Monday, May 27, 2024

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి: ప్రియాంక పిలుపు

- Advertisement -
- Advertisement -

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి
ఎన్నికల్లో పోరు అసలు సమస్యలపైనే జరగాలి
నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం జనం జీవితాల్లో నిజాలు
మార్పు కోసం వోటు వేయండి
ఉత్తరాఖండ్‌లో ప్రియాంక పిలుపు

రామ్‌నగర్ (ఉత్తరాఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాల్లో ఉపయోగించే పదాలకు మోసపోవద్దని ప్రజలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శనివారం కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మార్పు కోసం వోటు వేయాలని ప్రజలకు ప్రియాంక పిలుపు ఇచ్చారు. ఉత్తరాఖండ్ రామ్ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ప్రసంగిస్తూ, ఎన్నికల్లో పోరాదవలసింది అసలు సమస్యలపైనే గానీ శుష్క ప్రియాలపై కాదని అన్నారు. ‘మోడీజీ తన ఎన్నికల ప్రసంగాలలో వాడే పదాలకు పడిపోవద్దు. మీరు వోటు వేసే ముందు గదచిన పది సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం మీ జీవితాల్లో సకారాత్మక మార్పు తెచ్చిందా అని మిమ్మల్ని మీరు నిజాయతీగా ప్రశ్నించుకోవాలి’ అని ఆమె సూచించారు.

అంతకంతకు పెరుగుతున్న నిరుద్యోగిత, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం, పేపర్‌లీక్ కుంభకోణాలు ప్రజల జీవితాల్లో సత్యాలని, గడచిన పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నందున బిజెపి ప్రభుత్వానిదే వీటికి బాధ్యత అని ఆమె ఆరోపించారు. రిసార్ట్ రిసెప్షనిస్ట్, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావోకు చెందిన అంకిత భండారి హంతకులను కాపాడుతున్నది ఎవరని మోడీని జనం అడగాలి అని కూడా ప్రియాంక సూచించారు. మోడీ ప్రభుత్వం తమ వాగ్దానాలను నెరవేర్చలేదని ప్రియాంక ఆరోపిస్తూ, యువజనులకు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుని బ్యాంక్ ఖాతాల్లో రూ. 15 లక్షల డిపాజిట్ వంటి వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదని ప్రజలకు గుర్తు చేశారు. ఓట్ల కోసం ప్రతి ఎన్నికలు బిజెపి ఉపయోగించుకుంటున్నదని కూడా ఆమె ఆరోపించారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రాన్ని దేవ్‌భూమిగా మోడీ అభివర్ణించారు.

కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలిచింది. కొన్ని నెలల తరువాత ఒక విపత్తు సంభవించినప్పుడు మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సహాయంగా ఒక్క పైసా కూడా విదల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరుల నుంచే సహాయం అందజేసింది’ అని ప్రియాంక చెప్పారు. ‘దేవ్‌భూమి’ పదాన్ని బిజెపి నేతలు రాజకీయ కారణాలతో ఎన్నికల ప్రసంగాల్లో ఉపయోగించారని ఆమె ఆరోపించారు. ప్రధాని ‘బార్ బార్ మోడీ సర్కార్’ (మళ్లీ మళ్లీ మోడీ ప్రభుత్వం) అని అంటున్నప్పుడు “ఔర్ కిత్నీ బార్ మోడీ సర్కార్’ (ఇంకా ఎన్ని సార్తు మోడీ ప్రభుత్వం) అని అడుగుతున్నట్లుగా తాను భావిస్తుంటానని ప్రియాంక తెలిపారు.

‘త్యాగం హిందు మతంలో ఎంతో విలువైనది. సిసలైన విశ్వాసం త్యాగాల నుంచి ఉత్పన్నం అవుతుంది. నాకు త్యాగం తెలుసు. 19 ఏళ్ల యువతిగా నేను మా తండ్రి శరీర భాగాలను మా తల్లి ముందు ఉంచాను. మా హృదయాల్లో సిసలైన విశ్వాసం ఉన్నందున అమరుడైన మా తండ్రిని వారు అవమానించినప్పుడు మేము మౌనం వహిస్తుంటాం’ అని ప్రియాంక చెప్పారు. ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ1991లో హత్యకు గురయ్యారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో ఇదే తొలి ప్రధాన ర్యాలీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News