బెంగళూరు: ఓటర్ల జాబితాలో అవకతవకలపై తాను ప్రశ్నలు సంధిస్తుంటే ఎన్నికల సంఘం ప్రమాణ పూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని అడుగుతోందని లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను పార్లమెంట్లోనే రాజ్యాంగంపై ప్రమాణం చేశానని, ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముందన్నారు. శుక్రవారంనాడు ఇక్కడ నిర్వహించిన ‘ఓటు అధికార ర్యా లీ’లో రాహుల్ ప్రసంగించారు. పక్కా సమాచారంతో ప్రజలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తుంటే ఎదురు ప్రశ్నలు వేస్తోందని ఈసీ వైఖరిని దుయ్యబట్టారు. ప్రశ్నించడం మొదలు పెట్టగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఈసీ వెబ్సైట్లను ఎందుకు మూసివేశారని రాహుల్ ప్రశ్నించారు. తనను బెదిరించడానికి బదులు ఈ సందర్భంగా తాను సంధిస్తున్న ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాహుల్ సవాల్ విసిరారు. అవి 1. భారత ప్రజలందరికీ బహిరంగపరచడానికి బదులు డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు. 2. సిసిటివి ఫుటేజీ ఎందుకు ఇవ్వట్లేదు, దాని వెనక ఉన్నది ఎవరు. ఆ సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు. 3. నకిలీ ఓట్ల నమోదును ఇప్పటికీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. 4. జవాబులు చెప్పడానికి బదులు ఈసీ ఎందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. 5.బిజెపికి ఏజెంట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించారు. 25 లోక్సభ స్థానాల్లో బొటాబొటీ మెజారిటీతో బిజెపి గెలిచిందని, అందువల్లే ఈ రోజు ప్రధాని పీఠంపై మోడీ కూర్చున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈవీఎంల డేటాను గనుక బయటపెడితే దొంగతనంగా ప్రధాని పీఠాన్ని మోడీ ఎలా ఎక్కారో బయటపడుతుందన్నారు.
‘సర్’ సంస్థాగతీకరించిన చోరీ : రాహుల్
బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ను సంస్థాగతీకరించిన చోరీగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం నిర్వహించడంతో బిజెపితో కుమ్మక్కవుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన చోరీని తాము పట్టుకున్నామని, అది వారికీ తెలుసునని, అందువల్లనే, ఈసీ బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన యూట్యూబ్ చానల్ లో విడుదల చేసిన వీడియోలో గాంధీ ఈ ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎన్నికలను దోపిడీకి బిజెపితో కలిసి కుట్రపన్నుతున్నదని కూడా ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఓ పద్ధతి ప్రకారం ఓటు చోరీని ఓ మోడల్ గా ఉపయోగిస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ చేసిన దర్యాప్తు, దానిలో వెల్లడైన విషయాలను వివరిస్తూ వీడియోను విడుదల చేశారు.
2024 లోక్ సభ ఎన్నికలలో కర్ణాటక లోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన అక్రమాలు, కాంగ్రెస్ దర్యాప్తులో వెల్లడైన వివరాలను ఈ వీడియో తేటతెల్లంచేసింది. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానంలో మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు రకాల అవకతవకలు జరిగాయని, లక్షకు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని వీడియోలో రాహుల్ నొక్కి చెప్పారు. మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో లక్షా 250 ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ వాదించారు. మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,250 ఓట్లు దొంగిలించబడ్డాయని ఆయన చెబుతున్నారు.దేశవ్యాప్తంగా అలాంటి 100 సీట్లలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇక్కడ జరిగిందే ఆ సీట్లలోనూ జరిగింది అని రాహుల్ ఆరోపించారు. బీజేపీకి 10-15 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే, మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. ఇండియా బ్లాక్ ప్రభుత్వంలో ఉండేదని పేర్కొన్నారు. మహదేవపురలో మహదేవ పుర సెగ్మెంట్ ఓట్ల చోరీని విశ్లేషిస్తూ, నియోజకవర్గంలో లక్షా 250 ఓట్లు చోరీ అయ్యాయి.11,965 నకిలీ ఓటర్లు, 40వేల 9 నకిలీ, చెల్లని చిరునామాలలో ఉన్నవారు.
10,456 మంది బల్క్ ఓటర్లు లేదా ఒకే అడ్రస్ లో ఉన్నవారు. 4,132 మంది చెల్లని ఫోటోలు కలిగిన ఓటర్లు, 33,692 మంది ఓటర్లు కొత్త ఓటర్ల ఫామ్ 6 లో మిస్సింగ్ అయిన వారు అని ఆయన తెలిపారు. ఒక్క మహదేవపుర సెగ్మెంట్ లోనే 11,965 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గాందీ ఆరోపించారుఒక గురుకీరత్ సింగ్ దాంగ్ అనే వ్యక్తి నాలుగు బూత్ లలోనీ ఓటర్ల లిస్ట్ లో కన్పించాడని ఆయన దుయ్యబట్టారు. తమకు సందేహాలు వచ్చినప్పుడు ఓటర్ల జాబితా, వీడియో రికార్డింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసినా,తమకు ఓటర్ల జాబితా కానీ, వీడియో రికార్డింగ్ కానీ ఇవ్వలేదని, ఇదే తమ అనుమానాలకు మూలం అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.