Friday, April 26, 2024

తెలంగాణ కథలో ప్రపంచీకరణ

- Advertisement -
- Advertisement -

Process by which Countries connect faster is called Globalization

 

దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు.

వేలాది మంది చిన్న ఉత్పత్తి దారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి హక్కులకు భంగం కలుగుతున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రపంచ బ్యాంకు (IBRD) అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు. ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం దరిమిలా ఐరోపా దేశాలు కొన్ని ముఖ్యమైన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు చేయడం ద్వారా భారీ మొత్తంలో ఉత్పత్తులను తయారు చేయగలిగాయి. ఆ ఉత్పత్తులకు (సరుకులకు) మార్కెట్లను వెతుక్కునే క్రమంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు రావడం, వ్యాపారం పేరుతో ఆ దేశాలను వలసలుగా చేసుకోవడంతో ఈ ప్రపంచీకరణ దశ వేగం పుంజుకున్నదని చెప్పవచ్చు.
ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న ఆర్ధిక వ్యవస్ధలు, పరిశ్రమలు, మార్కెట్లు, సంస్కృతులు, విధానాల రూపకల్పన (ఈ పని చేసేది ప్రభుత్వాలు అని గుర్తుంచుకోండి!) అన్నీ సమ్మిళితం కావడమే ప్రపంచీకరణ అని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక (బ్రిటన్) నిర్వచించింది.

తెలంగాణపై ప్రపంచీకరణ ప్రభావం

ప్రపంచీకరణ, అభివృద్ధీకరణ, నగరీకరణ తెచ్చిపెట్టే సమస్యలకుతోడు ప్రాజెక్టుల కింద భూములను తక్కువ ధరకు కొనుక్కుని వలసవాదులు తెలంగాణలో స్థిరపడ్డారు.
1956 తరువాత తెలంగాణ వ్యాప్తంగా అనేక స్పిన్నింగ్ మిల్లులు అజంజాహీ మిల్లు, DBR మిల్లు, అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు, సిర్పూర్ సర్ సిల్క్, పలు పంచధార పరిశ్రమలు, ఫిరంగుల ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, దక్కన్ ఐరన్ ఫ్యాక్టరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, A. P. Steels, HMT, ఆల్విన్ వాచ్ కంపనీ లాంటి ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురై, ఖాయిలాపడి మూతపడ్డాయి. తత్ఫలితంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడి సంసారాలు కూలిపోయాయి. ఎంతో మంది నిరుద్యోగాన్ని భరించలేక ఆత్మహత్యలపాలయ్యారు. తెలంగాణ సమాజం ఇంత సంక్షోభానికి గురైనా ఈ తెర వెనుక కుట్ర వుందనే చెప్ప వచ్చు.నేడు తెలంగాణ ప్రాంతీయ చైతన్యం ఒక అస్తిత్వం గా మారడానికి కారణం కూడా ప్రపంచీకరణ ప్రభావం,ఆంధ్ర పాలన కారణాలనీ చెప్పవచ్చు.

తెలంగాణ కథ ప్రపంచీకరణ

తెలుగు సాహిత్యంలో ప్రపంచీకరణ పరిణామాలతో వెలువడిన తొలి కథా సంపుటి వేపచెట్టు.దీనిని జి.రాములు రాసారు.ఇందులో అయిదవ వాడు ,చేయూత,మలుపులు, సంబంధం, ప్యారాసైట్లు,కామన్వెల్ వంటి కథలున్నాయి.
ముదిగంటి సుజాత రెడ్డి రాసిన వ్యాపార మృగం కథల సంపుటం ప్రపంచీకరణ నేపధ్యంలో రాయబడినది. దీనిలో 20కథలున్నాయి. ఇవి సామ్రాజ్యవాద కారణంగా వ్యాపారాలు సృష్టించిన వైపరీత్యాన్ని చిత్రీకరించాయి. దీనిలో ప్రధానకథ వ్యాపార మృగం. కథలో పులి మాధవి అనే ఆవిడ కల్లు,సారా, విస్కీ,గుట్కా లకు జనం బలి కావొద్దనీ ప్రచారం చేస్తూ ఒంటరి పోరాటం చేస్తుంది. తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని బిక్షపతి,యాదవ రెడ్డి,చెన్నయ్య ,గుర్నాధంలు మాధవి పై గుర్రుగా ఉంటారు. ఒకరోజు మాధవి భయంకరంగా చంపబడుతుంది. ఎవరు చంపారో బయటపడలేదు. ఎన్నాళ్లైనా చిక్కుముడి వీడకపోవడానికి కారణం మనిషి కి మానవ సంబంధాల కంటే వస్తు వ్యామోహం లో ఆర్థిక సంబంధాలలో కొట్టుకుపోవడం అంటారు రచయిత్రి.

మరో కథ న్యూ ఆనంద్ హోటల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కథలో లాలయ్య పాత్ర తన కొడుకు పెట్టబోయే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని గురించి విని తట్టుకోలేక పోయాడు.‘మనం తింటే నలుగురు తినాలి, బతకాలి అనుకున్నా మనతో పాటు నలుగురు బాగుపడాలి అనుకున్నా గాని ఇది ఎందుకనీ ఇది ఎందుకని బోరున ఏడ్చాడు లాలయ్య‘ సమాజంలో అనివార్యంగా వచ్చిన మార్పును మానవసంబంధాలను ఈ కథలో చెప్పారు రచయిత్రి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో మారిన పరిస్థితులలో ప్రజా జీవితంలో కలిగే ఆవేదనను అణిచివేతను వ్యక్తుల సంఘర్షణ నేపథ్యంలో కథలు రాసిన వారు బి.వి.యన్.స్వామి (కరీంనగర్) వీరు ‘నెలపొడుపు’ అనే కథల సంపుటి రాశారు.అలాగే వీరి ‘బల్లి పాతర’ అనే కథ ప్రపంచీకరణ కు సంబంధించిన కథ.ప్రపంచీకరణ క్రమంలో గ్రామాలను, గ్రామ సంపదలను అందులో భాగంగా రైతు జీవితాన్ని ఆక్రమించుకొంటూ, మింగేస్తూ బహుళజాతి సంస్థలు విస్తరిస్తూ బలపడే క్రమాన్ని స్వామి రాసిన ‘తెల్లదయ్యం’ కథ సమర్థవంతంగా చిత్రించింది. సాంకేతిక ప్రభావం వల్ల మార్కెట్ స్వరూపం మారిపోవడం ప్రపంచీకరణ ఎలా మన ఆచార స్వరూపాలను మార్చిందో చేతి వృత్తులను,కులవృత్తులను ఎలా నాశనం చేసిందో చెబుతూ జాతశ్రీ 2019 లో ఆర్తారావం అనే సంపుటిని రాశారు.

దీనికి సింగమనేని నారాయణ కథ కాల నాళిక పేరుతో ముందుమాట రాశారు.జాతశ్రీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తులను గురించి కథలు రాశారు. వడ్రంగి వృత్తి పై కుట్ర కథను ,కుమ్మరి వృత్తి పై చలివేంద్రం, గౌడ కులం పై అంతర్ముఖం, చేనేత కులంపై చిరునామా,గ్రామీణ కళాకారుల విధ్వంసం పై విధ్వంసం,పాకీ వృత్తిపై అనివార్యం అనే కథలు రాశారు. జాతశ్రీ ముళ్ళ పొదలు,చలివేంద్రం కథలు ఉదార ఆర్థిక విధానాల వల్ల చితికిపోతున్న ఆర్దిక బంధాలను చెప్పారు.సింగరేణి గనుల ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి పేరిట సైకిల్ రిపేరు షాపు కోల్పోయి పాపయ్య కథ ను ముళ్లపొదల్లో అనే కథలో చెప్పారు రచయిత.ప్రపంచీకరణ కారణంగా విస్తరిస్తున్న విష సంస్కృతి ఆధునికత కారణంగా సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందో,గ్రామాలలో పేద వారి జీవితం ఎంత దుర్భరంగా మారుతున్నదో చెబుతూ కథలు రాసిన వారు దిలావర్. వీరు రాసిన మచ్చు బొమ్మ (2007) కథసంపుటి లో ‘అలసిపోయిన బతుకులు’, ‘గూడు చెదిరి పోయింది’, ‘కొండచిలువ’ వంటి కథలు ప్రపంచీకరణ ప్రపంచ మార్పును తెలియజేశాయి.అంపశయ్య నవీన్ రాసిన కథ గాజు తెర. ప్రపంచంలో తన కోరికలు తీరే దారి లేక కోర్కెలను చంపుకోలేక వస్తు వినియోగం కు గురి అవుతూ నిరంతరం వేదన అనుభవించిన ఒక క్రికెట్టు ఆటగాడి కథ గాజు తెర. కథ చివర్లో ప్రధాన పాత్ర ఈ గాజు తెర ను పగలగొట్టడం ద్వారా కలలు విరిగిపోయాయనే ధ్వని నీ ప్రతిబింబించారు రచయత.

గూడూరి సీతారాం ‘నారి గాని బతుకు’ కథలో గీత కార్మికుడి జీవితంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను చిత్రీకరించారు. కథలో నారి గాని మొదటి భార్య లసుమ.ఈమె వ్యాపారం లో భర్తకు సహకరిస్తుంది.రెండో భార్య ఎల్లి నారి గాన్ని మోసం చేసి వేరే వాడితో లేచిపోతుంది.నారి గాడు మూడో పెళ్లి చూసుకుంటాడు.మూడో భార్య ను కల్లు తాగిన వ్యక్తి తిరుపతి కొంగు పట్టి గుంజుతాడు. అదిచూసిన నారిగాడు ఆవేశంతో అతని పై చేయి చేసుకుంటాడు. ఇదంతా తమ ఆడది కల్లు అమ్మడం వల్లనే అనీ ఇక తమ కుటుంబం లో ఎవ్వరూ ఆడవాళ్లు కల్లు పోయ్యొద్దనీ అంటాడు. నారిగాడు కొడుకును కూడా ఆడవాళ్ళతో అమ్మొద్దంటాడు. ఇలా వృత్తిపై నారిగాడి సంఘర్షణను గ్లోబలైజేషన్ ప్రభావం ను చెప్పారు రచయిత. అలాగే మరొక లచ్చి. ఇది సంచార జీవనాన్ని గడిపే పిచ్చుక కుంట్ల కులం కు సంబంధించింది.తన కుల వృత్తినే చేసుకునే లచ్చి, భర్త రంగడు దొంగగా ముద్ర పడడంతో పట్నం వలస వెళ్లతారు. అక్కడ తనకు ఎదురైన పారిశ్రామిక, ప్రపంచీకరణ ప్రభావం వలన మళ్ళీ తిరిగి పాత జీవితంలో వేళ్లాలనునుకోవడం కథ ఇతివృత్తం.

యాంత్రీకరణ గ్లోబలైజేషన్ వలన తెలంగాణ గ్రామీణ రూపం మారిన దశను తెలుపుతు ఆదెపు లక్ష్మీపతి. ‘జీవన్మృతుడు’ అనే కథ లో చెప్పారు. దీనిలో ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి రియాద్ వెళ్లాలని అనుకుంటాడు. కానీ కథానాయకుడు అక్కడి పరిస్థితులను తట్టుకోగలనో లేదో అనే అంతర్మథనం కనిపిస్తుంది.ఈ కథ ఉత్తమ పురుష లో సాగింది.గ్లోబలీకరణ వలన సామాన్యుడు కంప్యూటర్,మొబైల్లు ఎన్నో యంత్ర పరికరాలను కొనుక్కోగలడు గానీ ‘గీ కంప్యూటర్లు, ఫ్లైఓవర్లు,బిల్ గేట్లు బువ్వ పెడతాయా‘ ఇది తెలంగాణ ప్రజల మనో వేదన. ఈ విధానంపై యెన్నెం ఉపేందర్ గ్లోబర్ నగరం, గ్లోబల్ ఉప్పెన వంటి కథలు రాశారు.వ్యవసాయాలు చేయలేని పరిస్థితులు కల్పించబడిన వాతావరణంను బోధనం నర్సిరెడ్డి చిత్రీకరించారు.సింగరేణి కాలరీస్ లో వచ్చిన మార్పుల వలన సాంకేతిక మార్పులు వలన ఉపాధి కోల్పోయిన జీవితాలను రచయిత హనిఫ్ చిత్రీకరించారు. వీరు ‘మా ఊరికి చారెడు నేల కావాలి’, విజన్ 2020 వంటి కథలు కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో రాసారు.

గ్లోబలైజేషన్ పరిమాణాల పరంపరకి రైతుల ఆత్మహత్యలకు సంబంధాన్ని నిశితంగా చర్చించిన కథ శిధిలం. దీనిని కాసుల ప్రతాపరెడ్డి రాశారు. ఈయన రాసిన ‘హత్య’ కథ కోస్తాంధ్ర విద్యా వ్యాపార సంస్థలలో చేరి చదువుల పందెంలో సాటి వారితో నెగ్గలేక న్యూనపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ విద్యార్థుల మరణాలు కూడ హత్య లే నిర్ధారిస్తుంది.గ్లోబలైజేషన్ పుణ్యమా అనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు మంచి జీతాలు వస్తాయని వాదిస్తుంటారు కొందరు. కానీ అలాంటి వారి జీవితంలో కూడా పతనావస్థ ఉంటుందని గురు స్వామి ‘ఐటి కప్ప’ అనే కథ తెలిపింది. ప్రపంచ బ్యాంక్ రోడ్డు రోలర్ ప్రయాణించే దారి పొడవునా బాధితులే ఉన్నారు అని చెబుతూ ఖాదర్ లేడు అనే కథ సాగుతుంది.‘పేచీకోరు అమ్మాయి’ అనే కథలో ఎన్ని కష్టాలు ఎదురైనా జీవన సౌరభం కోల్పోని పరిమళ పాత్రను చిత్రణ చేస్తూ ఆమె ‘రోడ్డు వెడల్పు చేస్తున్నారట. రోడ్డు పక్కన రెండు మొక్కలు నాటితే అవి రెండేళ్ళ లో పెద్దవి ఆయితే చెట్టుకిందే కాపురం ఉండొచ్చు అంటుంది’ పాత్ర ఇలా గ్లోబలైజేషన్ పర్యవాసానాలను రాసిన రచయిత ఖమ్మం జిల్లాకు చెందిన వంశీకృష్ణ.

శ్రీధర్ దేశ్‌పాండే ‘మరే కిసాన్’, బోధనం నర్సిరెడ్డి ‘పేగు బంధం’ ఈ రెండు కథలు తెలంగాణ వ్యవసాయ సంక్షోభాన్ని, అమెరికా ఎండమావి మింగుతున్న తెలంగాణ నేలను సూచిస్తాయి. సంస్కృతితో పాటు ధ్వంసమవుతున్న బతుకుతెరువు లను పెద్దింటి అశోక్ కుమార్ తన గోస అనే కథ ద్వారా తెలిపారు. దీనిలో సాధన శూరులనే కులాధార కళాకారుల కులం ఎలా నిరాశ్రయం అయిందో చెబుతారు.పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘కీలుబొమ్మలు’ కథలో పత్రిక ఎడిటర్ సర్వాయిపల్లి గ్రామానికి ఆటోలో బయలుదేరుతాడు. మాస్కు తెచ్చుకున్నారా అని డ్రైవర్ అడిగినప్పుడు ఆశ్చర్యపోతాడు.కొంత దూరం పోయిన తర్వాత ఎడిటర్ కు పరిస్థితి అర్థమవుతుంది. అక్కడ దారి లో ఒక్క చెట్టు కూడా ఉండదు.ప్రపంచీకరణ వలన పారిశ్రామిక అభివృధి వలన గ్రామాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో రచయిత చర్చించాడు.కుల వృత్తులు అంతరిస్తూ జీవితాలలో తెచ్చే సంక్షోభాన్ని పెద్దింటి అశోక్‌కుమార్ తన కథలలో చిత్రించారు.

‘తెగిన బంధాలు’ కథలో పెండ్లిళ్ళ పద్ధతులు మారటంవలన కూరాడు కుండలకు, పోలు ముంతలకు పెళ్ళితంతులో స్థానం లేకుండాపోవటం అది కుమ్మరికి ఇంతకుముందున్న ప్రాధాన్యతను అభావం చేయటం, ఒక్క కుమ్మరులే కాదు డబ్బు పెట్టుబడి, వ్యాపారీకరణల ప్రాధాన్యతలో అభివృద్ధిచెందిన కొత్త పెండ్లి తీరులో చాకలి, మంగలి, మాదిగ మొదలైన అన్ని కులాల వాళ్ళూ ఉపాంతీకరించబడటం చిత్రితమయ్యాయి.కాగుబొత్త కథ కుమ్మరి జీవన విషాదాన్ని చిత్రించిన కథ. జాతరలో చలివేంద్రం పెట్టడానికి మట్టికాగులు చేసే పని తండ్రి చేపడితే నీటి ప్యాకెట్లను అమ్ముకొనే కాంట్రాక్టు పట్టాడు కొడుకు. బతుకుతెరువు పాకులాటలో తండ్రీ కొడుకుల సంబంధాలు నిలబడనివే అయినాయి. నీళ్ళను ముల్లెగట్టి అమ్మే వ్యాపారం వచ్చి కాగు బొత్తకు స్థానం లేకుండా చేసిన క్రమంలో ఉన్న హింస ఈ కథ వివరిస్తుంది. వ్యాపార సంస్కృతి గ్రామీణ సహజ వనరులను కొల్లగొట్టే ప్రమాదం ఎంతగా ఉందో ‘పేగు ముడి’ కథలో అశోక్‌కుమార్ సూచించారు. ‘కీలుబొమ్మలు’ కథలో ప్రపంచీకరణ క్రమంలో కార్పొరేట్ వ్యవసాయ విధానం గ్రామాలలోకి చొచ్చుకొని వస్తూ రైతుల, కూలీల జీవితంలో నింపుతున్న సంక్షోభాన్ని ప్రతిఫలించింది.

గూడ అంజయ్య రాసిన ‘అదే మీరయితే’ కథ నిజాం కాలం నాటి భూస్వామ్య దోపిడీని చిత్రీకరించింది.జూకంటి జగన్నాథం వైపని కథలు (2011) ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతూ ప్రపంచీకరణ పరిణామాన్ని వివిధ కోణాలలో చూపించాయి.
కె వి నరేందర్ దోరంచుకున్న దేవక్క, కాసుల ప్రతాపరెడ్డి- పక్షులెరిగిపోయిన తోట,పప్పుల నరసింహం -‘తెలంగాణ స్వగతాలు’, పి.చంద్-‘నిర్వాసితులు’, బి.ఎస్.రాములు- ‘బతుకు పయనం’(2005), గీతాంజలి- ఊరికి పోదాం దా భూదేవి, మేరెడ్డి యాదగిరిరెడ్డి- బిటి విత్తనం(2005), సేజ్ కథ, హార్వెస్టర్ కథ, చొప్పదండి సుధాకర్ – గడ్డిపరక (2008), రామా చంద్రమౌళి – భూమి దుఃఖం (2007) , గొరుసు జగదీశ్వర్ రెడ్డి – బతుకు గోస, కాలువ మల్లయ్య- గ్లోబలైజేషన్, ఉదయమిత్ర- ఆఖరి కుందేలు, పి.చంద్– భూమి పుత్రుడు, జడ్తి, నీళ్ల కోసం, భూ నిర్వాసితులు, వంటి కథలు కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో సాగినవే.

ప్రపంచీకరణను స్పృశించిన ఇతర రచయితలు

గ్లోబలీకరణ నేపథ్యంలో రచనలు చేసిన ఇతర రచయితలు తెలిదేవర భానుమూర్తి , పంజాల జగన్నాథం , బెజ్జారపు వినోద్ కుమార్ , బెజ్జారపు రవీందర్, కె.పద్మలత , అంబల్ల జనార్ధన్ , ఎన్.కె.రామారావు, స్కైబాబా , అఫ్సర్ , షాజహాన , జాజుల గౌరీ , పరవస్తు లోకేశ్వర్ , నల్లాల లక్ష్మీరాజ్యం , జూపాక సుభద్ర , ఎలికట్టే శంకర్ , పూడూరి రాజిరెడ్డి , గౌస్ మొయినుద్దీన్ , అనసూయ , దొడ్డి రామ్మూర్తి, ఐతా చంద్రయ్య మొదలైనవారు.

ప్రపంచీకరణ పై రచనలు

ప్రపంచీకరణ ఒక పరిశీలన(వ్యాసం)- డాక్టర్ సాయి బాబా , గ్లోబలైజేషన్ సాహిత్య దృక్పథం (వ్యాసం) గుడిపాటి, ప్రపంచీకరణ గ్రామీణ సంక్షోభం తెలుగు కథ (వ్యాసం)-కాత్యాయనీ విద్మహే, ప్రపంచీకరణ కోత్త కోణాలు కథా ప్రక్రియ (వ్యాసం)- ఎన్.వేణుగోపాల్ ,

ప్రపంచీకరణ విమర్శ

ప్రపంచీకరణనేపథ్యంలో సాహిత్య విమర్శ (వ్యాసం) – లక్ష్మణ చక్రవర్తి , ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళా జీవనం (రచన) -కాత్యాయనీ విద్మహే, ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా సంస్కృతులు (వ్యాసం)-జ్వాలా ముఖి.అలాగే ముదిగం టి సుజాత రెడ్డి అస్తిత్వ వాద చైతన్యంతో ప్రపంచీకరణ దృష్టికోణం తెలుగు సాహిత్య విమర్శ చేస్తున్నారు.ప్రపంచీకరణ దృక్పథాన్ని పరిశీలనగా వ్యాసాలను తెచ్చిన వారు పసునూరి రవీందర్. వీరు ’ఇమ్మతి’, ’గ్లోబలైజేషన్’.అనే వ్యాసాలు రా సారు.

ప్రపంచీకరణ పై పరిశోధనలు

ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం విమర్శ అనే అంశం పై పసునూరి రవీందర్ 2006లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. అలాగే తెలుగు నవలా ప్రపంచీకరణ అంశంపై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎస్.రజిని గారు పరిశోధన చేస్తున్నారు.గ్లోబలైజేషన్ కథలు ఒక పరిశీలన ఎం.ఫిల్ పరిశోధనను వారణాసి మల్లీశ్వరి , ప్రపంచీకరణ కథలు విమర్శనాత్మక పరిశీలన (2005 సెంట్రల్ యూనివర్సిటీ) లో జి.వెంకట రామయ్య, ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం (2005)-సిహెచ్.కాశీం. చివరగా ప్రపంచీకరణకు రెండు అర్ధాలు ఉన్నాయి. వాస్తవ అర్ధం ఒకటయితే అమలవుతున్న అర్ధం మరొకటి. ప్రపంచీకరణను నిజమైన సమానతా సూత్రాల ప్రాతిపదికన అమ లు చేస్తే ప్రపంచంలోని ప్రతి పౌ రుడికీ మేలు జరుగుతుంది. కానీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ కొనసాగుతున్నంత కాలం అది జరగదు గాక జరగదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News