Sunday, April 28, 2024

తుస్సుమన్న బండి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

Vinod Kumar refuted BJP leaders' remarks on TRS rule

ప్రజల నుంచి స్పందన లేదు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనమే ఉందని.. అందుకే ఆయనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనపై బిజెపి నాయకుల వ్యాఖ్యలను వినోద్ కుమార్ తిప్పికొట్టారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం లేదన్న బిజెపి నేతల వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హుస్నాబాద్ బహిరంగ సభలో విమర్శలు చేయటం హాస్యాస్పదమని అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు కనీసం ఒక్కటైనా మంజూరు చేయలేదని విమర్శించారు. ఈ విషయంపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వినోద్ కుమార్ వెల్లడించారు. విద్య, వైద్యంలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని, మరో 4 కాలేజీలు కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. పిజి మెడికల్ సీట్లు వేలల్లో పెంచామని తెలిపారు. ప్రతి జిల్లాకు డయాజ్ఞస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు.

పార్లమెంట్‌లో బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం మాట్లాడారు..?

పార్లమెంట్‌లో ఒంటి కాలుపై నిలబడి పట్టుబట్టి బీబీనగర్ ఎయిమ్స్‌ను సాధించుకున్నామని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం మాట్లాడారని నిలదీశారు. ఆయన తెలంగాణకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేదని అన్నారు. రాష్ట్రంలో అల్వాల్, ఎర్రగడ్డ, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతుందని, ఈ విషయం సిఎం కెసిఆర్ ఎప్పుడో ప్రకటిస్తే, బిజెపి ఎంపిలు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర బిజెపి ఎంపీలకు దమ్ముంటే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి ఐదారు వేల కోట్ల తీసుకురావాలని సవాల్ విసిరారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు బిజెపి పాలిత రాష్ట్రంలో ఇక్కడి నేతలు చెప్పేవి అమలవుతున్నాయా…? అని ప్రశ్నించారు.

బిజెపి నేతలు చెప్పేవి ముందు ఆ రాష్ట్రాలలో అమలు చేయాలని చెప్పారు. బిజెపి పార్టీ నిరాశానిస్పృహలో ఉంది వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదనేది అవాస్తవమని తెలిపారు. బిజెపి పాలిత ప్రాంతాల్లోనే 2 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణకు ఎంత కరవు వచ్చినా మూడేళ్ల వరకు నీటి సమస్య ఉండదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు ఉదయం పూట కరెంట్ వస్తుందని, 24 గంటల కరెంట్ మాకు వద్దు అనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. విద్యారంగంలో రాష్ట్రం గణీనయంగా ప్రగతిపథంలో పయనిస్తోందని అన్నారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వందలాది గురుకుల పాఠశాలలు నెలకొల్పిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఈ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులపై ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు పూర్తి రాయితీగా ఇస్తుందని తెలిపారు.

ఎన్నికల కమిషన్ అనుమతిస్తే హుజురాబాద్ సిఎం సభలు

హుజురాబాద్‌లో సిఎం కెసిఆర్ సభలకు ఎన్నికల కమిషన్‌ను అనుమతి అడుగుతామని వినోద్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే హుజురాబాద్‌లో సిఎం కెసిఆర్ సభలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుందని చెపారు. నాగార్జున సాగర్‌లో బిజెపికి డిపాజిట్‌కు దిక్కులేదని విమర్శించారు. దుబ్బాకలో సిబ్బందితో ఓడిపోయామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News