Tuesday, April 30, 2024

అపర చాణక్యుడు అందరివాడు

- Advertisement -
- Advertisement -

PV Narasimha rao Shata jayanti celebrations

 

స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు– (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం లో, ఆసఫ్‌జాహి రాచరిక వ్యవస్థలో, ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు ప్రాంతంలో, లక్నేపల్లి గ్రామం మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో 1921 జూన్ 28వ తేదీన పి.వి జన్మించారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ర్ట గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పి.వి.శతజయంతి ఉత్సవాల ప్రారంభం ఘనంగా జరిగింది. రాచరిక వ్యవస్థ నిర్బంధ వాతావరణంలో, దిగ్బంధ సమాజంలో పి.వి బహుముఖ ప్రతిభావంత, అసాధారణ ప్రజ్ఞావంత వ్యక్తిత్వం సహస్ర దళాలతో వికసించడం, విరాజిల్లడం, వివిధ రంగాలలో వెలుగులు ప్రసరించడం, రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందడం విశేషం.

పూవు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంలోనే పి.వి అప్రతిమాన, అద్వితీయ, అఖండ మేధస్సు వరంగల్లు, -హన్మకొండ నగరాలలో ఆవిష్కృతమైంది. -అనంతర సంవత్సరాలలో క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యలలో, బహుభాషా, సారస్వత, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలలో సర్వప్రధముడయిన పి.వి తన సమాజాన్ని, తన రాష్ట్రాన్ని, తన దేశాన్ని, విశ్వ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించలేదు. పసితనం నుండే పి.వి.లో సామాజిక స్పృహ, సమాజ సేవాసక్తి, దేశభక్తి అత్యధికం.

పదహారు సంవత్సరాల కౌమారదశలో, ఒకవంక విద్యార్జనలో నిమగ్నమైన విద్యార్ధి పి.విపై భారత స్వాతంత్య్ర- జాతీయ ఉద్యమా ల, ఆర్యసమాజ్ కార్యక్రమాల ప్రభావం గాఢంగా ప్రసరించింది. నాటి నిజాం నిరంకుశ ప్రభుత్వ ఆంక్షలను, ఆదేశాలను, ఆజ్ఞల ను సాహసోపేతంగా ధిక్కరించి వరంగల్లు-, హన్మకొండ నగరాల సత్యాగ్రహ ఉద్యమాలలో పి.వి పాల్గొన్నాడు. సత్యాగ్రహ ఉద్యమాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలాపించిన పి.విని నిజాం ప్రభు త్వం నిర్దాక్షిణ్యంగా బహిష్కరించింది. -హైదరాబాద్ సంస్థానంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పి.వి ఉన్నత విద్యార్జన జరుపరాదని నిజాం ప్రభుత్వం ఆంక్ష విధించింది. విజ్ఞాన పిపాసి, ఉన్నత విద్యార్జనాభిలాషి పి.వి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి రాష్ర్టం వెళ్లి నాగపూరు విశ్వవిద్యాలయంలో, ప్రధమశ్రేణిలో ఇంటర్‌మీడియట్ పూర్తిచేసి, పూనా ఫెర్గుసన్ కళాశాల నుంచి గణితశాస్త్రం అభిమాన విషయంగా బి.ఎస్.సి. డిగ్రీ, తరువాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ప్రప్రధముడుగా న్యాయశాస్త్రం డిగ్రీ పొందారు.

నాగపూరు, పూనా నగరాలలో విశ్వవిద్యాలయ డిగ్రీల కోసం ఉన్నత విద్యార్జన జరుపుతున్నప్పుడు పి.వి వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషల విశ్వ సాహిత్య సాగరాన్ని మధించి బహుభాషా కోవిదుడుగా, మహా మేధావిగా, మనిషిగా, కవిగా, రచయితగా, విమర్శకుడుగా, విశ్లేషకుడుగా పరిణతి పొందారు. 1939లో పి.వి నాగపూర్ విద్యార్ధిగా త్రిపురలో జరుగుతున్న చరిత్రాత్మక భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వెళ్లి జాతీయ నాయకుల దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఆయన పద్దెనిమిది సంవత్సరాల విద్యార్ధి, యువకుడు. అప్పటికే ఆయనకు అఖిలభారత జాతీయ దృక్పధం ఏర్పడింది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు సకలభారతం తనదన్న ఉదాత్త భావన పి.విలో బలపడింది.

ఉన్నత విద్యార్జన పిదప హైదరాబాద్ వచ్చిన పి.వి అప్పటికే సుప్రసిద్ధుడయిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తి ప్రారంభించినప్పటికి ఆయన మనసు, మస్తిష్కం ప్రజాసేవపై లగ్నమయినాయి. రాచరిక నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందడం, బ్రిటిష్ పాలన నుంచి మాతృభూమి భారతదేశం స్వాతంత్య్రం పొందడం అప్పుడు పి.వి ముందున్న రెండు లక్ష్యాలు. ఈ రెండు లక్ష్యాల సాధనకు, ప్రజాసేవకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక శక్తివంత ఆయుధంగా పి.వి తనకు సన్నిహితుడయిన సదాశివరావుతో కలసి 1948లో వరంగల్లు నుంచి ‘కాకతీయ’ పత్రిక ప్రచురణ ప్రారంభించారు. ఆ పత్రిక కు వీరిద్దరూ సంపాదకులు. నిష్కర్ష విమర్శలతో కాకతీయ పత్రిక తెలుగు పత్రికా రంగంలో ఒక అపూర్వ ప్రయోగంగా చరిత్ర సృష్టించింది.

నిజాం రాచరిక వ్యవస్థ అండతో కొనసాగిన మతోన్మాద మారణ హోమం నుంచి, అరాజకత్వం నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విముక్తి కల్గించడానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేసి పోరాటం నడిపింది. చాందా శిబిర పోరాటంలో పి.వి ప్రముఖపాత్ర నిర్వహించారు. పోలీసు చర్య (ఆపరేషన్ పోలో) ఫలితంగా నిజాం రాచరిక వ్యవస్థ అంతమయి హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్‌లో విముక్తి పొందిన తరువాత స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులయిన స్వామి రామానందతీర్ధ తమ సంస్ధ ప్రధాన కార్యదర్శులలో ఒకరుగా పి.విని నియమించారు. ప్రగతిశీల, సామ్యవాద భావాల పెన్నిధిగా, సామాన్యజన పక్షపాతిగా, మానవతా వాదిగా పేరొందిన పి.వి తన రాజకీయ గురువుగా, మార్గదర్శిగా స్వామి రామానందతీర్ధను గౌరవించారు. 1951 నుంచి చివరి శ్వాస పీల్చేవరకు (2004 డిసెంబర్‌లో) పి.వి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రముఖ సభ్యులు.

1956 నవంబర్‌లో హైదరాబాద్ రాష్ర్ట విభజన జరిగినప్పుడు పి.వి తెలుగు ప్రజలందరు ఒకే రాష్ర్టంలో ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర- తెలంగాణ ప్రాంతాల విలీనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత (1957-1977) ఇరవయి సంవత్సరాలు పి.వి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభ సభ్యులు. వివిధ రాష్ర్ట మంత్రివర్గాలలో వివిధ, విభిన్న శాఖల మంత్రిగా పి.వి అసాధారణ పరిపాలనా సామర్ధ్యాన్ని, అపూర్వ సంస్కరణాభిలాషను ప్రదర్శించి సురగురు బృహస్సతిగా, విజ్ఞతా శిఖరంగా, విజ్ఞాన శృంగంగా ప్రసిద్ధి పొందారు. రాష్ర్ట శాసనసభలో సాటిలేని పార్లమెంటేరియన్‌గా పి.వి ప్రదర్శించిన రాజకీయ చాతుర్యం, వాదనా పటిమ చిరస్మరణీయమయినవి.

పి.వి రాజకీయ రంగంలో ఆపద్బాంధవుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలలో, వరుసగా ఇరవయి సంవత్సరాలు పి.వి రాష్ర్ట శాసనసభ్యుడుగా, ఏదోఒక శాఖామంత్రిగా, అప్పటి పాలక పక్షంలో ప్రముఖుడుగా ఉన్న రోజుల్లో పలు క్లిష్ట సమస్యలు ఉత్పన్నమయ్యేవి. సమస్యలు ఏవయినా, అవి ఎంత క్లిష్టమయినవయినా వాటి పరిష్కారం కోసం పి.వి విజ్ఞత, మార్గదర్శకత్వం, రాజకీయ చాతుర్యం ఆవశ్యకమయ్యేవి.అందరికి పి.వి తమవాడుగా కన్పించేవాడు. అది ఆయన ప్రత్యేకత. ప్రాంతీయ అసమానతలు, విభేదాలు తీవ్ర స్వరూపం ధరించి ఆంధ్రప్రదేశ్ సమైక్యతకు భంగం వాటిల్లి, రాష్ట్రాన్ని విభజించక తప్పని ప్రమాదం ఏర్పడినప్పుడు, కేంద్ర ప్రభుత్వ రాజీ పధకాలన్ని విఫలమయినప్పుడు అధిష్టానం రాష్ర్ట నాయకత్వంలో మార్పు చేయదలచి, అన్ని ప్రాంతాలు, వర్గాలకు మధ్య సమన్వయం సాధించగల సమర్ధ నాయకుడి కోసం, అందరికి ఆమోదయోగ్యడయిన నాయకుడి కోసం హైదరాబాద్‌కు దూతను పంపి అన్వేషణ ప్రారంభించినప్పుడు అందరికి ఇష్టూడయిన, సమన్వయం సాధించగల సమర్ధుడయిన నాయకుడుగా కన్పించిన వాడు పి.వి ఒక్కడే.-అత్యంత క్లిష్ట సమయంలో, ఆంధ్రప్రదేశ్ నాయకత్వ బాధ్యతను అధిష్టానం పి.వి.కి అప్పగించింది.

1971లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రిత్వ గురుతర బాధ్యతను ఒక సవాలుగా చేపట్టి 1973 వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ నిర్వహించారు. పి.వి ముఖ్యమంత్రిత్వంలో, ఆయన నాయకత్వంలో 1971లో రాష్ర్ట శాసనసభ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.1969-70 తెలంగాణ ఉద్యమం తరువాత ఒక సమైక్యతావాది పి.వి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం గొప్ప విషయమే. ఒక మారుమూల గ్రామం మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన పి.వికి రైతుల, వ్యవసాయదారుల సమస్యలు, జీవితాలు క్షుణ్ణంగా తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటానికి రైతు-భూమిలేని రైతు-భూదాహం ఒక ఇంధనంగా ఉపకరించిన సత్యాన్ని ఆయన ఎంతో పరిశీలన జరిపి తెలుసుకున్నాడు. -సాయుధ పోరాటం అనంతరం ఆచార్య వినోబాభావే తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర జరిపినప్పుడు కొంతవరకు పి.వి ఆ పాదయాత్రలో వెంట ఉన్నాడు.

చెమటోడ్చి శ్రమించే, నాగలిపట్టి నడిపే భూమిలేని లక్షలాది రైతులకు భూమిపై యాజమాన్యం కల్పించడం అత్యవసరమని ఆనాడే గాఢంగా విశ్వసించిన పి.వి ముఖ్యమంత్రి కాగానె, పేద ప్రజల బంధువుగా 1972 ఆగస్టులో చరిత్రాత్మకమయిన, విప్లవకరమయిన భూసంస్కరణల (భూగరిష్ట పరిమితి) చట్టాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు; తెలంగాణ ప్రజలు దీర్ఘకాలం నుంచి డిమాండు చేస్తున్న ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు అంతిమ నిర్ణయమని పి.వి సాహసవంతంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అంతకుముందు ఎన్నడూ లేనిరీతిగా బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఆయనదే. -పి.వి ప్రగతిశీల భావనలు, అభ్యుదయ చర్యలు, సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ భూస్వామ్య, ప్రజాస్వామ్య వ్యతిరేక వర్గాలకు తీవ్ర ఆగ్రహం కల్గించాయి. ముఖ్యమంత్రి పదవిని, అధికారాన్ని ఖాతరు చేయకుండా పి.వి ప్రగతిశీల విధానాలకు, చర్యలకు, సంస్కరణలకు, ప్రజల శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఇరవయి సంవత్సరాలు (1957-77) ఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక రంగాలలో శాసనసభ్యుడుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా అత్యంత కీలక పాత్ర నిర్వహించిన పి.వి అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా భారత జాతీయ రాజకీయ రంగంలో అడుగు పెట్టవలసి వచ్చింది. 1977 నుంచి 1996 వరకు వరుసగా ఆరు పర్యాయాలు పి.వి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి ఆంధ్రప్రాంతంలోని నంద్యాల నుంచి, మహారాష్ర్టలోని రామ్‌టెక్ నుంచి, ఒరిస్సాలోని బరంపురం నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం విశేషం. ప్రతిభావంతుడయిన పార్లమెంటేరియన్‌గా పి.వి ప్రసిద్ధి పొందారు. 1978లో పి.వి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్. కేంద్రంలో విదేశాంగశాఖ, దేశ వ్యవహారాలశాఖ, ప్రణాళికాశాఖ, రక్షణశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, జాతీయ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పి.వి నిర్వహించిన పాత్ర గణనీయమయినది.

మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా పి.వి దేశంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. విదేశాంగ మంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా పి.వి పొరుగు దేశాలతో, ముఖ్యంగా చైనాతో, పాకిస్తాన్‌తో సత్సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విదేశాంగ మంత్రిగా పి.వి.నిరాయుధీకరణపై ఐక్యరాజ్య సమితిలో కావించిన చరిత్రాత్మక ప్రసంగం అనేక దేశాల అధినేతల ప్రశంసలు పొందింది. ఇజ్రాెుల్‌కు దౌత్యపరంగా భారత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం పి.వి సాహసవంతంగా చేసిన నిర్ణయం. ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంభాలకు గురిఅయి స్వతంత్ర భారత దేశం అత్యం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, అప్పటికే బైపాస్ సర్జరీ జరిగిన పి.వి దేశం కోసం ప్రధానమంత్రి పదవి గురుతర బాధ్యతను అంగీకరించవలసి వచ్చింది.

1991 జూన్ 21వ తేదీన పి.వి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు. నాడు ప్రధానమంత్రిగా పి.వి అపూర్వ, మహత్తర ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశానికి విపరీత ఆర్ధిక సంభం నుంచి విముక్తి కల్గించారు; రాజకీయ సుస్థిరత్వంతో, పరిపాలనా దక్షతతో పి.వి స్వతంత్ర భారతాన్ని అభివృద్ధి పధంలో పురోగమింప చేసారు. పి.వి ఆర్ధిక సంస్కరణలకు ఇంతవరకు ప్రత్యామ్నాయ సంస్కరణలు రాలేదన్నది గమనార్హ విషయం. పి.వి పాలనలోనె స్వతంత్ర భారతదేశం ఆత్మవిశ్వాసంతో నూతన శతాబ్దంలో అడుగుపెట్టింది.

పి.వి పలు భారతదేశ భాషలలో, విదేశీ భాషలలో మహా పండితుడు. తెలుగు సాహిత్యం వివిధ ప్రక్రియలలో పి.వి ఆరితేరిన సృజనాత్మక రచయిత, కవి, విమర్శకుడు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తెలుగులో రచించిన ‘వేయి పడగలు’ నవలకు పి.వి హిందీ అనువాదం ‘సహస్రఫణ్’ అవార్డులు పొందింది. హరినారాయణ్ ఆప్టే మరాఠి నవలను పి.వి తెలుగులోకి అనువదించారు. వైవిధ్యభరిత భారతీయతకు, భారతీయ సమున్నత, పరమ ఉదాత్త ఆత్మకు ప్రతిబింబం, ప్రతీక పి.వి ఆయన భారత తలమానికం. మహనీయుడు పి.వి అక్షరాల జాతీయవాది, అకళంక దేశభక్తుడు. ఆయన అన్ని విధాల భారతరత్న అవార్డుకు అర్హుడు. తెలంగాణ బిడ్డ ప్రపంచ ప్రఖ్యాత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పి.వి శతజయంతి ఉత్సవాలు జేగీయమానంగా తెలంగాణ రాష్ర్టంలో, కొన్ని ఇతర దేశాలలో ప్రారంభం కావడం ప్రమోద కారణం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News