Monday, May 6, 2024

కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంది: రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అధికారం తమదేనని, అధికారంలోకి రాగానే రూ.4000 పెన్షన్‌ను ఇచ్చి తీరుతామని దీనికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచినట్లే రూ.4000ల పెన్షన్ ఇచ్చి తీరతామన్నారు. ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన సభ’ను విజయవంతం చేసినందుకు ఆయన ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 1లక్ష 7 గ్రామాలకు విద్యుత్ అందించింది కాంగ్రెస్ అని, పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్స్ తీసుకొచ్చి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించింది తమ పార్టీ అని ఆయన తెలిపారు. నగరానికి ఆదాయం తెచ్చే ఔటర్, ఐటీ తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలు పెట్టిందన్నారు. నిన్నటి ఖమ్మం సభ చూసైనా మమ్మలను విమర్శించిన వారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు
రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు ఉంటాయని, రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో మా ప్రాధాన్యత రూ.4000ల పెన్షన్ ఇవ్వడమని ఆయన పేర్కొన్నారు. భట్టి చదువుకున్న ప్రజాప్రతినిధి అని, అతన్ని దళితుడని చిన్నచూపు చూసే వారు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఏ హోదాలో రాహుల్ ఇక్కడికు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని,

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కుమారుడిగా రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్‌గాంధీ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉందో విమర్శించిన వారే గ్రహించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News