Sunday, April 28, 2024

వరంగల్‌కు 100% స్మార్ట్ సిటీ నిధుల విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జూన్ 2015లో స్మార్ట్ సిటీ మిషన్‌ను ప్రారంభించిందని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మే 2016లో స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కిందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ స్మార్ట్ సిటీ నిమిత్తం కేంద్రం నిధులను విడుదల చేయగా వాటిని యధావిధిగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించామని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.196.40 కోట్లను కేటాయించగా వాటిలో మొత్తం నిధులను వరంగల్‌కు బదిలీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనుల కింద మంజూరైన నిధులు 100 శాతం నిధులను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విడుదల చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన 196.40 కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో రూ.2.50 కోట్లు, 2017-18 లో రూ.32 కోట్లు 2020-21లో రూ.161.90 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ నగరంలో రూ.1029.02 కోట్లతో 63 పనులు చేపట్టగా రూ.46.67 కోట్ల విలువగల పనులు పూర్తి అయ్యాయని, రూ.40.67 కోట్లు ఖర్చు చేసినట్లు అర్వింద్‌ కుమార్ తెలిపారు.
వరంగల్ కార్పొరేషన్‌లో సరిపడా నిధులు
మే 2021 వరకు స్మార్ట్ సిటీ పనుల నిర్వహణ కోసం వరంగల్ కార్పొరేషన్‌లో సరిపడా నిధులు ఉన్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. వరంగల్ కార్పొరేషన్‌లో పనుల పురోగతి మేరకు అవసరమున్న దానికంటే అధికంగా నిధులు ఉన్నాయని, నిధులు ఉన్నప్పటికీ పనులు చేపట్టడంలో ప్రాథమికంగా జాప్యం, భూసేకరణ, సవివరణ ప్రాజెక్ట్ నివేదిక(DPR)ల తయారీ లాంటి పనుల్లో జాప్యం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం సొంత బడ్జెట్ నుంచి సుమారు రూ.182 కోట్లు కేటాయించిందని, ఇందులో సిఎం నిధుల కింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి క్రింద రూ.72.87 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనులు పూర్తయి బిల్లులు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన తమ వాటా మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి తెలియజేశారు.

Rs 196 Cr Smart City Funds Transferred to Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News