Sunday, May 5, 2024

ఉక్రెయిన్‌పై యుద్ధానికే రష్యా మొగ్గు

- Advertisement -
- Advertisement -

Russia's series of statements on developments in Ukraine

శాంతి ఒప్పందాలు పరిష్కరిస్తాయనుకోవడం లేదు
ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా వరుస ప్రకటనలు
యుద్ధానికే మొగ్గు చూపుతున్న మాస్కో

మాస్కో: ఉక్రెయిన్-, రష్యా పరిణామాలు గడియకో విధంగా మారుతున్నాయి. ఓ వైపు వివిధ దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు రష్యా సమర సన్నాహాలను ఉధృతం చేస్తోంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు దాన్నే రుజువు చేస్తునాయి. ఉక్రెయిన్ తాజా వివాదాన్ని గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాల పరిష్కరించలేవని స్పష్టం చేశారు. 2015లో జర్మనీ, ఫ్రాన్స్, కీవ్, రష్యాల నడుమ కుదిరిన ఒప్పందం తాజా ఉద్రిక్తతలను పరిష్కరిస్తుందనుకోవడం లేదన్నారు. మరోవైపు రష్యాలో చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ పౌరులను కాల్చిచంపినట్లు రష్యా సైన్యం సోమవారంనాడు ప్రకటించింది.

రష్యా ఆర్మీ చేసిన తాజా ప్రకటన మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే ఉక్రెయిన్ వర్గాలు రష్యా సైన్యం ప్రకటనను తోసిపుచ్చాయి. మా పౌరులెవరూ కాల్పుల్లో మరణించలేదని కీవ్ వర్గాలు ప్రకటించాయి. ఇదిలావుండగా ఉక్రెయిన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం వెల్లడించిన కొద్ది సేపటికే దానికి విరుద్ధమైన ప్రకటన వెలువడింది. రష్యా అధ్యక్ష భవనమైన ‘క్రెమ్లిన్’ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ “ ఏ విధమైన శిఖరాగ్ర సమావేశాల ప్రణాళికలు చర్చించడానికి ఇది సమయం కాదు.

విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి మాత్రమే ఓ అవగాహన కుదిరింది” అన్నారు. అంతేకాక అధ్యక్షుల స్థాయి సమావేశం నిర్వహించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సోమవారం సాయంత్రం దేశ రక్షణ మండలి భేటీ నిర్వహించారు. ఇదిలావుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సోమవారం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్‌వైవ్స్ లే డ్రియన్‌తో ఫోన్‌లో చర్చించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ అంశంపై సమావేశం అవుతారని ఫ్రాన్స్ ప్రకటించిన కొన్ని గంటలకే ‘క్రెమ్లిన్’ ప్రతినిధి దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణించారు. అంతేకాక, డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం జరిపే దాడులను తీవ్రంగా తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.

వాగ్దానాన్ని వెనక్కి తీసుకున్న రష్యా

ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దు నుంచి వేలాది మంది సైనిక బలగాలను వెనక్కి తీసుకుంటానని ఇదివరకు చేసిన వాగ్దానాన్ని రష్యా ఆదివారం వెనక్కి తీసేసుకుంది. ఉక్రెయిన్‌కు ఉత్తరాన ఉన్న పొరుగు నగరం బెలారస్‌కు రష్యా 30 వేల సైన్యాన్ని ఇటీవల తెచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దులో ఇప్పటికే లక్షన్నర సైనిక బలగాన్ని మోహరించి ఉంచింది. అంతేకాక అక్కడ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి, ఇతర యుద్ధ సామాగ్రిని చేర్చింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ మీద రష్యా విరుచుకుపడవచ్చని బెలారస్ ఆందోళనలు వ్యక్తంచేసింది. రష్యా దాడిచేస్తే పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తామని పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. కాగా బెలారస్‌లో శనివారం రష్యా అణు విన్యాసాలు, సాంప్రదాయిక కవాత్తులు నిర్వహించింది. ్ర

భేటీకి సూత్రప్రాయంగా జోబైడెన్ అంగీకారం

ఉక్రెయిన్‌పై దాడి చేయకపోతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ విషయాన్ని అమెరికాలోని ‘వైట్ హౌస్’ ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికా పదేపదే రష్యాను హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్‌పై దాడిచేసే ఉద్దేశం లేదని రష్యా ఖండిస్తూ వచ్చింది. “రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయనంత వరకు మేము దౌత్యాన్ని అనుసరిస్తాము” అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. “ రష్యా ఒకవేళ యుద్ధాన్ని ఎంచుకుంటే మేము ‘స్విఫ్ట్’ను విధిస్తాము. ఉక్రెయిన్‌పై దాడిచేయడానికి ప్రస్తుతం రష్యా సన్నాహాలు చేసుకుంటోందని అనిపిస్తోంది” అని కూడా ఆమె తెలిపారు. కాగా ఒకప్పటి సోవియట్ యూనియన్ రాష్ట్రమైన ఉక్రెయిన్‌ను ‘నాటో’లో చేర్చమనే హామీని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News