Tuesday, April 30, 2024

వ్యాక్సిన్ సం’క్రాంతి’

- Advertisement -
- Advertisement -

సంక్రాంతిలోపే వ్యాక్సిన్ పంపిణీ షురూ!
పది రోజుల్లోనే పంపిణీ చేపడతాం- కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఎప్పుడు టీకా పంపిణీ ప్రారంభమవుతుందా అని యావద్భారతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని.. ఈ కార్యక్రమాన్ని పది రోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ అనుమతి పొందిన తేదీ(జనవరి3)నుంచి 10 రోజులోపే టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే సంక్రాంతి నాటికల్లా దీనికి సంబంధించి ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే ప్రత్యేక టీకా నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేంద్రాలలో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లను, వాటి ఉష్ణోగ్రతలను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో ఈ తరహా విధానాన్ని దశాబ్ద కాలంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ టీకా ప్రధాన నిల్వ కేంద్రాలను హర్యానాలోని కర్నాల్, ముంబయి, చెన్నై, కోల్‌కతాలలో ఏర్పాటు చేశామని, వీటితో పాటుగా కేంద్ర ఔషధ నిల్వ సంస్థ(ఎంఎన్‌ఓ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక్కడినుంచి ఆయా ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని తెలిపారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా చైన్ ఎలా ఉంటుందనే దానిపైనా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు మొదట కేంద్రం ఆధ్వర్యంలోని నాలుగు ప్రధాన టీకా నిల్వ కేంద్రాలకు పంపిస్తాయని, అక్కడినుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న 37 సరఫరా కేంద్రాలకు తరలిస్తామని తెలిపింది. అనంతరం వాటిని జిల్లా నిల్వ కేంద్రాలకు, తద్వారా టీకా అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేస్తామని వెల్లడించింది. వ్యాక్సిన్లను నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29 వేల కోల్డ్‌చైన్ కేంద్రాలున్నట్లు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ కోసం తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అయితే కరోనా పోరులో ముందున్న ఆరోగ్య సిబ్బంది, పేర్లను కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవలసిన అవసరం లేదని , ఇప్పటికే వారికి సంబంధించిన సమాచారం కేంద్రం వద్ద ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ కోవిన్ యాప్‌ను ప్రపంచం కోసం భారత్‌లో రూపొందించారని, ఏ దేశం కావాలనుకుంటే ఆ దేశం దాన్ని ఉపయోగించు కోవచ్చని, భారత ప్రభుత్వం అందుకు తోడ్పాటు అందిస్తుందని భూషణ్ తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో రోజురోజుకు కరోనా యాక్టివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండడంతో పరిస్థితి నిలకడగా మెరుగవుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ చెప్పారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నామని కూడా ఆయన చెప్పారు.

వ్యాక్సిన్ల ఎగుమతిని నిషేధించలేదు

కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించలేదని, ఇది సుస్పష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా భూషణ్ చెప్పారు. ఈ విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని కూడా ఆయన మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు.

Ready to Vaccine distribution within 10 days in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News