Sunday, May 5, 2024

అకాడమీ కేసులో మరో కీలక వ్యక్తి రాజ్‌కుమార్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Rajkumar arrested in Telugu akademy case

రాజ్‌కుమార్ యుబిఐ మేనేజర్ మస్తాన్ వలీ సహచరుడు
తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డికి నోటీసులు
అజ్ఞాతంలో నలుగురు సిబ్బంది

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు అకాడమీ ఎఫ్‌డిల గోల్‌మాల్ కేసులో ఎ-2గా ఉన్న రాజ్ కుమార్‌ను ఆదివారం నాడు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు. అకాడమీ ఎఫ్‌డిల గోల్‌మాల్ కేసులో యూబిఐ మేనేజర్ మస్తాన్ వలీకి రాజ్‌కుమార్ సహచరుడుగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. నాలుగు రోజులుగా పరారీలో ఉన్న రాజ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో సిసిఎస్ పోలీసులు మరోసారి యూబిఐ బ్యాంకు సిబ్బంది, అధికారులను విచారిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు కెనరా బ్యాంకు డిజిఎంతో పాటు యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకు సిబ్బంది విచారణకు హాజరయ్యారు. అలాగే సోమవారం నాడు తెలుగు అకాడమీ సిబ్బందిని పోలీసులు విచారించనున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఫోర్జరీ సంతకాల వ్యవహారంలో తెలుగు అకాడమీకి చెందిన ఓ కీలక వ్యక్తిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి సోమిరెడ్డిని విద్యాశాఖ తప్పించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ గోల్‌మాల్‌ను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి నోటీసులు

తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి సిసిఎస్ నోటీసులు జారీ చేసింది. నిధుల గోల్‌మాల్‌పై జరిగే విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారి రమేశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ కార్యాలయంలో ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రఫీతో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపించారని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అజ్ఞాతంలో నలుగురు సిబ్బంది 

తెలుగు అకాడమీలో డిపాజిట్ల కుంభకోణంలో బ్యాంకు మేనేజర్లతో పాటు, అకాడమీకి చెందిన ఉద్యోగుల హస్తం కూడా ఉందనే ఆనుమానాల్ని వ్యక్తమవుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్‌తో సంబంధమున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News