Sunday, April 28, 2024

నదులను కాపాడుకునే బాధ్యత అందరిది

- Advertisement -
- Advertisement -

ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్
ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ’మూసీ రివర్ ఫ్రంట్ వాక్’

మనతెలంగాణ/ హైదరాబాద్ : నది జలాలు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, కెనడా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్‌జంగ్ మ్యూజియం వద్ద ’ మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. అనంతరం చారిత్రాత్మక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ దేశంలో అనేక నదుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, కొన్ని దశాబ్దాలుగా నదులు మరింత కలుషితం అవుతున్నాయని అన్నారు. మూసీ నది చారిత్రక ప్రాముఖ్యత, విలువలను తెలియ చేయడానికి, వాటి రక్షణ, పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వాక్ ఏర్పాటు చేశామన్నారు. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వరల్డ్ రివర్స్ డే వ్యవస్థాపకులు మార్క్ ఏంజెలో అభినందనలు తెలిపినట్లు చెప్పారు. జల మార్గాలు మన జాతీయ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలని, జలమార్గాలను పునరుద్ధరించడం.. వాటి అభివృద్ధి దేశపు ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి, జీవనోపాధి, పర్యాటకాన్ని ఉత్తేజపరుస్తుంది.

నీటి మార్గాల ద్వారా కనెక్ట్ అవ్వడం అంటే, ఐదు ప్రకృతి మూలకాలలో నీటి ద్వారా మనం ప్రజలకు, వారి అభివృద్ధికి కార్యాచరణ ద్వారామరింత దగ్గరగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర అవసరాలు ముఖ్యంగా నీటిపై దృష్టి సారించి, దృఢ సంకల్పంతో, పుష్కలమైన కాల్వలతో నీటి రవాణాకు,పంట నీటిపారుదల, జలవిద్యుత్, తాగునీటి సరఫరా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా మొదలైన ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ -ప్రయోజకరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టి సాధించారు.

బహుళ ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ రామకృష్ణ, .క్వాజిత్ తౌసిఫ్ ఇక్బాల్, ఇవాన్ అభిషేక్ మూసీ నది పుట్టుక, పరివాహక ప్రాంతాలు, మూసీ నది ప్రాముఖ్యతపై మాట్లాడారు. కార్యక్రమంలో ఫోరమ్ సభ్యులు వేణుగోపాలరావు, పి.నరహరి, ఎండి అఫ్జల్, సుదర్శన్‌రెడ్డి, ఆదర్శ్, పర్యావరణవేత్తలు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు,సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News