Sunday, April 28, 2024

మహారాష్ట్రలో కరోనా రెండో దశ

- Advertisement -
- Advertisement -

Second Covid-19 wave in Maharashtra

నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం
పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన

న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నిపుణుల బృందం ఒకటి రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి లేఖ రాసింది.‘ మహారాష్ట్ర.. కరోనా రెండో దశ ప్రారంభంలో ఉంది. వైరస్ పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వచ్చిన వ్యక్తుతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి గుర్తించడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటించడంలో నిర్లక్షంగా ఉంటున్నారు.

వైరస్ వ్యాప్తి పరిస్థితులపై జిల్లా యంత్రాంగాల్లో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదని కేంద్ర బృందం గుర్తించింది. ఇప్పటికే చాలా చర్యలు చేపట్టామనే భావనలో వారు ఉన్నారు. ఈ పరిణామాలే కేసుల పెరుగుదలకు దారి తీశాయి’ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఔరంగాబాద్, నాసిక్, జలగావ్, నాగ్‌పూర్ వంటి జిల్లాల్లో తీసుకువచ్చిన పాక్షిక లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫూ, వారాంతపు లాక్‌డౌన్ వంటి నిబంధనలు వైరస్ వ్యాపిని అరికట్టడంలో తక్కువ ప్రభావం చూపుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాలు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైనెంట్ వ్యూహంపై దృష్టి పెట్టాలని సూచించింది. గత ఏడాది ఆగస్టుసెప్టెంబర్‌లో ఎలాంటి వ్యవస్థ తీసుకువచ్చామో ఇప్పుడు కూడా అలాంటి వూహాన్ని అమలు చేయాలని సూచించింది. ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, నాసిక్‌లోని వసంతరావు పవార్ వైద్య కళాశాలలాంటి కొన్ని ఆస్పత్రుల్లో వైరస్‌తో చేరిన రోగుల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని,పూర్తి జన్యుశ్రేణి నిర్ధారణ కోసం శాంపిళ్లను పంపించడంతో సహా దీనిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఐసిఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా పరీక్షలను గణనీయంగా పెంచాలని కూడా కేంద్రం ఆ లేఖలో సూచించింది. మహారాష్ట్రలో గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ 15 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఇటీవల కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. సినిమా థియేటర్లలో కెపాసిటీని సగానికి తగ్గించింది. వివాహాది శుభకార్యాలకు కూడా పరిమిత సంఖ్యలో హాజరవ్వాలని, కార్యాయాలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News