Home తాజా వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం

Rainstorm across the Telangana state

 

నెలకొలరిగిన స్తంభాలు…తడిసిపోయిన ధాన్యపురాశులు
పిడుగుపాటుకు ఎద్దు మృతి
జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక

మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. మంచిర్యాల జ్లిలా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించగా, పలు మండలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ధాన్యం తడిసింది. గాలివాన బీభత్సానికి వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసిన ధాన్యపు రాశులు తడిసిముద్దయ్యాయి.

ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో గొర్రెలమందపై పిడిగుపడి మూడు గొర్రెలు మృతిచెందాయి. పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ధాన్యం తడవగా, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలతో పాటు దరూర్, కెటిదొడ్డి, గట్టు, ఐజలో శనివారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జిల్లాలోని కాటారం సబ్ డివిజన్ పరిధిలో గాలీ వాన బీభత్సం సృష్టించగా పలుచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కాళేశ్వరం ఆలయ ఆవరణంలో మేడి చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతోపాటు పలువురి ఇంటి పై రేకులు ఎగిరిపోయాయి. మరోవైపు మల్హర్ మండలం అన్సన్ పల్లి గ్రామానికి చెందిన నేతేట్ల శంకర్ అనే రైతు ఎద్దు పిడుగు పాటుతో మృతి చెందింది.

నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

ఇరు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి తగ్గుముఖం ఉష్ణోగ్రతలు పట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో అత్యధిక వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ప్రకటించగా, రెండురోజుల ముందే కేరళను తాకాయని, అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇవీ దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు సమయం పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. జూన్ 9, 10 తేదీల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మాత్రం కేరళకు జూన్ 5న నైరుతి రుతువపనాలు వస్తాయని, ఈసారి ఆలస్యంగా వస్తున్నాయని తెలిపింది.

రాగల 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు ‘నైరుతి’ విస్తరణ

పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకొని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో జూన్ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

పలుజిల్లాల్లో వడగాల్పులు

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆదివారం కొన్నిచోట్ల, సోమవారం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.