Tuesday, May 7, 2024

11 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లు

- Advertisement -
- Advertisement -

ఆసియా ఖండంలోనే సైఫన్లతో నీటి విడుదలయ్యే రెండో ప్రాజెక్టు
వరద పోటెత్తడంతో ఆటోమేటిక్‌గా తెరుచుకునే సాంకేతికత వీటి సొంతం

మనతెలంగాణ/హైదరాబాద్: రాజులు పోయినా, రాజ్యాలు పోయినా, సంస్థానాధీశుల ఆశయాలు, వారి ప్రజాసేవ నేటికి చెక్కుచెదరని జ్ఞాపాకాలుగా ప్రజల్లో నిలిచిఉన్నాయి. దూరదృష్టితో ప్రజాసంక్షేమం, అభివృధ్దిని కోరుకునే సంస్థనాధీశులు నిర్మించిన చెరువులు నేటికీ వారి ఆశయాలను సాకారం చేస్తూనే ఉన్నాయి. ప్రజారంజకంగా పాలించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తూ, రైతుల సంక్షేమమే లక్షంగా నిర్మించిన సరళా సాగర్ నేటికి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంది. భారీవర్షాలకు నేటికి చెక్కు చెదరక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఇంజనీరింగ్ పద్ధతిలో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్ గేట్లు తెరుచుకున్నాయి. చెరువులను, కుంటలను నింపుతూ సాగుభూముల్లోకి పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక ప్రాజెక్టు చరిత్రలోకి వెళ్లితే.. వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మ పేట గ్రామ శివారులో నిర్మించిన సరళాసాగర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. 1947 జూలై 10న వనపర్తి సంస్థానాధీశులైన రామేశ్వర్ రావు తన తల్లి సరళాదేవి పేరుమీద ఈ ప్రాజెక్టు నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇంజనీర్లను అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించి ప్రాజెక్టులపై అధ్యయనం చేసిన అనంతరం డిజన్ ఖరారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి పిఎస్ రామకృష్ణ ఇంజనీరుగా బాధ్యతలు నిర్వహించారు. ఆసియా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్‌తో నిర్మించిన ప్రాజెక్టుగా సరళాసాగర్ ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంస్థానాధీశుడు రామేశ్వర్ రావు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఇంజనీరింగ్ విధానాన్ని ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. 21సైఫన్ ఫ్రేమింగ్ ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుకే సొంతం. ఇందులో 17 హుడ్ సైఫన్‌లు కూడా ఉన్నాయి.

సైఫన్ పద్ధతి ప్రత్యేకత ఏమిటంటే ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం చేరితే గాలి ఒత్తిడి ద్వారాలు అటోమెటిక్‌గా ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకోక్క సైఫన్ నుంచి సెకనుకు 2000ల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధం ఈ ప్రాజెక్టుకే సొంతం. ఈ పద్ధతి ఆసియాలోనే ఆనాడు మొదటిది కావడంతో అనేక మంది విదేశీ ఇంజనీర్లు కూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. ఒక మోడల్ ప్రాజెక్టుగా ఇది నేటికి చరిత్రలో నిలిచి పోయింది. రామేశ్వర్ రావు దూరదృష్టి, ఆధునిక విజ్ఞానంపై ఉన్న పట్టుకు ఈ ప్రాజెక్టు తార్కాణం. ప్రాజెక్టు కింద 10 గ్రామాల్లోని 4184 ఎకరాల ఆయకట్టుకు నీరు పారేవిధంగా ఈ ప్రాజెక్టును డిజన్ చేశారు. ఆనాడే 35 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే, 1947లో ప్రాజెక్టుకు శంఖుస్థాపన జరిగితే నిరంతరాయంగా 1949 వరకు ప్రాజెక్టును నిర్మించారు. 1949 సెప్టెంబర్ 15న ఆనాటి హైదరాబాద్ మిలటరీ జనరల్ జయంతోనాథ్ ప్రారంభించారు. అయితే ప్రాజెక్టు సంపూర్ణంగా 1959లో పూర్తి చేశారు. సంపూర్ణంగా సిద్ధం చేసిన ఈ ప్రాజక్టును ఆనాటి పి.డబ్లూ.డి శాఖ మంత్రి జె.వి.నర్సింగారావు ప్రారంభించారు. 4448 మీటర్లపొడవు కట్టను నిర్మించారు. 108 మీటర్ల వరకు మట్టితో, 158 మీటర్లు దూరం రాతితో ప్రాజెక్టు కట్టను పటిష్టంగా నిర్మించారు. 8 కిలోమీటర్ల కుడికాల్వ ద్వారా 388 ఎకరాలు, 17 కిలోమీటర్ల ఎడమకాలువ ద్వారా 3796 ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా నీరు అందించడం లక్ష్యం. ప్రస్తుత వర్షాకాలంలో భారీవరదలను తట్టుకుని నిలుచున్న ఈ ప్రాజెక్టు గేట్లు ఆటోమెటిక్ పద్దతిలో తెరుచుకోవడంతో ప్రాజెక్టునుంచి భారీ ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. వనపర్తి సంస్థానాధీశులు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనంగా చరిత్రకారులు నేటికీ విశ్లేషించడం గమనార్హం.

Sarala sagar Dam siphon gates opened with Automatically

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News