Saturday, April 27, 2024

అయోధ్యలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో కరోనా కలకలం..
ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్

Priest and 14 Cops test positive for Corona in Ayodhya

అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది. ఉగ్రవాదుల దాడుల నిఘాతో ఉద్రిక్తంగా ఉన్న పట్టణంలో ఇప్పుడు ఈ కరోనా మరింత ఆందోళన కల్గించింది. రామమందిరంలో ప్రధాన పూజారికి సహాయకుడిగా వ్యవహరించే ప్రదీప్ దాస్ ఇప్పుడు కోవిడ్ బారిన పడ్డారు. వెంటనే ఆయన హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆలయం దరిదాపుల్లో విధులు నిర్వహించే పోలీసులలో 14 మంది పోలీసులకు కూడా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. రామమందిర శంకుస్థాపన కోసం అయోధ్య నగరం పూర్తిగా సుందరంగా ముస్తాబు అయింది. భూమిపూజ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ప్రముఖులు రానుండటంతో ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం, స్థానిక అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పూజారులలో ఒకరికి కరోనా సోకడంతో పూజాదికాలు నిర్వహించే ఇతర అర్చకులు కూడా అప్రమత్తం అయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వేడుకకు అయోధ్య ముస్తాబు.. ఇండ్ల గోడలపై రామకథచిత్రాలు
అయోధ్య ఇప్పుడు పలువన్నెలు చిన్నెలుగా ముస్తాబు అవుతోంది. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన రోజు సమీపిస్తుండటంతో పట్టణంలో పలు చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు అవుతున్నాయి. శ్రీరామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలో దీపావళి తరహాలో సంబరాలకు ఏర్పాట్లు చేపట్టారు. సాధారణంగా అయోధ్యలో దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున దీపోత్సవం జరుగుతుంది. రెండు మూడు రోజుల పాటు పట్టణంలో రాత్రిపూట మట్టిప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. దివాళీ సంబరాల తరహాలో అన్ని ఏర్పాట్లు ఉంటాయని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. భూమిపూజ రోజున ప్రజలకు పంపిణీ చేసేందుకు లక్ష లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన పూజా కార్యక్రమాలు ఆరంభం అవుతాయి. 5వ తేదీన గర్భగుడిలో పూజలు ఉంటాయి. ప్రముఖులు, ప్రత్యేకించి ప్రధాని మోడీ కార్యక్రమానికి రానున్నారు.

దీనితో స్థానిక సాకేత్ కాలేజీ మైదానంలో హెలీకాప్టర్లు దిగేందుకు వీలుగా మూడు హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. రామాలయం నుంచి స్థానిక హనుమాన్ ఘర్హి ప్రాంతం మధ్య ఉన్న ఇండ్లపై రామకథా చిత్రాలను వేస్తున్నారు. స్థానికంగా ఇది ఓ మహావేడుకగా ఉంటుంది. ఇందుకు సమయం సమీపిస్తూ ఉండటంతో ఇప్పటికే భక్తులు అసంఖ్యాకంగానే అయోధ్యుక చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఎంతోకాలంగా రామాలయ నిర్మాణ ఘట్టాన్ని జీవితకాలంలో చూడాలనుకునే విశ్వాసపరులు దూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు. ఇక్కడ బస చేసి సరయూ నది తీరానికి చుట్టుపక్కల సందర్శనలకు వెళ్లుతున్నారు. దీనితో అయోధ్యలో తిరిగి సందడి నెలకొంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అయోధ్యలో విధ్వంసానికి దిగే వీలుందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనితో పట్టణంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 3వతేదీన గణేశుడి పూజా దశలో ఆలయ పూజాకార్యక్రమాలు ఆరంభం అవుతాయని ట్రస్టు సభ్యులలో ఒకరైన డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో పూజ సందర్భంగా వేద పండితుల కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోడీ భూమిపూజ చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

Priest and 14 Cops test positive for Corona in Ayodhya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News