్ స్వచ్చమైన ఆక్సీజన్ ను అందించే కేంద్రంగా ఉపయోగపడనుంది. హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న అన్ని అటవీ బ్లాకులకు అభివృద్ధి చేసి అర్భన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా తీర్చిదిద్ధాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ పార్కుకూడా అభివృద్ధి చెందనుంది.

సంతోష్‌కుమార్ చొరవ అభినందనీయం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్భన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అర్భన్ ఫారెస్ట్, ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ధి చేస్తున్నారన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని సినీనటుడు ప్రభాస్ ఖాజీపల్ల్ల్లి రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభాస్ మాదిరిగానే వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ముందుకు వచ్చి గ్రీన్ ఇండియా, అటవీ ప్రాంతాల అభివృద్ధిలో బాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.


మరిన్ని అటవీ బ్లాకులను దత్తత ఇస్తాం
ఈ యేడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వంతోనూ, అటవీ శాఖతోనూ సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు అయింది. త్వరలోనే మరిన్ని అటవీ బ్లాకులను ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు దత్తత ఇచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంతోష్ కుమార్ వెల్లడించారు. కాగా కోవిడ్ నిబంధనల కారణంగా అతి కొద్ది ఆహ్వానితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పిసిసిఎఫ్ ఆర్. శోభ, పిసిసిఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, ఎస్‌పి చంద్రశేఖర రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
మాట నిలుపుకున్న సంతోష్ కుమార్
గత సంవత్సరం మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపి సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. ఆమేరకు ఆగస్ట్ 31, 2019న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్ధికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News