Tuesday, April 30, 2024

బ్రిటన్‌లో యువ పర్యావ‘రణం’

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు పర్యావరణ ప్రేమికుల నిరసన సెగలు తగిలాయి. ‘ రిషి సునాక్.. నీకు చమురు లాభాలు కావాలా? లేక మా భవిష్యత్తా’ అని రాసి ఉన్న బ్యానర్లను గ్రీన్‌పీస్ కార్యకర్తలు ప్రదర్శించారు. ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై నిరసనకారులు నల్లటి వస్త్రాన్ని కప్పారు. గురువారం ఈ ఘటన జరిగింది. సునాక్ సారధ్యపు ప్రభుత్వం పర్యావరణ హితాన్ని పక్కకు పెట్టిందని , అత్యధిక స్థాయిలో చమురు తవ్వకాలకు దిగుతోందని, ఈ విధంగా డ్రిల్లింగ్ పాలసీని అమలు చేయడం పర్యావరణానికి ముప్పు అవుతుందని నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్‌పీస్ యుకె కార్యకర్తలు పలువురు ప్రధాని ఇంటిపైకి చేరుకుని నల్లటి వస్త్రాలను ప్రదర్శించడం జరిగింది. ప్రభుత్వ డ్రిల్లింగ్ పాలసీపై తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని, ఇప్పుడు తాము ప్రదర్శించిన నలుపు కేవలం ఓ ఆరంభం అని తెలిపారు.

సునాక్ ప్రభుత్వ విధానాలు పర్యావరణ హితంగా లేవని విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే తాము దురాక్రమణదారులైన రష్యాపై చమురు కోసం ఆధారపడలేమని, ఓ వైపు పర్యావరణాన్ని మరో వైపు ఇంధన అవసరాలను సరైన విధంగా సమన్వయపర్చుకుంటూనే విధానాలు పాటిస్తామని సునాక్ ఇటీవల వెలువరించిన ప్రకటన పర్యావరణ హిత ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటనకు దారితీసింది. అయితే దేశంలో వినియోగదారుల బిల్లులు భారం తగ్గించడం తన బాధ్యత అని సునాక్ ప్రభుత్వం తెలిపింది. సునాక్ ప్రకటనకు ప్రతిచర్యగా నిరసనకారులు ఇటీవలి కాలంలో పలు చోట్ల అట్టహాసపు క్రీడలను, మ్యూజిక్ ఉత్సవాలను, రాజకీయ నేతల ప్రసంగాలను అడ్డుకుంటూ వస్తున్నారు. నిరసనలలో భాగంగా కొన్ని రద్దీ రోడ్లపై అతి నెమ్మదిగా నడవడం, బిల్డింగ్‌లు, ఇతర కేంద్రాలకు తాళాలు వేయడం వంటి చర్యలకు దిగుతున్నారు.

ఇప్పుడు సునాక్ నివాసంపై నల్లటి దుప్పటి కప్పారు. అయితే చమురు నిల్వలు పెంచడం, దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం తమ కర్తవ్యం అని సునాక్ చెపుతున్నారు. కానీ ఉత్తర సముద్రంలో ఇటీవల చమురు గ్యాస్ వెలికితీతకు అనుమతిని ఇచ్చారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు నిలిపివేయగా సునాక్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిసెంబర్‌లో ఓ బొగ్గు గని తవ్వకాలకు అనుమతిని ఇవ్వడం మరింత నిరసనకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News